కిరాణా దుకాణంలో నల్లమందు

ABN , First Publish Date - 2022-07-02T15:06:35+05:30 IST

కిరాణా దుకాణం ముసుగులో నల్లమందు స్మగ్లింగ్‌ చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు

కిరాణా దుకాణంలో నల్లమందు

రాజస్థాన్‌ నుంచి నగరానికి..

అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ అరెస్ట్‌


హైదరాబాద్‌ సిటీ: కిరాణా దుకాణం ముసుగులో నల్లమందు  స్మగ్లింగ్‌ చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 4 కేజీల నార్కొటిక్‌ డ్రగ్‌ (ఓపీఎం), రూ. 2లక్షల నగదు సహా.. మొత్తం రూ. 35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

రాజస్థాన్‌ జోద్‌పూర్‌ జిల్లా పిప్పాడ్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ పటేల్‌ నగరానికి వచ్చి చందానగర్‌లో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో అప్పులపాలయ్యాడు. రాజస్థాన్‌కు చెందిన స్నేహితుడు గిరిధారికి ఫోన్‌ చేసి బాధపడుతూ తనను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని కోరేవాడు. రాజస్థాన్‌లో ఎక్కువగా వియోగించే నార్కోటిక్‌ డ్రగ్‌ (నల్లమందు)ను హైదరాబాద్‌లో సరఫరా చేస్తే అప్పులు తీరిపోయి ఆదాయం మిగిలే అవకాశాలు ఉన్నాయని గిరిధారి సలహా ఇచ్చాడు. దాంతో రెండు నెలల క్రితం ఓం ప్రకాశ్‌ సొంత గ్రామమైన పిప్పాడ్‌కు ట్రావెల్‌ బస్సులో వెళ్లాడు. అక్కడ గిరిదారి వద్ద కేజీకి రూ. 1.30లక్షలు చెల్లించి కొంత మోతాదులో నల్లమందు కొన్నాడు. దాన్ని చాకచక్యంగా నగరానికి తరలించి తన కిరాణా దుకాణంలో నిల్వ చేశాడు. ఆ తర్వాత కస్టమర్స్‌కు కేజీ  నార్కొటిక్‌ డ్రగ్‌ను రూ. 6-8 లక్షలకు విక్రయించేవాడు. విశ్వసనీయ సమచారం మేరకు ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులతో కలిసి కుషాయిగూడ పోలీసులు రైడ్‌ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నల్లమందు, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్‌ను చాకచక్యంగా పట్టుకున్న ఎల్‌బీనగర్‌ పోలీసులను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు. 

Updated Date - 2022-07-02T15:06:35+05:30 IST