చేజార్చుకున్న సదవకాశం

Sep 20 2021 @ 00:51AM

మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మపరాగం నవల గురించి బి.తిరుపతిరావుగారు ‘చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వగతాలు’ అనే శీర్షికతో రాసిన వ్యాసం (వివిధ- 23 ఆగస్టు 2021) చదివి చాలా ఆశ్చర్యానికీ, కొంత అయోమయానికీ గురయ్యాను. తిరుపతిరావు గారు తన వ్యాసంలో చెప్పుకొచ్చిన చాలా విషయాలు నాకు ఆ నవలలో కనబడలేదు. 


‘‘రచయిత... ఆథెంటిక్‌గా చిత్రించాలి. ఈ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు. ఈ నవలకున్న epic లక్షణాల్ని ఎవ్వరయినా అంగీకరిస్తారు.’’ అని రాశారు తిరు పతిరావు. నవల ‘ఆథెంటిక్‌’గా ఉంది అని పలుమార్లు కితాబి చ్చారు. వయసులోనూ, ఆర్థికంగానూ, జీవన శైలిలోనూ ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలు కథ చెప్పినప్పుడు ఎన్ని భిన్న స్వరాలు వినబడాలి అవి ఆథెంటిక్‌ అయితే? కానీ ఈ నవలలో పాఠకులకు వినబడేది ఒకటే అపస్వరం- మాకేమి దిక్కు దేవుడో అని ఏడుపు. నవలలో ముఖ్య సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక పాత్రలు ఒకే గొంతుతో దీనంగా రోదించడం ఆథెంటిక్‌ కాదు. 


‘‘దేవదాసీ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని... మార్పులను ఈ నవలలో నేపథ్యంగా రచయిత చెప్పుకుంటూ వచ్చాడు.’’ అని రాశారు తిరుపతిరావు. ఈ అభినందనకు తగిన సమర్థన నాకు నవలలో కనబడలేదు. ఎప్పుడో వందేళ్ళ కిందట మా ముత్తవ్వ అంత గొప్పగా నాట్యం చేసేదిట అని చెప్పుకోవ డమే తప్ప, ఇప్పటి దీనస్థితికి దిగజార్చిన పరిస్థితుల ప్రస్తావన కానీ ఆత్మపరిశీలన కానీ లేవు నవలలో. ఒక్కో అధ్యాయం మొదట్లోనూ రచయిత రాసిన ట్టుగా ఉన్న చిన్న పేరాలలో కట్టే- కొట్టే- తెచ్చే అన్నట్టుగా వికీపీడియాలో దొరికే చరిత్ర ముక్కలు నాలుగేసి రాశారు. పోనీ అలా ప్రస్తావించిన విష యాలకి తరువాతి కథనంలో సంఘటనలకి లంకె ఏదీ కనబడదు. ఈ.వీ. రామస్వామిని నెత్తికెత్తుకోవడమూ, కంచి పరమాచార్యని కించపరచడమూ వంటి అసందర్భాలు తప్ప.


‘‘దేవదాసీలు ఎంతో సంస్కారవంతంగా గొప్ప అభిరుచితో జీవించారనే చారిత్రక వాస్తవాన్ని అత్యంత శక్తివంతంగా... చిత్రించాడు రచయిత.’’ అని రాశారు తిరుపతిరావు. ఇది నాకు అస్సలు అర్థంకాని సమర్థన. దేవదాసీలు సంస్కార వంతంగా జీవించారనే ప్రతిపాదన ఎన్నో రకాల అభ్యంతరాలకు చోటిస్తోంది. అసలు సంస్కారం అంటే ఏవిటనే మౌలికమైన ప్రశ్న తలెత్తుతుంది. అదలా ఉండగా, రచయిత ప్రకటించుకున్న ఉద్దేశం నవలలో ఫలించలేదనీ, ఫలించక పోవడమే కాక, ఈ కథనంలో దేవదాసీల సామాజిక చరిత్రకి అన్యాయం జరిగిందనీ నాకు బలంగా అనిపించింది. 


దేవదాసీ వ్యవస్థను గురించిన పరిచయ వాక్యమే వివక్షాపూరితమైన పదజాలంతో మొదలు పెట్టారు. ‘‘...దేవదాసీ వ్యవస్థ 8వ శతాబ్దానికే చేదు పువ్వుల్ని పూసింది’’ అన్నారు. ఏవిటా చేదు పువ్వులు? ఏ ప్రమాణం వల్ల అవి చేదు అని నిశ్చయించారు? ఈ పరిచయం తరవాత వచ్చే కథనం ఆద్యంతమూ దేవదాసీలపట్ల వివక్షతోనే నడిచింది. 


పోనీ చరిత్రని సమగ్రంగా చిత్రించారా అంటే, 8వ శతాబ్ది నించి నాయకరాజులు, మహారాష్ట్ర రాజుల దగ్గరికి దాదాపు వెయ్యేళ్ళని ఒక్క వాక్యంలో దాటేశారు. అక్కడి నించి తెల్ల దొరలు పన్నులు రావడం లేదని దేవదాసీల యినాం భూముల్ని రద్దుచేశారని, వ్యభిచారం తప్ప మరో మార్గం లేని బీదరికంతో వేగిపోయారనీ ఒక వాక్యంతో రెండు వందలయేళ్ళ ఈస్టిండియా కంపెనీ ఘాతుకాలని దాటేశారు. 


మొదటి అధ్యాయంలో కుముదవల్లి కంఠంతో మొదలు పెడితే-మొదటి సగం అంతటా పరుచుకున్న పన్నెండుగురు దేవదాసీ స్త్రీల గొంతుల్లోనూ ఒకటే దైన్యం: తమకే గుర్తు లేని తాతమ్మల కాలంలో తమ జీవితాలు ఎంతో వైభోగంగా ఉండేవి. ఇప్పుడు బాలేవు. ఇదే గొడవ. పతనం జరిగింది నిజమే కానీ ఎలా జరిగింది అనే శోధన, ఆత్మ పరిశీలన మనకు కనబడవు. ఉన్నంతలో బతుకీడుస్తున్న రంగనాయకి వంటి పాత్రల సంగతి సరే- కళాశాలలో చదువుకుని, ముత్తు లక్ష్మీరెడ్డి ఉద్యమంలో పనిచేస్తున్న మోహనాంబ మాటలోనూ తేడా ఏమీ లేదు (76వ పేజీ). సంగీత విద్వాంసురాలై ఉండి, ఒక బ్రాహ్మణ సంగీత విద్వాంసుణ్ణి పెళ్ళి చేసుకుని భద్ర జీవితం గడుపుతున్న పెరియనాయకి మాటలోనూ (110వ పేజీ) తేడా ఏమీ లేదు.


దేవదాసీ కుటుంబాలలో పురుషులకి ఎటువంటి స్థానం లేకుండా పోయిందనీ, వాళ్ళు వాద్యంలో రాణించకపోతే తార్పుడుగాళ్ళుగా మాత్రమే బతికారన్నట్టు చిత్రించడం సరి కాదు. అనేక వాద్యాలలో విద్వాంసులు, నాట్యంలోనూ ఎందరో గురువులు ఉన్నారు. తంజై నలువర్‌ నించీ ఇటీవలి మీనాక్షీ సుందరం పిళ్ళై, రాజరత్నం పిళ్ళై గార్ల వరకూ ఎందరో మహానుభావులు శిష్యులచే పూజించబడ్డారు.   


అంతకు మునుపటి పరిణామాల సంగతి ఏమైనా, బ్రిటీషు పాలన సమయంలో దేవదాసీ సామాజిక వర్గాన్ని సమూలంగా కుదిపి వేసిన సంఘటన మద్రాసు ప్రెసిడెన్సీలో 1930 ప్రాంతాల ముత్తులక్ష్మీరెడ్డి ప్రవేశపెట్టిన దేవదాసీ వ్యతిరేక బిల్లు. అప్పటికే సంఘ సంస్కరణ ఉద్యమంలాగా బాగా వ్యాప్తి చెంది ఉన్నది. ఐతే దేవదాసీ పాత్రలకి స్వంతగొంతులో కథ చెప్పుకొనే అవకాశం ఇవ్వడానికి ఈ నవల రాశాను అని చెప్పుకున్న రచయిత, తన మాటగా ముత్తులక్ష్మీ రెడ్డి (70వ పేజీ) గురించి, ఆవిడ ఉద్యమమైన దేవదాసీ రద్దు చట్టం గురించి- అవి చాలా మంచి విషయాలన్నట్టు ఆరాధనా పూర్వకంగా రాయడం ఒక ముఖ్యమైన అభాస.


నవలలో చాలాచోట్ల అకారణ బ్రాహ్మణ ద్వేషం కనపడింది. చదువుతుంటే ఆ కాలంలో ఆ ప్రాంతాల్లో రెండే వర్గాల మనుషులు ఉండే వాళ్ళని భ్రమ కలుగుతుంది - దేవదాసీ స్త్రీలు, బ్రాహ్మణ పురుషులు. దేవదాసీ స్త్రీలు యవ్వనవతులు, అందగత్తెలు, అమాయకులు. బ్రాహ్మణ పురుషులు వయసు పైబడినవారు, డబ్బూ అధికారమూ వారి సొత్తు, వీళ్ళు అమాయకులైన దేవదాసీ యువతులను exploit చేస్తూ ఉండేవాళ్ళు అని. నవల అంతటా ఈ భావనను బలపరిచే ఉదాహరణలు కోకొల్లలు. నాగలక్ష్మికి ఆశ్రయమిచ్చిన రాజకీయ నాయకుడు వరదాచారి చిత్రణలోనూ, నాగలక్ష్మిని పెళ్ళి చేసుకుని ఆమెని అందలమెక్కించడమే తన జీవితాశయంగా బతికిన విశ్వనాథన్‌ చిత్రణలోనూ ఎన్ని వెక్కిరింపులు, ఎన్ని innuendos. కథలో బ్రాహ్మణ స్త్రీలు తారసపడినప్పుడు వారు దేవదాసీ స్త్రీల పట్ల ఏదో అక్కసుతో ఉన్నారన్నట్టు చిత్రించడం తరచు కనిపిస్తుంది. పొన్న గాయత్రి కథలో (6వ అధ్యాయం) వాళ్ళ నాయనమ్మ మాటల ద్వారానూ, హరిణీ ప్రియంవద (13వ అధ్యాయం), మంగతాయారు (18వ అధ్యాయం) కథనాల్లో ఈ అక్కసు ప్రస్ఫుటం. 


నిజమైన చరిత్ర పరిశీలిస్తే ఈ అక్కసుకి కారణం కనబడదు. దక్షిణభారతం మొత్తమ్మీద కొందరు జమీందారులు, వకీళ్ళు, పెద్ద ఉద్యోగస్తులు ఉండవచ్చు కాని మొత్తమ్మీద ధనం కానీ, అధికారం కానీ బ్రాహ్మణేతరుల వద్దనే ఉంటూ ఉన్నది. పోషకుణ్ణి వెతుక్కుంటున్న దేవదాసీ ఆ విధంగా బ్రాహ్మణే తరులను ఎంచుకోవడానికే ఆస్కారం ఎక్కువ. అదీకాక ఈ రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన సంపర్కం దృష్ట్యా చూస్తే బ్రాహ్మణ విద్వాంసులు దేవదాసీ కళాకారిణులకి ఎంతో సహాయం చేశారు. చేయూతనిచ్చారు. 


ఈ కథనంలో పెద్దచిక్కు అసలు కర్నాటక సంగీతమంటే ఏవిటి, అది ఎవరికి ఎందుకు కావాలి అనే ప్రశ్న దగ్గర వస్తు న్నది. మూగాంబిక నోట పలికించిన మాటలు (పేజీ 127)  కర్నాటక సంగీతాన్ని ఏమాత్రం తెలిసిన పాఠకులకైనా తీవ్ర అభ్యంతరం కలుగజేస్తాయి. ఇవి కేవలం ఆ పాత్ర అనుకున్న మాటలు మాత్రమే అని సర్దుకోడానికి వీలు లేకుండా, నవల పొడవునా ఈ భావన పలువిధాలుగా కనిపించింది.  


అవసరంలేని కథనాలు (జ్ఞానేశ్వరీదేవి, సరళకుమారి), చొప్పించిన పిట్టకథలూ (స్వలింగ సంపర్కం), మొదలు పెట్టిన భావన స్థిరపడకుండానే వెంటనే దానికి విరుద్ధ భావనను పాఠకులపై రుద్దే రసాభాస కథనం నవలలో అనేకమార్లు. కర్నాటక సంగీతం గురించి గానీ, దేవదాసీ నృత్యం గురించి గానీ రచయితకి ఏమీ తెలియదు సరికదా, తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం చేసినట్లు కూడా కనపడకపోవటం అతిపెద్ద లోపం. ఈ నవల చివరికి చేజార్చు కున్న ఒక మంచి అవకాశంగా మిగిలిపోయింది.

శంకగిరి నారాయణస్వామి

[email protected]

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.