Sri Lanka : గొటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

ABN , First Publish Date - 2022-05-17T20:03:11+05:30 IST

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa

Sri Lanka : గొటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

కొలంబో : శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa)పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం పార్లమెంటులో వీగిపోయింది. తమిళ్ నేషనల్ అలయెన్స్ (TNA) ఎంపీ ఎంఏ సుమంతిరన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేయడంతో ఈ తీర్మానం వీగిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. రాజపక్సపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చించేందుకు వీలుగా పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్స్‌ను సస్పెండ్ చేయాలని ఈ తీర్మానం కోరింది. 


ఈ తీర్మానానికి అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనను పార్లమెంటులో ప్రతిబింబించాలని ప్రతిపక్షాలు భావించాయి. 


శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. గత గురువారం రణిల్ విక్రమసింఘే (Ranil Wickramasinghe) ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కొత్తగా నలుగురిని కేబినెట్ మంత్రులుగా నియమించారు. సోమవారం రాత్రి ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో, దేశంలో కేవలం ఒక రోజుకు సరిపడిన పెట్రోలు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో భారత దేశం ఇచ్చే రుణంతో పెట్రోలు, డీజిల్ వస్తాయని, దీంతో కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పారు. 


Updated Date - 2022-05-17T20:03:11+05:30 IST