‘Horse tradingపై జీఎస్టీ’.. పొరపాటున నోరు జారిన FM Nirmala .. BJP పై ప్రతిపక్షాల వ్యంగ్యాస్త్రాలు..

ABN , First Publish Date - 2022-06-30T20:03:03+05:30 IST

ప్రెస్‌మీట్లు, పార్టీ సమావేశాలు, పార్లమెంట్‌‌లో చర్చల్లో సమర్థవంతంగా మాట్లాడగలరని పేరున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) బుధవారం(నిన్న) పొరపాటున నోరుజారారు.

‘Horse tradingపై జీఎస్టీ’.. పొరపాటున నోరు జారిన FM Nirmala .. BJP పై ప్రతిపక్షాల వ్యంగ్యాస్త్రాలు..

న్యూఢిల్లీ : ప్రెస్‌మీట్లు, పార్టీ సమావేశాలు, పార్లమెంట్‌‌లో చర్చల్లో సమర్థవంతంగా మాట్లాడగలరని పేరున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) బుధవారం(నిన్న) పొరపాటున నోరుజారారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించే సమయంలో.. ‘హార్స్-రేసింగ్‌పై  జీఎస్టీ’ అనడానికి బదులు ‘హార్స్-ట్రేడింగ్(horse trading)పై జీఎస్టీ(GST)’ అని తప్పుగా చదివారు. చట్టసభ్యుల బేరసారాలకు ప్రయోగించే ‘హార్స్-ట్రేడింగ్’ పదం నిర్మల నోటివెంట రావడం ప్రతిపక్ష పార్టీలకు వ్యంగ్యాస్త్రం అందించినట్టయింది. ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra Political Crisis)  నేపథ్యంలో బీజేపీపై పలువురు  విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.


నిర్మల్ సీతారామన్ నోరు జారిన వీడియో క్లిప్‌ని షేర్ చేసి మరీ వ్యంగ్యంగా విమర్శలు కురిపిస్తున్నారు. ఏఐసీసీ(AICC) మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా(Pawan Khera) ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘ నాకు తెలుసు సీతారామన్ గారూ.. సంప్రదాయేతర ఆలోచనలు చేయగల సామర్థ్యం మీకుంది . చట్టసభ్యుల కొనుగోలుపై జీఎస్టీ ఉండాలండీ ’’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఆవల(చట్టసభ్యుల కొనుగోలు) ఆలోచనలు చేయగలరని అర్థమొచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. సీపీఐ-ఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ కూడా ట్విటర్‌లో ఈ వీడియో క్లిప్‌ని షేర్ చేశారు. ‘‘ హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీనా.. అయితే ముందుకెళ్లండి మరీ’’ అని వ్యంగ్యంగా విమర్శించారు. 


జోకులు పేల్చుతున్న నెటిజన్లు..

కాగా అధికారం, ధనంతో ఇతర పార్టీల చట్టసభ్యులను తమవైపు తిప్పుకోవడాన్ని హార్స్-ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. సరిగ్గా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వేళ ఈ పదం నిర్మలా సీతారామన్ పొరపాటున పలకడంతో బీజేపీపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ‘‘ పొరపాటున చెప్పినా.. సీతారామన్ నిజాయితీగానే చెప్పారు’’ అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. ‘ ఎంతశాతం జీఎస్టీ విధిస్తారో కూడా చెప్పొచ్చు కదా.. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 35 శాతం వీటిలో ఏది?’ అని మరో వ్యక్తి సందేహం వెలిబుచ్చాడు. ‘హార్స్-ట్రేడింగ్ గేమ్‌’ని బీజేపీయే ఆరంభించిందని  ఒకరు..  ఓరి దేవుడో ఇప్పుడు అమిత్ షా జీఎస్టీ కడతారా ఏంటి అని మరో నెటిజన్ స్పందించారు. పొరపాటయినా నిజం చెప్పారని మరొకరు ఎద్దేవా చేశారు. కాగా సంబంధిత భాగస్వాములతో చర్చలు జరిపినా క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు సీతారామన్ మీడియా సమావేశంలో చెప్పారు.



Updated Date - 2022-06-30T20:03:03+05:30 IST