పగటికలల్లో ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2022-01-25T06:29:24+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాకర్షణ రోజురోజుకూ పెరుగుతోందని, కేంద్రప్రభుత్వం మొత్తం పనితీరు పట్ల దాదాపు 59 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఇండియా టుడే తన తాజా ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో తెలిపింది...

పగటికలల్లో ప్రతిపక్షాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాకర్షణ రోజురోజుకూ పెరుగుతోందని, కేంద్రప్రభుత్వం మొత్తం పనితీరు పట్ల దాదాపు 59 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఇండియా టుడే తన తాజా ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో తెలిపింది. మోదీ వ్యక్తిగత ఆకర్షణ 62 శాతం మేరకు చేరుకుందని చెప్పిన ఇండియా టుడే కనుచూపుమేరలో మోదీని ఢీకొనదగ్గ రాజకీయనాయకుడు ఈ దేశంలో లేరని స్పష్టం చేసింది. మోదీయే దేశ నాయకుడుగా కొనసాగాలని దేశంలో 52.5 శాతం జనం కోరుకుంటుండగా, రాహుల్ గాంధీ దేశ నేత కావాలని కేవలం 6.8 శాతం మాత్రమే కోరుకుంటున్నారని ఇండియా టుడే తెలిపింది. దేశంలో ప్రధాన నేతలందరి ఆకర్షణ కట్టకలుపుకున్నా మోదీకి దీటు రాలేరని ఆ సర్వే వెల్లడించింది. దేశంలో సమస్యలు, సవాళ్లు లేవని కాదు, కాని ఎన్ని సమస్యలున్నా, ఎన్ని సవాళ్లు ఎదురైనా నరేంద్రమోదీ అధికారంలో ఉంటేనే దేశం ఈ సమస్యలను, సవాళ్లను అధిగమిస్తుందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారని ‘ఇండియా టుడే’ తెలిపింది.


దేశంలో కరోనా మూలంగా ప్రజలు అష్టకష్టాలు పడి ఉండవచ్చు కాని నిత్యం భరోసా కల్పిస్తూ, దేశంలోని ముఖ్యమంత్రులకు సరైన సారథ్యం అందిస్తూ దేశంలో వయోజన జనాభాలో 97శాతం మంది టీకాలు తీసుకునేలా చేసిన మోదీ నాయకత్వం ప్రజలను ఆయనవైపు మొగ్గేలా చేసింది. అనేక సవాళ్ల మధ్య ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగల సామర్థ్యం మోదీ ప్రభుత్వానికి ఉన్నదని ఆయన ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు ఫలితాల నివ్వడం వారిని విశ్వసించేలా చేసింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధులు ప్రజలకు చేరకుండా కొల్లగొట్టే మధ్యదళారులు అదృశ్యం కావడం, నేరుగా తమ ఖాతాల్లో డబ్బులు చేరడంతో దేశంలో అవినీతిరహిత సమాజాన్ని అందించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని వారిని ప్రగాఢంగా నమ్మేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మోదీ హై తో ముమ్కీన్ హై’ (మోదీ ఉంటే సాధ్యం) అన్న నినాదాన్ని ఈ దేశ ప్రజలు బలంగా నమ్ముతున్నందువల్లే ఆయనకు తిరుగులేకుండా పోయిందని ఇండియా టుడే సర్వేలో స్పష్టమయింది.


భారత ప్రజల హృదయాల్లో క్రమంగా స్థిరపడేందుకు, కాంగ్రెస్ పార్టీ బూటకత్వాన్ని, ప్రజాద్రోహాన్ని బట్టబయలు చేసేందుకు బిజెపి ఎన్నో పోరాటాలు చేయవలిసి వచ్చింది. ఈ పోరాటాల గురించి బిజెపి జాతీయ నాయకుడు, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ఆర్థికవేత్త ఇలా పట్నాయక్‌తో కలిసి రచించిన ‘ద రైజ్ ఆఫ్ బిజెపి- ద మేకింగ్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ పార్టీ’ పుస్తకంలో సమగ్రంగా ఒక సైద్ధాంతిక కోణంలో వివరించారు. బిజెపి ఉత్థానాన్ని ఆయన మూడు ఘట్టాలుగా వివరించారు. ఒకటి బిజెపి ఆవిర్భావానికి ముందు జనసంఘ్‌గా ఉన్నప్పటి దశ. రెండవది, 1980 ఏప్రిల్‌లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన దశ. అయితే మూడవది 2004 తర్వాత నరేంద్రమోదీ జాతీయస్థాయిలో రంగప్రవేశం చేసిన తర్వాత పూర్తి మెజారిటీ సాధించి దేశమంతటా విస్తరించేందుకు ఉరకలు వేస్తున్న దశ. జనసంఘ్‌గా ఉన్నప్పుడు ఆ సంస్థలో 16 లక్షల మంది సభ్యులు ఉండేవారు. 1980లో బిజెపి ఏర్పడిన తర్వాత జనంలో ఉత్సాహం ఏర్పడి ఈ సంఖ్య 25 లక్షల మందికి పెరిగింది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రి అయ్యే నాటికి 1998లో బిజెపి సభ్యత్వం 1.81 కోట్లకు చేరుకుంది. 2000 సంవత్సరంలో నాగపూర్‌లో బిజెపి జాతీయ మండలి జరిగే నాటికి బిజెపిలో 3 కోట్ల మంది చేరారు. 2014లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడయ్యే నాటికి బిజెపిలో 3.5 కోట్ల మంది సభ్యులుండేవారు. నరేంద్రమోదీ దేశ రాజకీయాల ప్రధాన స్రవంతిలో అడుగుపెట్టిన తర్వాత ప్రజల్లో ఎక్కడలేని భావావేశం పెల్లుబుకి, కేవలం ఏడాదిలో సభ్యత్వం మూడింతలు పెరిగి 11 కోట్లకు చేరుకుంది. మరో నాలుగేళ్లలో 2019 నాటికి మరో ఏడు కోట్ల మంది బిజెపిలో చేరడంతో బిజెపి సభ్యత్వం 18.2 కోట్లమందికి చేరుకుంది. మోదీ హయాంలో బిజెపి చైనా కమ్యూనిస్టు పార్టీకి రెట్టింపు జనబలాన్ని సంపాదించింది.


సభ్యత్వం విషయంలోనే కాదు దేశ రాజకీయాల్లో బిజెపి ఒక నిర్ణాయక శక్తిగా మారడం కూడా ఒక క్రమ పరిణామంగా జరిగింది. 1980లో బిజెపి ఏర్పడినప్పటికీ ఇందిరాగాంధీ మరణం వల్ల ఏర్పడిన సానుభూతి పవనాల మూలంగా 1984 ఎన్నికల్లో మొత్తం 542 లోక్‌సభ సీట్లలో బిజెపి కేవలం రెండు సీట్లే గెలుచుకుంది. మొట్టమొదటిసారి స్వతంత్రంగా పోటీ చేసిన బిజెపి ఇందిర హత్యానంతర పరిస్థితుల్లో కూడా 7.66 శాతం ఓట్లు సాధించింది, దాదాపు 101 సీట్లలో రెండవ స్థానం సంపాదించింది. సానుభూతి పవనాలు లేకపోతే 1984లోనే బిజెపి ఓట్ల శాతం 10 నుంచి 15 శాతం వరకు చేరుకునేది. సరిగ్గా నాలుగేళ్లలో 1989లో బిజెపి ఓటు శాతం 11.36కు పెరిగి, ఇద్దరు సభ్యుల నుంచి 86 సీట్ల వరకు సాధించింది. మరో రెండేళ్లలో ఈ ఓటు శాతం దాదాపు రెట్టింపై 20.11 శాతానికి చేరుకుని 120 సీట్లకు పెంచుకుంది. అప్పటి నుంచీ 2014 వరకు బిజెపి ప్రతి ఎన్నికల్లోనూ 19 నుంచి 22 శాతం మధ్య జాతీయ స్థాయిలో సాధిస్తూనే వచ్చింది. 2014లో మోదీ రంగప్రవేశం తర్వాత మొట్టమొదటిసారి 31.34 శాతం సీట్లు సాధించి లోక్‌సభలో 282 సీట్లు గెలుచుకుని పూర్తి మెజారిటీ సాధించింది.


మోదీ హయాంలో బిజెపికి ఈ అద్వితీయ విజయాలు లభించేందుకు కారణాలేమిటో ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ నివేదికను అధ్యయనం చేసిన వారికి స్పష్టం అవుతుంది. భూపేంద్ర యాదవ్ తన పుస్తకంలో ఈ విజయ గాథను మరింత శాస్త్రీయంగా వివరించారు. ఇవాళ బిజెపి సంస్థాగత యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉన్నదంటే, ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేసినా పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతోంది. టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకుని ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయగలుగుతోంది. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపి కుటుంబ పార్టీ కాదు, ప్రతి మూడేళ్లకూ బిజెపిలో దేశంలో అన్ని స్థాయిల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి వరకు అధ్యక్షులు, ఆఫీసు బేరర్లు మారుతారు. మారుతున్న తరం ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపిలో కొత్త తరానికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్దేశించి వారసత్వానికి కళ్లెం వేసింది. గ్రామ స్థాయి నుంచీ, బూత్‌ స్థాయి వరకూ సుశిక్షితులైన కార్యకర్తలనుంచి నిరంతరం సమాచారం సేకరించి ప్రభుత్వ, పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకునే ఏకైక పార్టీ బిజెపి. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా, నిరంతరం ఎదుగుతూ ఉన్న బిజెపిని సమీప భవిష్యత్‌లో దెబ్బతీయగలమని ఎవరైనా భావిస్తే అది పగటికలలు కనడమే కాక మరేమవుతుంది?


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-01-25T06:29:24+05:30 IST