బత్తాయి.. ధర రెట్టింపు

ABN , First Publish Date - 2020-07-07T07:51:43+05:30 IST

కాస్త చౌక ధరలో.. ఏ కాలమైనా లభ్యమయ్యే పండు బత్తాయి. విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే పండు కావడంతో కరోనా కాలంలో రోగుల డైట్‌లో బత్తాయి రసం ప్రధానంగా మారింది. కానీ, ఇప్పుడిదే పండు ధర అమాంతం పెరిగింది. గతంలో బత్తాయి పది కిలోల బ్యాగ్‌ను రూ.100 నుంచి

బత్తాయి.. ధర రెట్టింపు

హైదరాబాద్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కాస్త చౌక ధరలో.. ఏ కాలమైనా లభ్యమయ్యే పండు బత్తాయి. విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే పండు కావడంతో కరోనా కాలంలో రోగుల డైట్‌లో బత్తాయి రసం ప్రధానంగా మారింది. కానీ, ఇప్పుడిదే పండు ధర అమాంతం పెరిగింది. గతంలో బత్తాయి పది కిలోల బ్యాగ్‌ను రూ.100 నుంచి రూ.200 మధ్య విక్రయించేవారు. తాజాగా అందుకు రెండింతల నుంచి మూడింతల ఎక్కువకు అమ్ముతున్నారు. విడిగా అయితే, గతంలో రూ.పదికి నాలుగు బత్తాయిలు ఇచ్చిన వ్యాపారులు.. ప్రస్తుతం రూ.పదికి ఒకటే వస్తుందని చెబుతున్నారు. దీనంతటికీ కారణం.. కరోనాతో డిమాండ్‌ పెరగడం, దీనికి డీజిల్‌  చార్జీల భారం తోడవడమే. ఈ నేపథ్యంలో అన్ని పండ్ల ధరలు ఎంతో కొంత పెరుగుతున్నాయి. పుచ్చకాయ కిలో రూ.30 పైగా పలుకుతోంది. అరటిపండ్లు డజన్‌ రూ.40 మేర, యాపిల్‌ ఒకటి రూ.25 కాగా, దానిమ్మ కాయను రూ.20కి విక్రయిస్తున్నారు. సాధారణంగా పండుగల సమయంలో పండ్లు అధిక ధర పలుకుతాయి. ప్రస్తుతం ఏ పండుగలూ లేకున్నా ధరలు పెరిగాయు. కొత్తపేట ప్రూట్‌ మార్కెట్‌లో గతంలో పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే ధర తగ్గేది. కానీ, ఇప్పుడు హోల్‌సేల్‌గా ఏ స్థాయిలో ఉన్నాయో.. రిటైల్‌లోనూ అదే తీరున ఉన్నాయి. 


కూరగాయం..

హైదరాబాద్‌లో కూరలు వండుకోలేము అనే పరిస్థితులు నెలకొన్నాయి. శివారు ప్రాంతాల నుంచి నగరానికి కూరగాయల రాక గణనీయంగా తగ్గిందని.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి వస్తోందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. డీజిల్‌ రేటు పెరిగి రవాణా చార్జీలు అధికమవుతుండటం రేట్లపై ప్రభావం చూపుతోంది. నగరానికి రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇలా తెచ్చే రైతులు బోయిన్‌పల్లి, గుడిమల్కాపుర్‌ మార్కెట్‌లలో అమ్ముతుంటారు. వాస్తవానికి ఈ సీజన్‌లో టమాటతోపాటు అన్ని కూరగాయల ధరలు తక్కువగానే ఉంటాయి. కానీ, పరిస్థితి భిన్నంగా ఉంది. మొన్నటివరకు టమాటకు సరైన ధరనే లేదు. కిలో రూ.5 నుంచి రూ.10కి అమ్మారు. రెండు వారాలుగా ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.60 పలుకుతోంది. దీంతో చాలా కుటుంబాలు కూరల్లో టమాట బదులు చింతపండు వాడుతున్నారు. రైతుబజార్‌లో ఇతర కూరగాయల ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, మార్కెట్లలో మాత్రం బెండకాయ, దొండకాయ, వంకాయ, కాకరకాయ తదితర కిలో రూ.40కు పైగా విక్రయిస్తున్నారు. కరోనా ప్రభావంతో వేసవిలో కూరగాయలను విస్తృతంగా సాగు చేయలేకపోయారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో పంట వేసినా.. ఇంకా కోతకు రాలేదు. ప్రస్తుతం 60 శాతం మేర కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండటం.. డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదలతో కిలోమీటర్‌కు రూ.5 మేర అదనంగా రవాణా చార్జీల భారం పడుతోంది. కాకినాడ నుంచి కూరగాయలు తీసుకొచ్చే డీసీఎంకు ఇదివరకటి కంటే రూ.2,200 ఎక్కువగా ఖర్చవుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపుతోనే కూరగాయల ధరలు 30 శాతం మేర పెరిగాయని బోయిన్‌పల్లి మార్కెట్‌ వ్యాపారి ఒకరు తెలిపారు.


దిగుబడి తగ్గినందునే

దిగుబడి భారీగా తగ్గడంతో శివారు ప్రాంతాల నుంచి నగరానికి రావాల్సినంతగా కూరగాయాలు రావడం లేదు. కొన్నిచోట్ల పంట కోతకు వచ్చింది. రెండు, మూడు వారాల్లో మార్కెట్‌కు వస్తాయి. ప్రస్తుతం బోయిన్‌పల్లి మార్కెట్‌లో కొని రైతు బజార్‌లలో తక్కువకు అమ్ముతున్నాం.

- స్రవంతి, సరూర్‌నగర్‌ రైతుబజార్‌ అధికారి

Updated Date - 2020-07-07T07:51:43+05:30 IST