ఆర్డర్‌.. ఆర్డర్‌!

ABN , First Publish Date - 2022-10-01T04:47:37+05:30 IST

కార్యనిర్వాహక వ్యవస్థలో కోర్టు కేసులు అనేది ఒక భాగం కాగా ఇప్పుడు అది ప్రధాన అంశంగా మారిపోయింది.

ఆర్డర్‌.. ఆర్డర్‌!

అధికార యంత్రాంగాన్ని కుదిపేస్తున్న కోర్టు కేసులు

భారీగా నమోదవుతున్న డబ్ల్యూపీలు

రెవెన్యూ, ఇరిగేషన శాఖలవే ఎక్కువ

బిల్లులు, భూ సమస్యలపై ప్రజాపోరు

రాజకీయ ఒత్తిళ్లతో సతమతం

ప్రతి వారం హైకోర్టుకు వెళుతున్న ఉన్నతాధికారులు


ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కోర్టు కేసులు స్పష్టం చేస్తున్నాయి. చిన్న సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో సమస్యను పరిష్కరించని అధికారులు తదనంతరం కోర్టు కేసుల రూపంలో ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా కోర్టు తలుపులు తట్టే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఇది మరీ ఎక్కువై ధిక్కరణగా మారుతున్నాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారులు వారంలో ఒకటి, రెండు సార్లు హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులకు కౌంటర్‌ వేయడం, ప్రత్యక్షంగా హాజరుకావడం వంటి ప్రక్రియలతో అధికార యంత్రాంగం సతమతమైపోతోంది. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన శాఖల అధికారులకు అసలు పని కన్నా కోర్టు కేసుల పనే ఎక్కువగా ఉంటోంది. 


నెల్లూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కార్యనిర్వాహక వ్యవస్థలో కోర్టు కేసులు అనేది ఒక భాగం కాగా ఇప్పుడు అది ప్రధాన అంశంగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరైనా హైకోర్టును ఆశ్రయించి రిట్‌ పిటిషన (డబ్ల్యూపీ) దాఖలు చేశారంటే అధికారులు ఆందోళన చెందేవారు. అయితే అటువంటి డబ్ల్యూపీలు ఇటీవల వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. పోనీ ఈ పిటిషన దాఖలు చేశాక అయినా సమస్య పరిష్కరిస్తున్నారా అంటే అదీ లేదు. రాజకీయ ఒత్తిళ్లతో పక్కన పెట్టేస్తుండటంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఫైల్‌ అవుతున్నాయి. దీంతో కలెక్టర్‌ నుంచి సంబంధిత శాఖ దిగువ స్థాయి అధికారి వరకు అందరూ ప్రత్యక్షంగా హైకోర్టుకు హాజరుకావాల్సి వస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలోకి వెళుతోంది.


రెవెన్యూ కేసులో ఎక్కువ


రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో చాలా సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. తమవి ఒరిజినల్‌ పట్టాలైనప్పటికీ నిషేధిత జాబితాలో చేర్చారంటూ కొందరు విన్నవించుకుంటూ వస్తున్నారు. కానీ ఈ జాబితాను సవరించడంలో, చుక్కల భూముల వంటి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ కారణంగా కొందరు హైకోర్టును ఆశ్రయించి పిటిషన వేశారు. అలానే తెలుగుగంగ ప్రాజెక్టు భూసేకరణలోనూ చాలా సమస్యలున్నాయి. పరిహారం విషయంలో చాలా మంది అధికారులకు అభ్యంతరాలు చెప్పినా సమాధానం లేకపోవడంతో ఇటీవల ఎక్కువగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన శాఖలో గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకూ కాంట్రాక్టర్లంతా వరుస కట్టి హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఈ ప్రభుత్వంలో చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకపోతుండడంతో ఆ కాంట్రాక్టర్లు కూడా ఒక్కొక్కరుగా కోర్టు మెట్లెక్కుతున్నారు. ఉపాధి హామీ పథకం చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా ఇవ్వడం లేదంటూ మరికొంత మంది హైకోర్టు తలుపులు తడుతున్నారు. ఇవేకాదు.. మరికొన్ని సమస్యలపై కూడా పిటిషన్లు వేస్తున్నారు. ఈ పిటిషన్లు విచారణకు వస్తుండడంతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి హైకోర్టు నుంచి నోటీసులు అందుతున్నాయి. 


అధికారులపై తీవ్ర ఒత్తిడి...


ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు తరచూ హైకోర్టుకు వెళుతున్నారు. ఆర్థిక పరమైన వ్యవహారాలకు సంబంధించి ఫైళ్లను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎక్కువ ఇబ్బందులు వస్తోన్నట్లు ఉన్నతాధికారులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. గతేడాది ఓ భూసేకరణ వ్యవహారంలో సకాలంలో పరిహారం చెల్లించకపోవడంతో ఐదుగురు ఐఏఎ్‌సలపై హైకోర్టు చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. అప్పటి నుంచి అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. ఇటీవల ధిక్కారణ పిటిషన్లు ఎక్కువవడంతో హైకోర్టు నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు కేసులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని ఆ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మరోవైపు కోర్టుకు హాజరు ఖర్చులు కూడా సొంతంగా భరించాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, బాగా ఇబ్బందిగా ఉంటోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కోర్టు ధిక్కరణ కేసుల్లో ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతుండడంతో అది అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇరిగేషన శాఖలో  ఓ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ధిక్కరణ పిటిషన ఫైల్‌ చేయడంతో రెండు రోజుల క్రితం రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు అందరికీ  నోటీసులు అందాయి. దీంతో రాత్రికి రాత్రి ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేసింది. అయితే ఆ బిల్లులు ఉదయం కోర్టు సమయానికల్లా అప్‌లోడ్‌ చేసి కాంట్రాక్టర్‌ ఖాతాలో డబ్బులు జమ చేయించేలోపు ఇరిగేషన అధికారులకు చుక్కలు కనిపించాయి. సంబంధిత అధికారులంతా ఆ రాత్రంతా కార్యాలయంలోనే ఉండి ప్రొసీజర్‌ ప్రకారం బిల్లులు అప్‌లోడ్‌ చేసి ఉదయాన్నే పీఏవో దగ్గరకు వెళ్లి వేడుకొని కాంట్రాక్టర్‌ ఖాతాలో డబ్బులు జమ చేయించారు.  ఇటువంటి పరిస్థితులు ఇటీవల పదే పదే ఉత్పన్నమవుతున్నట్లు ఇరిగేషన శాఖ అధికారులు వాపోతున్నారు.  

Updated Date - 2022-10-01T04:47:37+05:30 IST