వైద్య విధాన పరిషత్‌లో మాముళ్ల దందా

ABN , First Publish Date - 2022-05-22T05:26:06+05:30 IST

వైద్యశాలల్లో ఉండి ప్రజలకు సేవలు అందించే వైద్యాధికారులే ఆ ఉద్యోగి దెబ్బకు హడలెత్తిపోతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్లు సైతం వైద్య విధాన పరిషత్‌ కార్యాలయంలోని ఒక సాధారణ ఉద్యోగి వ్యవహారశైలితో ఇబ్బందిపడుతున్న పరిస్థితి నెలకొంది. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో జిల్లా ఆస్పత్రితోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా వైద్యశాలలు, ఎంసీహెచ్‌ వైద్యశాలలు ఉన్నాయి.

వైద్య విధాన పరిషత్‌లో మాముళ్ల దందా

అడిగినంత ఇవ్వకపోతే వైద్యాధికారులకే బెదిరింపులు

డిప్యుటేషన్‌పై పనిచేసే ఉద్యోగిదే కార్యాలయంలో హవా

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం

ఒంగోలు(కలెక్టరేట్‌) మే 21 : వైద్యశాలల్లో ఉండి ప్రజలకు సేవలు అందించే వైద్యాధికారులే ఆ ఉద్యోగి దెబ్బకు హడలెత్తిపోతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్లు సైతం వైద్య విధాన పరిషత్‌ కార్యాలయంలోని ఒక సాధారణ ఉద్యోగి వ్యవహారశైలితో ఇబ్బందిపడుతున్న పరిస్థితి నెలకొంది. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో జిల్లా ఆస్పత్రితోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా వైద్యశాలలు, ఎంసీహెచ్‌ వైద్యశాలలు ఉన్నాయి. సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయా వైద్యశాలల నుంచి వచ్చే బిల్లులను జిల్లా కార్యాలయం నుంచి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ ఉద్యోగి కార్యాలయంలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ అడిగినంత ఇచ్చుకోకపోతే బిల్లులను వెనక్కు పంపుతున్నాడు. లేదంటే సంబంధిత అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం వంటివి చేస్తుండటంతో వైద్యాధికారులు, ఇతర ఉద్యోగులకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.


పెత్తనం ఎవరు ఇచ్చారు

కాగా పశ్చిమప్రాంతం నుంచి డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయంలో పనిచేసేందుకు వచ్చిన ఉద్యోగికి అంత పెత్తనం ఎవరు ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. కులాలను అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తానే డిప్యుటేషన్‌పై వచ్చిన విషయాన్ని మరిచి శాఖలో ఎవరైనా డిప్యుటేషన్‌పై పనిచేస్తుంటే వెంటనే రద్దు చేయిస్తానంటూ బెదిరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అటువంటి ఉద్యోగి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైద్యులు తాము పనిచేయలేమంటూ సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 


ప్రతి పనికి డబ్బులు ముట్టజెప్పాల్సిందే....

కాగా సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా వైద్యశాలలు, ఎంసీహెచ్‌, జిల్లా వైద్యశాలలకు సంబంధించిన బిల్లులు రావాలంటే ఆ ఉద్యోగి అడిగినంత ఇచ్చుకుంటునే పెట్టే పరిస్థితి నెలకొంది. చివరకు వేతనాలు తీసుకోవాలన్న మాముళ్లు ఇవ్వాల్సిందేనని ఆరోపణలున్నాయి. అన్నిశాఖల్లో డిప్యుటేషన్లు రద్దుచేసి మాతృ ప్రాంతాలకు పంపుతున్నా ప్రభుత్వం వైద్య విధానపరిషత్‌ను మాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు వైద్యాధికారులు కోరుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


డిప్యుటేషన్లను రద్దుచేశాం:

-డీసీహెచ్‌ఎ్‌స కోఆర్డినేటర్‌ ఉషా

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయా పోస్టుల భర్తీ కోసం వివిధ ప్రాంతాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారందరినీ వెనక్కి పంపాం. కార్యాలయంలో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తన దృష్టికి తెస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యవిధాన పరిషత్‌ పనిచేసే వైద్యులు, ఉద్యోగులకు అండగా ఉంటా. సమస్యలను పరిష్కరిస్తాను.


Updated Date - 2022-05-22T05:26:06+05:30 IST