యువకుడి బ్రెయిన్‌ డెడ్‌.. అవయవదానంతో నలుగురికి పునర్జన్మ

ABN , First Publish Date - 2022-10-08T05:27:56+05:30 IST

తమ కుమారుడు ఇక లేడని తెలిసి ఆ యువకుడి తల్లిదండ్రులు, భార్య తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మ ఇచ్చారు కుటుంబ సభ్యులు.

యువకుడి బ్రెయిన్‌ డెడ్‌..   అవయవదానంతో నలుగురికి పునర్జన్మ
నిమ్స్‌కు గుండెను తరలిస్తున్న వైద్య సిబ్బంది

చిన్నశంకరంపేట, అక్టోబరు 7: తమ కుమారుడు ఇక లేడని తెలిసి ఆ యువకుడి తల్లిదండ్రులు, భార్య తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మ ఇచ్చారు కుటుంబ సభ్యులు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన గాయంతి ఎల్లమ్మ, యాదగిరి దంపతుల పెద్ద కుమారుడు నాగరాజు (28) డిగ్రీ పూర్తి చేశారు. మృతుడికి భార్యా మమత, కూతురు ఉన్నారు. డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూనే పశుగ్రాసం విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగత పనుల నిమిత్తం చేగుంటకు బైక్‌పై వెళ్తుండగా గేదెలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు వైద్యులు శుక్రవారం ఉదయం తేల్చారు. తమ కుమారుడి అవయవాలు దానం చేస్తే ఇతరులకు జీవం పోసినట్లవుతుందని భావించిన తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను ఆసుపత్రికి దానం చేశారు. 


గుండె మార్పిడి కోసం గ్రీన్‌ ఛానెల్‌

నాగరాజు గుండెను నిమ్స్‌లో చికిత్సపొందుతున్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. గుండె మార్పిడి కోసం ఆయన మార్చి నెలలో జీవన్‌దాన్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌కు అంబులెన్స్‌లో గుండెను ప్రత్యేక బాక్స్‌లో వైద్యులు తరలించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన అంబులెన్స్‌ గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేయడంతో 9.45 గంటలకు నిమ్స్‌కు చేరింది. 8.3 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాలలో చేరవేశారు. కళ్లు, మూత్రపిండాలను సైతం ఇతరులకు అమర్చారు. 

Updated Date - 2022-10-08T05:27:56+05:30 IST