అసలైన తెలుగు రుచులు

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

వానలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో ఘూటుగా ఉండే నాన్‌ వెజ్‌ రుచులను ఆస్వాదిస్తే వచ్చే మజాయే వేరు. అందులోనూ పాయ

అసలైన తెలుగు రుచులు

వానలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో   ఘూటుగా ఉండే నాన్‌ వెజ్‌ రుచులను ఆస్వాదిస్తే వచ్చే మజాయే వేరు. అందులోనూ పాయ, కోడి పులావు, చికెన్‌ కర్రీ, బోటీ చారు లాంటి తెలుగు వంటకాలు రుచి చూడాల్సిందే...




బొమ్మిడాయిలు పాలకూర


కావలసినవి

ఎండు బొమ్మిడాయిలు - 4, పాలకూర తరుగు - 2 కప్పులు / 4 కట్టలు, ఉల్లిపాయలు - 3,  పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, గరంమసాలా పొడి - పావు టీస్పూన్‌, చింతపండు పులుసు - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ

 బొమ్మిడాయిలు తల, తోకా తీసేసి మూడు అంగుళాల ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

 తరువాత పెనంలో కొద్దిగా నూనె వేసి వీటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 

 వెడల్పాటి గిన్నె లేదా కడాయిలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేగించాలి.  

 పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 

 ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కలపాలి.

 తర్వాత వేగించిన బొమ్మిడాయి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి... ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత పాలకూర తరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు అవసరముంటే కొద్దిగా పోయాలి.  

 బొమ్మిడాయిలు, పాలకూర ఉడికి దగ్గరగా అయిన తర్వాత చింతపండు పులుసు, గరం మసాలా పొడి వేసి కలిపి చిన్నమంట మీద మరి కొద్దిసేపు ఉడికించి దింపాలి. 




కాళ్ల కూర / పాయ


కావలసినవి

మేక కాళ్లు - ఐదు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, చింతపండు పులుసు - అరకప్పు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.


తయారీ

 మేక కాళ్లు కాల్చి పసుపు రాసి, నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మూడు అంగుళాల సైజులో ముక్కలుగా కట్‌ చేయాలి.

 కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేగించాలి.

తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి వేగించాలి.

 కాసేపు వేగిన తరువాత కాళ్లు, గరంమసాలా వేసి కలపాలి. 

 ఇప్పుడు ఐదు గ్లాసుల నీళ్లు, చింతపండు పులుసు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 8 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

 పాయ కోసం పోట్లీ మసాలా అని దొరుకుతుంది. ఆ పొడి ఒక స్పూన్‌, కొన్ని మసాల దినుసులు ఒకచిన్న వస్త్రంలో వేసి కట్టాలి. దీన్ని కాళ్లతోపాటు ఉడికిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. 

 పాయలోకి గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, నాన్‌ రుచిగా ఉంటాయి.





బోటీ చారు / దప్పడం


కావలసినవి 

బోటీ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, బెండకాయలు - 8, చింతపండు పులుసు - ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాలపొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - మూడు టీస్పూన్లు.


తయారీ

 ముందుగా బోటీ శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో వేసి అయిదు కప్పుల నీళ్లు పోయాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి.  

 విడిగా ఒక మందపాటి గిన్నెలో పలుచగా చేసిన చింతపండు పులుసు, కాస్త పెద్దగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, రెండు అంగుళాల సైజులో కట్‌ చేసిన బెండకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు,  ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఇవి సగం ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బోటీ ముక్కలు వేయాలి. 

 ఇందులో నూనె, గరం మసాలా, కొత్తిమిర వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.

 చివరగా అరకప్పు నీళ్లలో బియ్యప్పిండి వేసి కలిపి మరుగుతున్న చారులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. రెండు నిమిషాలు ఉడికి చిక్కబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని దింపేయాలి. ఇష్టముంటే నిమ్మకాయ పిండుకోవచ్చు.





 పచ్చిమిర్చి కోడి పులావు


కావలసినవి 

చికెన్‌ - ఒకకేజీ, బాస్మతి బియ్యం - ముప్పావు కేజీ, ఉల్లిపాయలు - రెండు,  పచ్చిమిర్చి - పావు టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కొత్తిమిర తరుగు - అరకప్పు, పుదీనా తరుగు - అరకప్పు,  అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, గరం మసాలా పొడి - పావు టీస్పూన్‌, పెరుగు - 100గ్రా., నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - రెండు టీస్పూన్లు. యాలకులు -  4 లవంగాలు - 5, , దాల్చిన చెక్క - అంగుళం ముక్క, షాజీరా - ఒక టీస్పూన్‌.


తయారీ

 చికెన్‌ ముక్కలు కడిగి జల్లెడలో వేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తాజా గరంమసాలా దినుసులు వేసి మెత్తగా గైరండ్‌ చేసుకోవాలి. 

 మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేగించాలి. ఎర్రగా వేగిన కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కనపెట్టుకోవాలి. 

 ఉల్లిపాయలలో నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసి కొద్దిసేపు వేగించాలి.  

 చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలన్నీ నూనెలో మగ్గి, వేగిన తర్వాత పెరుగు వేసి కలిపి అరకప్పు నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. 

 బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. వేరే పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. ఇందులో  యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీర వేసి బియ్యానికి తగిన ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్ల నుంచి బియ్యం తీసి వేయాలి. 

 బియ్యం ముప్పావు వంతు ఉడకగానే దింపేసి జల్లెడలో వేయాలి. చికెన్‌ ఉడుకుతుండగానే బియ్యం రెడీ చేసుకోవాలి. తడి ఆరకూడదు. 

 చికెన్‌ ఉడికిన తర్వాత ఈ ఉడికిన బియ్యం వేసి పైన ఎర్రగా వేగించిన ఉల్లిపాయలు, నెయ్యి వేసి మూత పెట్టాలి. మీడియం మంట మీద మరో పది నిమిషాలు ఉంచి తర్వాత దింపేసి వడ్డించుకోవాలి.




తెలంగాణ చికెన్‌ కూర


కావలసినవి

చికెన్‌ - ఒక కేజీ, ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిర్చి - మూడు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా పొడి - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - రెండున్నర టీస్పూన్లు, కొబ్బరిపొడి - మూడు టేబుల్‌స్పూన్లు, గసగసాలు - 2 టీస్పూన్లు, టొమాటోలు - 2, ఉప్పు - తగినంత, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు.


తయారీ

 చికెన్‌ ముక్కలు కడిగి జల్లెడలో వేసి పెట్టాలి. గసాలు కొద్దిగా వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. 

 మందపాటి గిన్నె లేదా పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కారం పొడి, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా వేగించాలి.

 తరువాత చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు నూనెలో మగ్గి నీరంతా ఇగిరిపోయిన తర్వాత కొబ్బరి పొడి, గసగసాల పొడి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి కలపాలి.

 ఒక కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు 

గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపాలి.





పోషక విలువలు 100గ్రా.లలో


మటన్‌ 

ప్రొటీన్‌ - 25.6 గ్రా

క్యాలరీలు - 258

ఫ్యాట్‌ - 16.5గ్రా


చికెన్‌

ప్రొటీన్‌ - 53.4 గ్రా

క్యాలరీలు - 284

ఫ్యాట్‌ - 6.2 గ్రా


బొమ్మిడాయిలు

ప్రొటీన్‌ - 18.44 గ్రా

క్యాలరీలు - 184

ఫ్యాట్‌ - 11.66 గ్రా


జ్యోతి వలబోజు

ఫోన్‌: 8096310140

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST