ఓఆర్‌ఆర్‌ సైకిల్‌ ట్రాక్‌కు మోక్షం

ABN , First Publish Date - 2022-05-26T11:16:39+05:30 IST

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) వెంట సైకిల్‌ ట్రాక్‌ నిర్మించాలంటూ చాలా ఏళ్లుగా నానుతున్న ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం

ఓఆర్‌ఆర్‌ సైకిల్‌ ట్రాక్‌కు మోక్షం

- సోలార్‌ పైకప్పు నీడలో సరికొత్త డిజైన్‌

-నార్సింగ్‌-కొల్లూరు, నానక్‌రాంగూడ-టీఎ్‌సపీఏ

- రెండు కారిడార్‌లలో 21 కిలోమీటర్లు

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) వెంట సైకిల్‌ ట్రాక్‌ నిర్మించాలంటూ చాలా ఏళ్లుగా నానుతున్న ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఓఆర్‌ఆర్‌ వెంట 21 కిలోమీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ను అధునాతనంగా నిర్మించేందుకు హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ గ్రోథ్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) డిజైన్లను సిద్ధం చేసింది. దక్షిణ కొరియాలో సౌర విద్యుత్‌ సోలార్‌ ప్యానల్‌ పైకప్పుగా ఉండే విధంగా సైకిల్‌ ట్రాక్‌ను రూపొందించారు. అదే విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓఆర్‌ఆర్‌లో ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సైకిల్‌ ట్రాక్‌ వెంట పచ్చదనంతో పాటు సైక్లిస్టులకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్‌, ఆహారంతో పాటు వివిధ రకాల దుకాణాలు వచ్చే విధంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించినట్లు సమాచారం. రెండు కారిడార్లలో 21 కిలోమీటర్ల మేర ఏర్పాటు ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగ్‌ నుంచి కొల్లూరు వరకు 13కిలోమీటర్ల మేర ఒక కారిడార్‌ కాగా.. టీఎ్‌సపీఏ జంక్షన్‌ నుంచి నానక్‌రాంగూడ వరకు 8కిలోమీటర్ల మేర రెండో కారిడార్‌ ఉంటుంది. ఈ 21 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ వెంట విస్తరిస్తున్న సర్వీసు రోడ్డు వెంట వచ్చే విధంగా డిజైన్లను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రాక్‌ పొడవునా పూర్తిగా సౌరఫలకాలను కప్పులా ఏర్పాటు చేయనున్నారు. దీని వలన ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా సైకిలిస్టులు ప్రయాణించవచ్చు. 4.5మీటర్ల వెడల్పు ఉండే సైకిల్‌ ట్రాక్‌లో 3 లేన్స్‌ రానున్నాయి.  సౌర ఫలకాల విషయంలో త్వరలోనే ఓ సంస్థతో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిసింది. ఎలాంటి పెట్టుబడి లేని రెన్యూవబుల్‌ ఎనర్జీ సర్వీసు కంపెనీ మోడల్‌లో భాగంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. ట్రాక్‌ పనులు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలున్నాయి. సైకిల్‌ ట్రాక్‌పై రాత్రివేళలో ప్రయాణించడానికి వీలుగా విద్యుద్దీపాలు, సీసీ కెమెరాలు ఉండనున్నాయి. కాగా, ఓఆర్‌ఆర్‌ వెంట సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతున్నామని, సైకిలిస్టులకు  మంచి అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నామని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-26T11:16:39+05:30 IST