వ్యాపార కేంద్రంగా వందల ఏళ్ల చరిత్ర ఉన్న Osmania University.. ఓ వైపు కబ్జాలు.. మరోవైపు లీజులు.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2021-11-09T16:44:24+05:30 IST

వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వ్యాపార కేంద్రంగా మారుతోంది. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ధి...

వ్యాపార కేంద్రంగా వందల ఏళ్ల చరిత్ర ఉన్న Osmania University.. ఓ వైపు కబ్జాలు.. మరోవైపు లీజులు.. ఎందుకిలా..!?

  • ఉస్మా‘నయా’ గాథలు-01
  • ఇప్పటికే  పెట్రోల్‌ బంక్‌లకు స్థలాలు
  • తాజాగా మరో సంస్థకు కేటాయింపు
  • కుచించుకుపోతున్న యూనివర్సిటీ
  • ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు

వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వ్యాపార కేంద్రంగా మారుతోంది. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ధి, మరెన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన వర్సిటీ స్థలాలు ధారాదత్తమవుతున్నాయి. విలువైన స్థలాలను కొందరు కబ్జా చేస్తుండగా, కొన్నింటిని లీజుకు ఇస్తుండడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.


హైదరాబాద్‌ సిటీ/తార్నాక : మహానగరంలో పెట్రోల్‌ బంక్‌లకు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు, మాల్‌, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ఖాళీగా కనిపించే ఉస్మానియా యూనివర్సిటీ భూములే దిక్కవుతున్నాయి. భవిష్యత్‌ తరాల విద్యాభివృద్ధికి దోహదపడాల్సిన ఓయూ భూములను వాణిజ్యం పేరుతో పలు సంస్థలకు కట్టబెట్టి ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. యూనివర్సిటీ భూములను రక్షించాల్సిన అధికారులు ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. వర్సిటీ భూములను ఓ వైపు కబ్జాదారులు చెరబడుతుంటే.. మరోవైపు వర్సిటీ అధికారులు లీజుకిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.

ఉస్మానియా యూనివర్సిటీని 1917లో స్థాపించినప్పుడు నిజాం సుమారు 2,200 ఎకరాల మేర భూసేకరణ చేసి వర్సిటీకి ఇచ్చారు. 


యూనివర్సిటీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడంతో భూములన్నీ వర్సిటీకే చెందేలా చేశారు. తూర్పు వైపున సికింద్రాబాద్‌-ఉప్పల్‌ రోడ్డు, దక్షిణ వైపున ఉప్పల్‌- హైదరాబాద్‌ రోడ్డు, ఉత్తరం వైపున రైల్వే ట్రాక్‌ లాంటి సరిహద్దులతో ఉస్మానియా యూనివర్సిటీ ఉండేది. 1950లో ఉస్మానియా యూనివర్సిటీ భూమి 1,600 ఎకరాలకు పైగా ఉన్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, ఆ భూములు కాల క్రమేణా పెద్దఎత్తున అన్యాక్రాంతమయ్యాయి. నిజాం సేకరించిన భూముల్లో ప్రస్తుతం సగం భూములు కూడా లేవని తెలిసింది.


మహానగరంలో చదరపు గజం లక్షల్లో పలుకుతున్న నేపథ్యంలో వర్సిటీ భూములను అదను చూసుకొని కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. వర్సిటీలో రిటైర్డ్‌ సైన్యంతో రక్షణ కల్పించిన అధికారులు భూముల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వర్సిటీ భూములపై పలు కేసులు కోర్టులో ఉన్నప్పటికీ తగిన ఆధారాలను అందించడంలో సంబంధిత విభాగాలు విఫలమవుతున్నాయి. వర్సిటీ భూముల రక్షణకు ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి కోర్టు కేసులు, లీగల్‌ వ్యవహారాలు, భూముల రక్షణ చర్యలు చేపట్టాలని పాలకమండలి నిర్ణయించింది. అయితే, ఇప్పటి వరకు ఆ దిశగా వర్సిటీ చర్యలు చేపట్టలేదు. అక్రమార్కులకు కొమ్ము కాసే వారినే బాధ్యతల్లో కొనసాగిస్తూ వర్సిటీ భూములను మరింత వివాదాస్పదంగా మారుస్తున్నారు.


అడ్డగోలుగా లీజుకు..

యూనివర్సిటీ భూములను లీజుకిచ్చే ప్రక్రియ కొన్నేళ్లుగా సాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ భూములను పలు ప్రైవేటు సంస్థలకు లీజుకిస్తున్నారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేటాయించరాదనే జస్టిస్‌ చిన్నపురెడ్డి కమిటీ నింబంధనలను తుంగలో తొక్కుతున్నారు. యూనివర్సిటీకి చెందిన 185ఎకరాలను పలు సంస్థలకు లీజుకిచ్చారు. 67 ఎకరాలను ప్రభుత్వ సంస్థలైన హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ, బీఎస్ఎన్‌ఎల్‌, జీహెచ్‌ఎంసీ, దూరదర్శన్‌ కేంద్రం తదితర వాటికి విక్రయించారు. 25ఏళ్ల క్రితమే నెలకు రూ.32వేల అద్దె ప్రాతిపదికన పెట్రోల్‌ బంక్‌కు లీజు ఇచ్చారు. 


ఐదేళ్ల క్రితం ఓ పెట్రోల్‌ బంక్‌ కోసం నెలకు రూ.1.05లక్షలు చెల్లించే విధంగా 50ఏళ్లకు లీజుకిచ్చారు. తాజాగా మెకాస్టార్‌ ఆడిటోరియం సమీపంలో సుమారు 2,800 చదరపు గజాల స్థలాన్ని నెలకు రూ.3.57లక్షలు చెల్లించే విధంగా ఐదేళ్లకు ఇటీవల వర్సిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. లీజు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామని వర్సిటీ అధికారులు సమర్ధించుకుంటున్నారు. అయితే, పాలకమండలి నిర్ణయం మేరకు భూముల రక్షణ చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి.. 

రూ.కోట్ల విలువ చేసే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్థలంలో చేపట్టిన పెట్రోల్‌ బంక్‌ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, అదే స్థలంలో విద్యార్థుల ప్రయోజనార్థం అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీల్లో జరుగుతున్న భూముల కబ్జాలు, లీజుల పేరుతో వర్సిటీ అధికారులు ఓయూ భూములను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - ప్రవీణ్‌ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి.


హబ్సీగూడ వైపు నుంచి, డీడీ కాలనీ నుంచి, రామంతాపూర్‌ నుంచి, మాణికేశ్వర్‌నగర్‌ నుంచి ఇలా పలు ప్రధాన రోడ్లు, రైల్వే ట్రాక్‌ కలిగిన ప్రాంతాలను మినహాయించి మిగతా వైపు  పెద్దఎత్తున భూములు ఆక్రమించేశారు. వర్సిటీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు గగ్గోలు పెట్టినా పాలకమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు ఉస్మానియా వర్సిటీ భూములపై కన్నేస్తున్నారు. గతంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం యోచించగా విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించారు. మాణికేశ్వర్‌నగర్‌ ప్రాంతంలో కబ్జావుతున్న వర్సిటీ స్థలాన్ని గతేడాది ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.


కాగితాల్లోనే 1,627 ఎకరాలు..

ఉస్మానియా యూనివర్సిటీ అధీనంలో 1,627ఎకరాలు ఉన్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులున్నాయి. ఓయూను ఆనుకొని ఏర్పడిన అనేక కాలనీలు వర్సిటీ భూముల్లోకి చొచ్చుకొచ్చాయి. హబ్సీగూడ, రామంతాపూర్‌, డీడీ కాలనీ వైపుల నుంచి వర్సిటీ భూములను చెరబడుతున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్సిటీ భూములపై సంబంధిత అధికారులు హద్దులను కూడా గుర్తించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కబ్జాదారుల అధీనంలోనే వర్సిటీ భూములున్నాయి.

Updated Date - 2021-11-09T16:44:24+05:30 IST