గిరిజనేతర నిర్వాసితుల జాబితా సిద్ధం

ABN , First Publish Date - 2022-05-23T05:32:17+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూర్‌ లెవెల్లో ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితులను తరలించే ప్రక్రియ వేగవంతం అయ్యింది.

గిరిజనేతర నిర్వాసితుల జాబితా సిద్ధం
తాడువాయిలో గిరిజనేతర నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు

త్వరలో పునరావాస పరిహారం

తాడువాయిలో మూడువేల ఇళ్లు నిర్మాణం

నిర్వాసితులు ఇళ్లు పరిశీలించాలని ముంపు గ్రామాల్లో చాటింపు


కుక్కునూరు, మే 22 : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూర్‌ లెవెల్లో ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితులను తరలించే ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఇప్పటికే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 25 గ్రామాల్లోని గిరిజనులకు దాదాపుగా వ్యక్తిగత పునరావాస పరిహారం చెల్లింపు పూర్తి కావస్తొంది. ఈ క్రమంలోనే గిరిజనేతరుల నిర్వాసితులకు త్వరలో పునరావాస పరిహారం చెల్లించనున్నారు. ఇందులో భాగంగా గిరిజనేతర నిర్వాసితుల జాబితాలు విడుదలవుతున్నాయి. నిర్వాసితులు పునరావాస కాలనీలో ప్రభుత్వం ఇచ్చే స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లు నిర్మించి ఇస్తూ పునరావాస వ్యక్తిగత పరిహారం కింద రూ.6.36 లక్షలు మంజూరు చేశారు. అలాగే కేవలం ఇంటి స్థలం ఇస్తే మేము స్వయంగా నిర్మించుకుంటామని దరఖాస్తు చేసుకున్న వారికి రూ.6.36లక్షలు వ్యక్తిగత పరిహారంతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే రూ.2.85లక్షలు కలిపి రూ.9.25లక్షలు మంజూరు చేశారు. పునరావాస కాలనీలో ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా వద్దు అని దరఖాస్తు చేసుకున్న వారికి రూ.6.36లక్షల వ్యక్తిగత పునరావాస పరిహారంతో పాటు ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలానికి విలువ కట్టి రూ.3.85లక్షలు కలిపి మొత్తం రూ.10.21 లక్షలు మంజూరు చేస్తున్నట్టు జాబితాలో పేర్కొన్నారు. అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3వేలు ఇళ్లు నిర్మించినట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి పునరావాస కాలనీలకు వెళ్లి మీకు నిర్మించిన ఇళ్లను పరిశీలించుకోవాలని నిర్వాసితుల గ్రామంలో చాటింపు వేస్తున్నారు. కాగా ఇప్పటికే గొమ్ముగూడెం, కుక్కనూరు–ఎ బ్లాక్‌ నిర్వాసితులకు సంబంధించి బిల్లులు ప్రభుత్వం పెట్టినట్టు సమాచారం. త్వరలో వీరికి సీఎఫ్‌ఎంఎస్‌ పద్ధతి ద్వారా నిర్వాసితుల ఖాతాలోకి పరిహారం జమ అవుతుందని ప్రచారం జరుగుతున్నది. అనంతరం మిగిలిన గిరిజనేతర నిర్వాసిత గ్రామాల్లో కూడా చెల్లింపులు జరగనున్నట్టు సమాచారం. వచ్చే జూన్‌, జూలైలో వరదలను దృష్టిలో పెట్టుకుని 41.15 కాంటూర్‌ లెవెల్‌ల్లో ఉన్న గ్రామాల నిర్వాసితులను తరలిస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-23T05:32:17+05:30 IST