కోలుకున్నా.. కలవరమే!

ABN , First Publish Date - 2021-06-13T05:17:57+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న బాధితులకు కొత్త అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకున్న తరువాత బాధితుల్లో పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు బయట పడుతున్నాయి. కరోనా తొలిదశ కంటే రెండో దశ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంది. అనేకమంది ఈ మహమ్మారితో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. ఈ సమయంలో పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమవుతున్నారు.

కోలుకున్నా.. కలవరమే!

 కరోనా నుంచి బయటపడిన వారిలో ఇతర అనారోగ్య సమస్యలు

 వేధిస్తున్న కడుపు మంట, ఉబ్బరం, పేగువాపు

 మరోపక్క బ్లాక్‌ఫంగస్‌ దాడి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా నుంచి కోలుకున్న బాధితులకు కొత్త అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకున్న తరువాత బాధితుల్లో  పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు బయట పడుతున్నాయి. కరోనా తొలిదశ కంటే రెండో దశ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంది. అనేకమంది ఈ మహమ్మారితో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. ఈ సమయంలో పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమవుతున్నారు. కొవిడ్‌ చికిత్స సమయంలో కొన్ని రకాల మందుల వినియోగంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా స్టెరాయిడ్స్‌ వల్ల కడుపు, గుండె మంట, ఉబ్బరం, పేగువాపు వంటి సమస్యలు బయట పడుతున్నాయి. యాంటీబయోటిక్‌ మందులను ఎక్కువగా వినియోగంచడంతో పెద్దపేగులో ఇన్ఫెక్షన్‌ చేరి విరేచనాలు అవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.  కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నా, రక్తకణాలు పలుచబడేందుకు మందులు వాడిన బాధితులకు నెగిటివ్‌ వచ్చినా, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న షుగర్‌ వ్యాధిగ్రస్తులు తీవ్ర నీరసానికి గురతున్నారు. మరోపక్క కరోనా తగ్గిన వారిపై బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది. వైరస్‌ సోకిన సమయంలో ఎక్కువగా స్టెరాయిడ్స్‌, ఆక్సిజన్‌ వినియోగించిన వారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరికి శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)లో ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కరోనాతో నలుగురి మృతి

  కరోనా బారిన పడి జిల్లాలో శనివారం మరో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 660కి చేరింది. శనివారం 5,514 మంది నుంచి నమూనాలు సేకరించగా, 383 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,14,273కి చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,504 ఉన్నాయి. శనివారం కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 561 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. హోం ఐసోలేషన్‌లో 3,696 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 262 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 546 మంది చికిత్స పొందుతున్నారు. 


 అప్రమత్తంగా ఉండాలి

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్తగా పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు బయటపడుతున్నాయి. అటువంటి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.  కరోనా లక్షణాలు ముదిరిన తరువాత చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారు. దీనివల్ల ప్రాణానికే ముప్పు. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ జరిగితే ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోకుండా చూడవచ్చు. అవసరం మేరకు మందులు వినియోగిస్తే ముక్కు, కంటి,  మెదడుపై ఎలాంటి ప్రభావం పడదు.

- డాక్టర్‌ హేమంత్‌, జెమ్స్‌, సూపరింటెండెంట్‌

Updated Date - 2021-06-13T05:17:57+05:30 IST