Otp గొడవలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

ABN , First Publish Date - 2022-07-05T15:20:58+05:30 IST

స్థానిక ముట్టుకాడు ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను కాల్‌టాక్సీ డ్రైవర్‌ దారుణంగా హత్య చేశాడు. అద్దెకు కుదుర్చుకున్న కారుకు పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విషయమై

Otp గొడవలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

                                - కాల్‌టాక్సీ డ్రైవర్‌ అరెస్టు


చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక ముట్టుకాడు ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను కాల్‌టాక్సీ డ్రైవర్‌ దారుణంగా హత్య చేశాడు. అద్దెకు కుదుర్చుకున్న కారుకు పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విషయమై వారి మధ్య జరిగిన వివాదం ఈ దారుణానికి దారితీసింది. గూడువాంజేరి సమీపం కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉమేందర్‌ (33) భవ్య అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉమేందర్‌ కోయంబత్తూరులోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారంతపు సెలవుల్లో గూడువాంజేరి వచ్చేవారు. ఆ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఉమేందర్‌ తన కుటుంబసభ్యులు, బంధువు దేవిప్రియను వెంటబెట్టుకుని అద్దె కారులో ముట్టుకాడు విహార యాత్రకు వెళ్ళారు. రాత్రి పది గంటలకు గూడువాంజేరి వెళ్లేందుకు కాల్‌టాక్సీని బుక్‌ చేసుకున్నారు. కాసేపటల్లో అక్కడికి వచ్చిన అద్దె కారులో అందరూ ఎక్కారు. ఆ సందర్భంగా కారు డ్రైవర్‌ రవి పాస్‌వర్డ్‌ చెప్పమని ఉమేందర్‌ను అడిగాడు. ఆ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటచేసుకుంది. ఆగ్రహించిన ఉమేందర్‌, కుటుంబీకులు కారు నుండి దిగారు. దీంతో ఆగ్రహంతో ఉమేందర్‌పై డ్రైవర్‌ రవి దాడిచేశాడు. ఈ గొడవ గురించి తెలుసుకున్న కేలంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ఉమేందర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. పోలీసులు కారు డ్రైవర్‌ రవిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-07-05T15:20:58+05:30 IST