సచివాలయ ఉద్యోగులపై ఓటీఎస్‌ దెబ్బ

ABN , First Publish Date - 2022-06-22T07:45:35+05:30 IST

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది.

సచివాలయ ఉద్యోగులపై ఓటీఎస్‌ దెబ్బ

ప్రొబేషన్‌ డిక్లేర్‌కు అడ్డుగా నకిలీ చలానాలు

నగదు చెల్లించేవరకు నిలిపేయాలని సీఎస్‌ ఆదేశాలు 

అగమ్యగోచరంగా మారిన ఉద్యోగుల భవిష్యత్తు


చిత్తూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ 9 నెలలు వాయిదా వేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకున్న ప్రభుత్వం ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో మరిన్ని దారులు వెతుకుతోంది. పలు నిబంధనల పేరుతో ఇప్పటికే జిల్లాలో 970 మంది ఉద్యోగులను అర్హుల జాబితాలో లేకుండా చేసింది. ఇది చాలదన్నట్లు మరిన్ని నిబంధనలతో ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా ఓటీఎస్‌ అస్త్రాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రయోగించింది. ఫేక్‌ చలానాలు సృష్టించారంటూ నెపం మోపి వారందరికీ ప్రొబేషన్‌ నిలుపుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. రేపో మాపో ప్రొబేషన్‌ పూర్తయి రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారుతామన్న ఆశతో ఉన్నవారికి ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంలా మారింది. 1983-2012 మధ్యకాలంలో ప్రభుత్వం తరపున ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల నుంచి ‘సంపూర్ణ గృహ హక్కు పథకం’ (ఓటీఎస్‌) పేరిట ప్రభుత్వం నగదు వసూలు చేస్తోంది. జిల్లాలో 38,571 మంది ఓటీఎస్‌ లబ్ధిదారుల నుంచి రూ.30.11 కోట్లను అధికారులు వసూలు చేశారు. వారిలో 10 వేల మందికి ఇంకా రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లను అందించలేదు. ఈ పథకంపై అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఏమిటంటూ లబ్ధిదారులు మండిపడ్డారు. వెనక్కి తగ్గని ప్రభుత్వం నగదు వసూళ్ల బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై పెట్టింది. అధికారులపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. అయినా నగదు చెల్లించేందుకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆ లక్ష్యాలను అధిగమించడానికి అధికారులు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత సలహా.. నేడు వారి పాలిట శాపంగా మారింది. లబ్ధిదారులు ఓటీఎ్‌సకు అంగీకరించకపోయినా వారి పేరు మీద చలానాలు తయారు చేయాలని మౌఖికంగా సచివాలయ ఉద్యోగులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ చలానాల తయారీకి భయపడుతున్న సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు నాడు భరోసా ఇచ్చారు. ఇప్పుడు వారంతా చేతులు ఎత్తేశారు. సచివాలయ ఉద్యోగులకు ఓటీఎస్‌ చలానాలకు బాధ్యులను చేస్తూ వారంతా తప్పుకున్నారు. దీంతో ఫేక్‌ చలానాల భారం మొత్తం సచివాలయ ఉద్యోగులపైనే పడింది. ఈ పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులంతా నేడు బలి పీఠమెక్కాల్సి వచ్చింది.


జిల్లాలో ఇలా.. 

జిల్లాలో 38,571 మంది ఓటీఎస్‌ లబ్ధిదారులకు సంబంధించి 6342 చలానాల ద్వారా రూ.30.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 6262 చలానాలను రూపొందించి రూ.29.50 కోట్లను చెల్లించారు. మరో 80 చలానాలను రూపొందించినా.. దానికి సంబంధించిన రూ.20 లక్షలను డిపాజిట్‌ చేయలేదు. మరో 431 చలానాలను రూపొందించలేదు. దానికి సంబంధించిన రూ.40 లక్షలనూ చెల్లించలేదు. అంటే మొత్తంగా రూ.60 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంది. జిల్లాలో 253 మంది గ్రామ, 79 వార్డు కార్యదర్శులు, 424 మంది డిజిటల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఓటీఎస్‌ వసూళ్లు, చెల్లింపులు అంశం ప్రధానంగా వీరిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా వీరి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఫలితంగా జిల్లాలో ఎంతమందికి ప్రొబేషన్‌ గడువు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి జిల్లాలో 4502 మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తుండగా.. 3532 మందికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మిగిలిన 970 మందికి పలు నిబంధనల కారణంగా అనర్హుల జాబితాలో చేర్చారు.

Updated Date - 2022-06-22T07:45:35+05:30 IST