జగనన్న గృహ హక్కు అధికారులకు చిక్కు

ABN , First Publish Date - 2021-12-06T04:33:33+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) లక్ష్యం గుబులు పట్టుకుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద ప్రస్తుత ప్రభుత్వం పాత ఇళ్ల లబ్ధిదారుల నుంచి రుణ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

జగనన్న గృహ హక్కు  అధికారులకు చిక్కు


ఓటీఎస్‌ లక్ష్యం సాధన కోసం ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి

ఒక్కో సచివాలయ పరిధిలో రోజుకు 10 విముక్తి పత్రాల లక్ష్యం

ఆ సొమ్ము మేం కట్టలేమని తెగేసి చెప్తున్న లబ్ధిదారులు

తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు


గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 5 : ప్రభుత్వ ఉద్యోగులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) లక్ష్యం గుబులు పట్టుకుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద ప్రస్తుత ప్రభుత్వం పాత ఇళ్ల లబ్ధిదారుల నుంచి రుణ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వ రుణాలతో నిర్మించిన గృహాలకు సంబంధించిన బకాయిలు ఏకకాలంలో పరిష్కారం అయ్యేలా వసూళ్లు చేపట్టాలని ఉద్యోగులను ఆదేశించింది. ఆ మేరకు రోజువారి లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు నెల రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ బకాయిలు చెల్లించాలని ప్రజల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు.

జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో రూ.20వేలు, మున్సిపాలిటీలు, పట్టణాలలో రూ.15వేలు, పంచాయతీలలో రూ.10వేల చొప్పున లబ్ధిదారులు చెల్లిస్తే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి ఆ ఇంటి యజమానికి రిజిస్ర్టేషన్‌ పత్రాలు అందచేస్తుంది. ఒకవేళ లబ్ధిదారుల నుంచి ఇతరులు కొనుగోలు చేసి ఉంటే నిర్దేశిత మొత్తానికి రెట్టింపు చెల్లిస్తే వారి పేరున రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందచేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువగా రుణ బకాయిలు ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది. 

దాదాపు 50 శాతం ఇళ్లకు మారిన యజమానులు

గృహ నిర్మాణశాఖ అందచేసిన జాబితా ప్రకారం గ్రామ, వార్డు వలంటీర్లు అందుబాటులో ఉన్న లబ్ధిదారులను గుర్తించి అవసరమైన ధ్రువపత్రాల నఖలను తీసుకున్నారు. గత 28 ఏళ్లలో లబ్ధిదారులు కొందరు చనిపోయారు, మరికొందరు స్థలాలతో సహా ఇళ్లను విక్రయించారు. మరికొన్ని చోట్ల వారసుల స్వాధీనంలో ఉన్నాయి. అప్పుడు నిర్మించిన ఇళ్లలో ప్రస్తుతం 50శాతం కూడా లబ్ధిదారుల వద్ద లేవు. జాబితాలో మాత్రం అప్పటి లబ్ధిదారుల పేర్లే ఉన్నాయి. దీంతో ఎవరి నుంచి ఓటీఎస్‌ నగదు వసూలు చేయాలన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రుణ బకాయిలు చెల్లించేందుకు చాలామంది ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే అధికారులపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది. ఎలాగైనా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఓటీఎస్‌ వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశాలిస్తున్నారు. 

స్పందన అంతంతే..!

ప్రభుత్వ కాలనీలకు చెందిన లబ్ధిదారులు అతికొద్ది మంది మాత్రమే బకాయిలు చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించే వారు జిల్లాలో కొద్దిశాతం మందే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అధికారులు దాదాపు 96 శాతం బకాయిల వసూళ్లకు కార్యాచరణ ప్రకటించారు. ఈ బాధ్యత మండల, గ్రామ, సచివాలయ స్థాయిలుగా విభజించిన భారమంతా గ్రామ కార్యదర్శులపైనే వేశారు. 


లక్ష్యాన్ని చేధించడం ఎలా?

గిద్దలూరు నియోజకవర్గంలో 9వేల పైచిలుకు ఇళ్ల నుంచి నగదు వసూలు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు కేవలం నియోజకవర్గంలో 647 మంది మాత్రమే ఓటీఎస్‌ కింద నగదు చెల్లించారు. గిద్దలూరు మున్సిపాలిటీలో 74 మంది ఓటీఎస్‌ కింద రుణవిముక్తులయ్యారు. ప్రతి సచివాలయ పరిధిలో రోజుకు కనీసం పది మంది నుంచైనా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా, లబ్ధిదారుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు.  ప్రభుత్వ లక్ష్యం ఎలా పూర్తి చేయాలని ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-12-06T04:33:33+05:30 IST