ఓటీఎస్‌.. వడ్డన

ABN , First Publish Date - 2021-11-09T04:52:57+05:30 IST

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఏమో దేవుడెరుగు. ఇప్పుడు అంతా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో ఓటీఎస్‌(ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌) స్కీమ్‌ పథకాన్ని జపిస్తోన్నారు.

ఓటీఎస్‌.. వడ్డన

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో పేదలపై భారం

జిల్లాలో రూ.390.53 కోట్ల వసూలే లక్ష్యంగా ప్రయత్నాలు

లబ్ధిదారుల వద్ద వసూలు చేయించే బాధ్యత హౌసింగ్‌ జేసీకి

పురోగతిపై సచివాలయాల సిబ్బందికి గంట గంటకు ఫోన్లు


గుంటూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఏమో దేవుడెరుగు. ఇప్పుడు అంతా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో ఓటీఎస్‌(ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌) స్కీమ్‌ పథకాన్ని జపిస్తోన్నారు. 1983 మొదలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల నుంచి కేటగిరీల వారీగా నగదు వసూలు లక్ష్యంగా అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారుల వద్ద ఈ స్కీమ్‌ పేరుతో రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత కొద్ది రోజుల నుంచి సచివాలయాల సిబ్బందిని ఈ విషయంపై  ఒత్తిడి చేస్తున్నారు. అధికారలుఉ అందజేసిన జాబితాల్లో లబ్ధిదారుల ఆధారంగా గుర్తించి వారితో ఓటీఎస్‌కి దరఖాస్తు చేయించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోనే రూ.390.53 కోట్లు కూడగట్టుకునేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గృహనిర్మాణ పథకాలు ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఇప్పటివరకు 3.57 లక్షల మంది లబ్ధి పొందారని అధికారులు లెక్కలు తేల్చారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 3.11 లక్షల మంది, మునిసిపల్‌ ఏరియాలో 25,289, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏరియాలో 20,493 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు.


వడ్డన ఇలా..

గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ లబ్ధిదారులు అయితే రూ.10 వేలు, ఒకవేళ లబ్ధిదారుల వద్ద వేరొకరు ఇల్లు కొనుగోలు చేసి వారి స్వాధీనంలో ఉంటే రూ.15 వేలు జగనన్న సంపూర్ణ గృహహక్కు(ఓటీఎస్‌) పథకం కింద దరఖాస్తు చేయించి చెల్లించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపాలిటీలో వాస్తవ లబ్ధిదారులు అయితే రూ.25 వేలు, ఇతర వ్యక్తులు రూ.30 వేలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వాస్తవ లబ్ధిదారుల వద్ద రూ.20 వేలు, బయటి వ్యక్తులు రూ.40 వేలు కట్టించుకుని ఓటీఎస్‌కి దరఖాస్తు చేయించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే 78,587 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.  మిగిలిన వారి వివరాలను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో గంట గంటకు పురోగతిని కోరతామని జేసీ హౌసింగ్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఇళ్ల నుంచి రూ. 311.61 కోట్లు, మునిసిపాలిటీల్లో రూ.37.93 కోట్లు, నగరపాలకసంస్థల పరిధిలో రూ.40.98 కోట్లు రాబట్టేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఎన్నికలకు ముందు హౌసింగ్‌ పెండింగ్‌ బకాయిలన్ని మాఫీ చేస్తామని చెప్పిన జగన్‌ సీఎం అయ్యాక మాట మార్చి ఇలా ఓటీఎస్‌ స్కీమ్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతుండటంపై పేదలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-09T04:52:57+05:30 IST