క్రమబద్ధీకరణపై.. ఓటీఎస్‌ కత్తి

ABN , First Publish Date - 2022-06-21T06:19:42+05:30 IST

సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రొబేషన్‌ వాయిదా వేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకున్న ప్రభుత్వం ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో దొడ్డిదారులు వెతుకుతోంది.

క్రమబద్ధీకరణపై.. ఓటీఎస్‌ కత్తి

సచివాలయ ఉద్యోగులపై మరో అస్త్రం

ప్రొబేషన్‌ సమీపిస్తుండగా తెరపైకి నకిలీ చలానాలు

నగదు చెల్లించే వరకు నిలిపివేయాలని సీఎస్‌ ఆదేశాలు

నాడు భరోసా.. నేడు సంబంధంలేదన్న ఉన్నతాధికారులు

అగమ్యగోచరంగా మారిన సచివాలయ ఉద్యోగుల భవిష్యత్‌


సీఎం జగన్‌ మానసపుత్రిక సచివాలయ వ్యవస్థ. గడపగడపకు ప్రభుత్వ సేవల కోసమని.. యువతకు ప్రభుత్వ ఉద్యోగమని బాకా కొట్టారు. తీరా గడువు ముగిసినా సచివాలయ ఉద్యోగులు ఇంకా  ప్రొబేషన్‌లోనే ఉన్నారు. పరీక్ష నిబంధనపెట్టి కూడా క్రమబద్ధీకరణలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. గతంలో ఆందోళనల నేపథ్యంలో జూలైలో క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించింది. ఆ గడువు కూడా సమీపిస్తుండటంతో తమ కల నెరవేరుతుందనే ఆశలో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. అయితే క్రమబద్ధీకరణకు కొర్రీలు వేసేందుకు తాజాగా ఓటీఎస్‌ అస్త్రాన్ని ప్రభుత్వం సంధించింది. ఓటీఎస్‌ నకిలీ చలానాలకు సచివాలయ పరిధిలోని ఉద్యోగులే బాధ్యులంటూ వారిపై కత్తి కట్టింది. ఆయా చలానాలకు సంబంధించిన మొత్తం నగదు వసూలు చేయాలని లేదంటే అప్పటి వరకు ప్రొబేషన్‌ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఊహించని ఈ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.  


గుంటూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రొబేషన్‌ వాయిదా వేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకున్న ప్రభుత్వం ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో దొడ్డిదారులు వెతుకుతోంది. కొత్తకొత్త నిబంధనలతో ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే ఓటీఎస్‌ అస్త్రాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రయోగించింది. ఫేక్‌ చలానాలు సృష్టించారంటూ నెపం మోపి వారందరికీ ప్రొబేషన్‌ నిలుపుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. రేపో మాపో ప్రొబేషన్‌ పూర్తై పూర్తిస్థాయి ఉద్యోగులుగా మారుతామన్న ఆశతో ఉన్న వారికి ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంలా మారింది. 


అధికారుల తప్పునకు.. ఉద్యోగులు బలి

గత ప్రభుత్వాల హయాంలో కట్టిన ఇళ్ల లబ్ధిదారుల నుంచి నగదు వసూళ్లకు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై అటు ప్రతిపక్షాలు.. ఇటు ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఏమిటంటూ లబ్ధిదారులు మండిపడ్డారు. అయితే వెనక్కి తగ్గని ప్రభుత్వం నగదు వసూళ్ల బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై పెట్టింది. అంతేగాక ఓటీఎస్‌ అమలు విషయంలో ప్రభుత్వం అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. జిల్లాల వారీగా అధికారులకు లక్ష్యాలు నిర్ధేశించింది. అయినా నగదు చెల్లించేందుకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆ లక్ష్యాలను అధిగమించడానికి అధికారులు సచివాలయ ఉద్యోగులకు నాడు ఇచ్చిన ఉచిత సలహా నేడు వారి పాలిట శాపంలా మారింది. లబ్ధిదారులు ఓటీఎస్‌కు అంగీకరించకపోయినా వారి పేరు మీద చలానాలు తయారు చేయాలని మౌఖికంగా సచివాలయ ఉద్యోగులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ చలానాల తయారీకి భయపడుతున్న సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు నాడు భరోసా ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఉద్యోగులకు భరోసా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వారంతా చేతులు ఎత్తేశారు. సచివాలయ ఉద్యోగులను ఓటీఎస్‌ చలానాలకు బాధ్యులను చేస్తూ వారంతా తప్పుకున్నారు. దీంతో ఫేక్‌ చలానాల భారం మొత్తం సచివాలయ ఉద్యోగులపైనే పడింది. ఈ పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులంతా నేడు బలిపీఠమెక్కాల్సి వచ్చింది. ఇదే విషయంపై ఉద్యోగులు ఉన్నతాధికారులను కలవగా సచివాలయ పరిధిలోని ఉద్యోగులందరూ కలిసి ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించినట్లు సమాచారం. దీంతో వీరంతా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే గనుక జరిగితే  క్రమబద్ధీకరణ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో 321 ఫేక్‌ చలానాలు 

గుంటూరు జిల్లాలో 18,357 మందికి సంబంధించి 3,421 చలానాలు రూపొందించగా, వాటిలో 69 చలానాలకు నగదు చెల్లించలేదు. బాపట్ల జిల్లాలో 29,206 మందికి సంబంధించి 4,333 చలానాలు రూపొందించగా 95 చలానాలకు నగదు జమ కాలేదు. పల్నాడు జిల్లాలో 32,463 మందికి సంబంధించి 3,724 చలానాలు రూపొందించగా వాటిలో 157 చలానాలకు నగదు జమ కాలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 1300 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా వాటిలో 872 మంది గ్రామ, 462 మంది వార్డు కార్యదర్శులు, 1334 మంది డిజిటల్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు చీరాల డివిజన్‌లో మరో 600 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఓటీఎస్‌ అమలు ప్రధానంగా వీరిపైనే ఉంటుంది. కార్యదర్శుల పోస్టులు కొన్ని ఖాళీగా ఉండడంతో వాటిలో ఇతర ఉద్యోగులను ఇన్‌చార్జిలుగా నియమించారు. దీంతో వీరు కూడా ఓటీఎస్‌ అమలులో భాగమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా వీరి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఫలితంగా ఈ మూడు జిల్లాల్లో ఎంతమందికి ప్రొబేషన్‌ గడువు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.


జమ కాని నగదు రూ.82 కోట్లు 

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో రూ.82 కోట్ల మేర ఓటీఎస్‌ నకిలీ చలానాలు తయారైనట్లు తేలింది. నగదు చెల్లించకుండానే చలానాలు తయారు చేసినట్లు స్వయంగా సీఎస్‌ సమీర్‌శర్మ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 98,342 చలానాలు రూపొందించగా వాటిలో 4,069 చలానాలకు నగదు జమ కాలేదు. వీటికి బాధ్యులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను నిలుపుదల చేయాలని ఆయన సచివాలయ శాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌కు ఆదేశాలు జారీ చేశారు. 82 కోట్ల నగదు వీరి నుంచి వసూలు చేయాలని, అప్పటి వరకూ ప్రొబేషన్‌ను నిలిపి వేయాలని ఆయన ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో 15004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా ఓటీఎస్‌లో భాగస్వాములైన 7,040 మంది గ్రేడ్‌- 5 గ్రామ కార్యదర్శులు, 3,300 మంది వార్డు కార్యదర్శులు, 14వేల మంది డిజిటల్‌ అసిస్టెంట్లపై ఈ ప్రభావం పడింది. 

Updated Date - 2022-06-21T06:19:42+05:30 IST