ఓటీఎస్‌.. రుణం

ABN , First Publish Date - 2021-12-02T05:36:09+05:30 IST

రుణం ఇప్పించి ఆ మొత్తాన్ని ఓటీఎస్‌కు జమ చేసి లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వర్తింప చేయాలని అధికారులు సిద్ధమయ్యారు.

ఓటీఎస్‌.. రుణం

డ్వాక్రా మహిళలే లక్ష్యం

శిరోభారంగా గృహ హక్కు పథకం


ప్రత్తిపాడు, డిశంబరు 1: రుణం ఇప్పించి ఆ మొత్తాన్ని ఓటీఎస్‌కు జమ చేసి లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వర్తింప చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వలంటీర్ల ద్వారా చేసిన ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. ఏ విధంగానైనా సరే లబ్ధిదారుల చేత డబ్బు కట్టించేందుకు సామధాన బేదదండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో మగవాళ్లతో పనికాదని గ్రహించిన అధికారులు ఇప్పుడు డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. ఓటీఎస్‌ కింద ఉన్న అప్పును తీర్చడం కోసం డ్వాక్రా మహిళలకు అప్పులు ఇప్పించే కార్యక్రమానికి వైఎస్సార్‌ క్రాంతి పథం అధికారులు ప్రత్తిపాడులో శ్రీకారం చుట్టారు. డ్వాక్రా సంఘాలలో ఉన్న గృహ నిర్మాణసంస్థకు అప్పు ఉన్న వారి జాబితాను తయారు చేశారు.  వారికి అప్పు ఇప్పించేదుకు ఏపీఎంతో పాటు సీసీలు, యానిమేటర్లు కుస్తీ పడుతున్నారు. ఇదే విషయాన్ని బుధవారం స్థానిక  ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీఎం సుబ్బారావు ఆర్డీవో భాస్కర్‌రెడ్డికి వివరించారు. డ్వాక్రా మహిళలకు రుణం ఇప్పించి, వచ్చిన డబ్బును ఓటీఎస్‌ కింద చెల్లించే విధంగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి చేత ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించే విధంగా చూడాలని సమావేశంలో అధికారులను ఆర్డీవో ఆదేశించారు.


రూ.లక్షల ఆస్తి రిజిష్టర్‌ చేస్తున్నాం కదా : ఆర్డీవో

అప్పులు ఇప్పించి ఇంటి అప్పు కట్టించుకునే పద్ధతి ఏమిటంటూ పలువురు ఆర్డీవోను ప్రశ్నించారు. ఇది లబ్ధిదారుల మంచి కోసమే అంటూ ఆర్డీవో సమాధానమిచ్చారు. రూ.లక్షల ఆస్తిని రిజిష్టర్‌ చేస్తున్నాం కదా అన్నారు. మండలంలో 1340 మంది పేర్లు ఓటీఎస్‌ కింద రాగా వారిలో 854 మంది మహిళలు డ్వాక్రా సంఘాలలో ఉన్నారు. వీరిని టార్గెట్‌ చేసి గ్రామాలలో అధికారులు పనిచేస్తున్నారు.  


Updated Date - 2021-12-02T05:36:09+05:30 IST