ఓటీఎస్‌పై సహాయ నిరాకరణ

Dec 7 2021 @ 01:43AM

ఎవరూ డబ్బు చెల్లించొద్దు చంద్రబాబు పిలుపు

‘సచివాలయాల్లో’ రిజిస్ట్రేషన్‌ చెల్లుబాటు కాదు

స్వచ్ఛందమంటూనే బెదిరింపులా!

సాక్ష్యాలు ఇవిగో.. ఇప్పుడేమంటారు?

అధికారులూ.. అక్రమంగా వేధిస్తే తీవ్ర పరిణామాలు: బాబు


అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పేదల పక్కా ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్‌ పఽథకానికి సహాయ నిరాకరణకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దోపిడి దొంగల మాదిరిగా పేద ప్రజలను దోచుకోవడానికే ఓటీఎస్‌ పథకం తెచ్చారని, ఇది బోగస్‌ పథకం అని విమర్శించారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ న్యాయపరంగా చెల్లుబాటే కాదని వివరించారు. ‘‘ఓటీఎ్‌సకు ప్రజలు సహకరించవద్దు. సహాయ నిరాకరణ పాటించండి. మీకు మేం అండగా ఉంటాం. ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఓటీఎ్‌సను వ్యతిరేకిస్తున్నాయి. అందరూ పేదలకు అండగా ఉంటారు. ప్రభుత్వం పెట్టే కేసులకు మేం భయపడం. అవి మమ్మల్ని ఏమీ చేయలేవు. డబ్బు చెల్లించేది లేదని గట్టిగా చెప్పండి.


మీపై ఎవరైనా ఒత్తిడి తెస్తే మీ పక్కన మేం నిలబడతాం’’ అని బాబు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ పేదల ఇళ్లపై రుణాలను పూర్తిగా రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తానని హామీలు గుప్పించిన జగన్‌రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లను మొదలు పెట్టి గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వ సూలు చేయడానికి ఈ ప్రభుత్వానికి ఏం హక్కుంది? ఈ ప్రభుత్వం ఆ ఇళ్లు ఇచ్చిందా? స్థలాలు ఇచ్చిందా? తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 1984లో పేదలు తమ ఇళ్ల నిర్మాణానికి రూ.6,000 రుణం తీసుకొన్నారు. మూడున్నర దశాబ్దాల తర్వాత వాటికి ఇప్పుడు ప్రభుత్వం రూ.6,000 చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది. చాలా ఇళ్లు కూలిపోయాయి. అయినా డబ్బు చెల్లించాల్సిందేనని వేధిస్తున్నారు. పాత ఇళ్లు బాగు చేసుకోవడానికి మా ప్రభుత్వం తలకు రూ.10,000 ఇచ్చింది. మీకు చేతనైతే రూ.25,000 ఇవ్వండి. అది వదిలిపెట్టి గ్రామాల్లో రూ. 10,000, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.30 వేలు కట్టి తీరాలని ఒత్తిడి తేవడం దుర్మార్గం. మా ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో కొన్ని ఇళ్లకు పైసా కూడా తీసుకోకుండా మేం హక్కు పత్రాలు ఇచ్చాం.


ఆ పని వీళ్లు ఎందుకు చేయలేరు?’’ అని ప్రశ్నించారు. రుణాలు రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఎన్నికల్లో ఓటు వేయించుకొన్న పెద్ద మనిషి ఇప్పుడు డబ్బులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నందుకు చీటింగ్‌ కేసు పెట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పథకం స్వచ్ఛంద మేనని ఒక పక్క చెబుతూ మరో పక్క సంక్షేమ పఽథకాలు, సర్టిఫికెట్లు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా మద్దిపాడు ఎంపీడీవో సుస్మితా రెడ్డి తమ మండల పరిధిలోని ప్రభుత్వ సిబ్బందికి పంపిన ఆడియో సందేశాన్ని ఆయన విలేకరుల సమావేశంలో వినిపించారు. డబ్బు కట్టించకపోతే వలంటీర్లపై చర్య తీసుకొంటామని శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి ఎంపీడీవో ఇచ్చిన సర్క్యులర్‌ను కూడా ఆయన చదివి వినిపించారు. ‘‘ప్రభుత్వం పథకం తెస్తే ప్రజలు డబ్బులు కట్టాల్సిందేనా? కట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపు చేస్తామనడానికి వీరెవరు? ఏం హక్కుందని ఈ రకమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు? అంతా స్వచ్ఛందమేనని ఉపన్యాసాలు చెప్పే సాక్షి గుమస్తా... అర్ధం కాకుండా మాట్లాడే విజయనగరం మంత్రి దీనికేం సమాధానం చెబుతారు? వీళ్లు చెప్పే రిజిస్ట్రేషన్‌ లేకుండా ఇంతకాలం పేదలు తమ ఇళ్లలో ఉండలేదా? ఇప్పుడు ఎందుకు కట్టాలి? ఎవరికైనా అవసరం అనుకొంటే కడతారు... మీరెవరు మెడపై కత్తి పెట్టి డబ్బు చెల్లించితీరాల్సిందే అనడానికి?’’ అని మండిపడ్డారు. 


‘ప్రాజెక్టు’ నిర్వాసితులూ చెల్లించాల్సిందేనా?

పులిచింతల ప్రాజెక్టు కింద ఇళ్లు పోయిన వారికి పునరావాసం కింద ఇళ్లు కట్టిస్తే వాళ్లు కూడా ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి  లేదని చెప్పారు. డబ్బులు లేవంటే వారికి డ్వాక్రా సంఘాల నుంచి రుణం ఇప్పించి మరీ ఓటీఎస్‌ కింద కట్టిస్తున్నారని, డ్వాక్రా సంఘం అప్పు ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తప్ప మరెక్కడ రిజిస్ట్రేషన్లు చేసినా అవి చెల్లుబాటు కావని, గ్రామ సచివాలయాల్లో పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తామనడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పైగా దీనికి సంబంధించిన స్టాంప్‌ పేపర్లపై కూడా వైసీపీ రంగులు ముద్రించారని, పిచ్చి ముదిరిపోయిందనడానికి ఇదే ఉదాహరణని అన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు ఎందుకు డబ్బులు చెల్లించాలని మహిళలు ప్రశ్నిస్తున్న వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. పేదలపై ఒత్తిడి తెస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రేపు, ఎల్లుండి కూడా ఉంటాయి. ఇవాళే కాదు. అధికారులు గుర్తు పెట్టుకోవాలి. అక్రమంగా పేదలను వేధిస్తే తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవు. విలువలు లేని వ్యక్తులు, నేరగాళ్ల చేతికి అధికారం వస్తే ఏం చేస్తారో ఈ పరిణామాలు చూపిస్తున్నాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.