ఓటీఎస్‌ పథకం పేరుతో పేదలపై ఒత్తిడి

ABN , First Publish Date - 2021-12-01T21:34:07+05:30 IST

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకం పేరుతో పేదలపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఓటీఎస్‌ పథకం పేరుతో పేదలపై ఒత్తిడి

గుంటూరు: అంతా అనుకున్నట్లే జరుగుతోంది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకం పేరుతో పేదలపై ఒత్తిడి పెంచుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పెన్షన్లు నిలిపివేశారు. భార్య పేరుపై ఉన్న ఇంటి నిర్మాణ రుణం వల్ల భర్త నెట్టేం నాగేశ్వరరావుకు వాలంటీర్లు పెన్షన్‌ నిలిపివేశారు. వన్ టైం సెటిల్‌మెంట్ నగదు చెల్లిస్తేనే పెన్షన్‌ ఇస్తామంటున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సర్కారు పేదలపైనా పగపట్టింది. కాసుల కోసం పేదల గూటిపై దండయాత్ర చేస్తోంది. అప్పుడెప్పుడో ఇచ్చిన పాత ఇళ్లకు కొత్తగా ‘పైసా వసూల్‌’ చేస్తున్న ప్రభుత్వం...  వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) డబ్బులు చెల్లించకుంటే పెన్షన్‌కు కోతపెడతామని హెచ్చరిస్తోంది. ‘డబ్బులు కడతారా... పింఛను ఆపేయమంటారా’ అంటూ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేస్తున్న ఒత్తిడితో పేదలు తల్లడిల్లుతున్నారు. 


ఓటీఎస్‌ కింద డబ్బులు కడితేనే సామాజిక పింఛను చెల్లించాలని, లేకపోతే కోత పెట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి  ఆదేశాలు జారీ చేసింది. ‘‘రాష్ట్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఓటీఎస్‌ చేసుకుంటేనే ఇక పెన్షన్‌ చెల్లించండి. పెన్షన్‌దారుల కుటుంబాలకు చెందిన వారెవరైనా గతంలో ప్రభుత్వ హౌసింగ్‌  పథకం ద్వారా గ్రామాల్లో  ఇల్లు నిర్మించుకుని ఉంటే... వాళ్లు రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే అలాంటి వారికి డిసెంబరు పెన్షన్‌ ఇవ్వొద్దు’’ అని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లను ఆదేశించారు.


Updated Date - 2021-12-01T21:34:07+05:30 IST