పేదలను దోచుకోవడానికే ఓటీఎస్‌

ABN , First Publish Date - 2021-12-07T06:08:56+05:30 IST

పేదలను దోచుకోవడానికే ప్రభుత్వం ఓటీఎస్‌ పథకం తీసుకు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు.

పేదలను దోచుకోవడానికే ఓటీఎస్‌
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

డబ్బులు కట్టొద్దు.. అండగా ఉంటాం

మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు


చోడవరం, డిసెంబరు 6: పేదలను దోచుకోవడానికే ప్రభుత్వం ఓటీఎస్‌ పథకం తీసుకు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు. అన్నవరం గ్రామంలో సోమవారం ఓటీఎస్‌తో పేదలను వేధిస్తున్న వైనంపై బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. లబ్ధిదారులెవరూ డబ్బులు చెల్లించవద్దని, ఎవరైనా వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన పక్షంలో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని రాజు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, స్థానిక నేత ముడుసు గోవింద్‌ పాల్గొన్నారు. 


ఓటీఎస్‌తో పేదలపై భారం

బుచ్చెయ్యపేట: ఓటీఎస్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలుచేస్తూ పేదలపై భారం మోపుతున్నదని టీడీపీ మండల అధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావు అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పేదల మెడకు ఓటీఎస్‌ ఉరితాడుగా మారుతున్నదన్నారు. ఓటీఎస్‌ విషయంలో బలవంతం పెట్టడం లేదంటూనే ఉద్యోగులకు రోజువారి లక్ష్యాలను విధించడం సిగ్గుచేటన్నారు. డబ్బులు కట్టలేమని లబ్ధిదారులు మొత్తుకుంటున్నా రోజువారి టార్గెట్ల కారణంగా అధికారులు ససేమిరా అంటున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హౌసింగ్‌ రుణాలను రద్దుచేస్తామని చంద్రబాబు ప్రకటించారని, అందువల్ల పేదలు ఓటీఎస్‌కు డబ్బులు చెల్లించవద్దని ఆయన సూచించారు.

Updated Date - 2021-12-07T06:08:56+05:30 IST