ఓటీఎస్‌ తుస్‌!

ABN , First Publish Date - 2022-06-21T06:18:10+05:30 IST

వాళ్లంతా ప్రభుత్వ సహకారంతో ఎప్పుడో గృహాలు నిర్మించుకున్నారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు వారికి పక్కా గృహాలు మంజూరు చేస్తే వాటికి తమ రెక్కల కష్టాన్ని కలిపి సొంతిళ్లను కట్టుకున్నారు.

ఓటీఎస్‌ తుస్‌!
ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ

డబ్బులు చెల్లించిన వారికీ  పూర్తికాని రిజిస్ట్రేషన్లు

నాలుగో వంతు మందికి  కూడా అందని పత్రాలు

పేరు గొప్ప ఊరుదిబ్బగా పథకం అమలు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు అందేదెన్నడో? 

లబ్ధిదారుల్లో ఆందోళన

ఇచ్చిన కొద్దిమంది నుంచి డిజిటల్‌ సంతకం పేరుతో వెనక్కి 

దొనకొండ మండలంలో మొత్తం ఓటీఎస్‌కు 1,757 మంది లబ్ధిదారులను ఎంపికచేయగా వారిలో 896 మందికి రిజిస్ట్రేషన్లు చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ రూ.10, రూ.10వేలు  చెల్లించిన లబ్ధిదారుల గురించి అడిగితే అటు రెవెన్యూ, ఇటు హౌసింగ్‌ శాఖల సిబ్బంది ప్రస్తుతం ఆన్‌లైన్లో ఆ వివరాలు అందుబాటులో లేవంటున్నారు. 

కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలంలో 1,414మంది లబ్ధిదారుల  నుంచి డబ్బులు కట్టించిన అధికారులు కేవలం 653 మందికి మాత్రమే రిజిస్ర్టేషన్లు పూర్తిచేశారు. పొన్నలూరు మండలంలో 817కు గాను 484, కొండపి మండలంలో 1,163కి కేవలం 627 మందివి మాత్రమే రిజిస్ర్టేషన్లు పూర్తయ్యాయి. వారందరికీ పూర్తిస్థాయిలో హక్కు పత్రాలను ఇచ్చిన పరిస్థితి లేదు. 

కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో 1,232 మంది ఓటీఎస్‌కు నగదు చెల్లించగా కేవలం 735 మందికి మాత్రమే రిజిస్ర్టేషన్లు పూర్తయ్యాయి. హెచ్‌ఎంపాడు మండలంలో 1,319కి గాను 944, కనిగిరి మండలంలో 2,163కి 1,367 మందివి  రిజిస్ర్టేషన్‌ చేశారు.

ఇదీ జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పరిస్థితి. మీరు ఉంటున్న ఇల్లు మీదే అని ధ్రువీకరిస్తూ మీకు అన్ని హక్కులు కల్గిన రిజిస్ర్టేషన్‌ పత్రాలు ఇస్తాం అందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)కింద రూ.10వేలు, లేదా రూ.20వేలు, లేదా రూ.10 చెల్లిస్తే చాలు అంటూ కొన్నినెలల క్రితం గ్రామాల్లో అధికారులు హడావుడి చేశారు. రెవెన్యూ, మండల పరిషత్‌, హౌసింగ్‌ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా నగదు కట్టించి వారి టార్గెట్లను పూర్తిచేసుకున్నారు. కొంతమందికి మాత్రమే హక్కు పత్రాలు అందించి కొద్దిరోజులు గడిచిన తర్వాత వాటిపై డిజిటల్‌ సంతకం ఉండాలనే కారణంతో  వెనక్కి తీసుకొ న్నారు. మూడు నెలలు గడుస్తున్నా నేటికీ  తిరిగి ఇవ్వలేదు. మిగతా వారికి సైతం పత్రాలు అందించలేదు. ఓటీఎస్‌పై ప్రారంభంలో ఉన్న హడావుడి ఇప్పుడు ఏమాత్రం కన్పించడం లేదని పలువురు లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. 

ఒంగోలు నగరం, జూన్‌ 20: వాళ్లంతా ప్రభుత్వ సహకారంతో ఎప్పుడో గృహాలు నిర్మించుకున్నారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు వారికి పక్కా గృహాలు మంజూరు చేస్తే వాటికి తమ రెక్కల కష్టాన్ని కలిపి సొంతిళ్లను కట్టుకున్నారు. ప్రస్తుతం ఒక్కో పక్కాగృహం యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు ఉండగా అంతకు ముందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యూనిట్‌ విలువ రూ.2.50లక్షలుగా ఉన్నాయి. అంతకు ముందు 1983లో ఒక్కో పక్కాగృహం యూనిట్‌ విలువ రూ.25వేలు కూడా ఉండేది. యూనిట్‌ విలువ ఎంత ఉన్నా, గతంలో ఎప్పుడు నిర్మించుకొన్నా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా రుణం పొంది ఉంటే అలాంటి వాళ్లు తిరిగి సొమ్ము చెల్లించాల్సిందే. అలా చెల్లించిన వారి ఇళ్లను, స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం అంటూ ఆశలుపెట్టి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పక్కాగృహాల లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. 


ఆశచూపి.. బెదిరించి.. కట్టించారు!

మీకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడే అప్పుడే సర్వహక్కులూ వస్తాయి. మీరు ఈ ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు. అమ్ముకోవచ్చు. మీరు ఉంటున్న ఇంటిని ఇతరుల దగ్గర కొనుగోలు చేసుకుని ఉంటే ఇప్పుడు డబ్బులు కడితే మీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం అని ప్రభుత్వం ఆశపెట్టింది. దీనికి వన్‌టైం సెటిల్‌మెంటు స్కీం(ఓటీఎస్‌) అనే పేరు పెట్టింది. దీంతో అనేకమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డబ్బు చెల్లించారు. కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి బెదిరించి మరీ డబ్బులు కట్టించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇళ్లు నిర్మించుకున్న సమయంలో తీసుకున్న రుణాన్ని బట్టి ఎంత కట్టాలో నిర్ణయించి  వసూలు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను బట్టి ఒక్కొక్కరి వద్ద రూ.4వేల నుంచి రూ.10వేలు వరకు కట్టించుకున్నారు. ఇందిర ఆవాస్‌ యోజన కింద పూర్తి సబ్సిడీతో కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయంతో నిర్మించుకున్న వారికి మాత్రం డబ్బుల చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. పూర్తి సబ్సిడీతో ఇళ్లు నిర్మించుకున్న వారు రూ.10 చెల్లిస్తే చాలు ఉచితంగానే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని ప్రభుత్వం చెప్పటంతో ఐఏవై లబ్ధిదారులు కూడా సచివాలయాల్లో రూ.10 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ల మాటే ప్రభుత్వం ఎత్తటం లేదు. డబ్బులు కట్టిన వారిలో నాలుగో వంతుమందికి కూడా ఇంతవరకు హక్కుపత్రాలు అందలేదు. లబ్ధిదారులు నెలల తరబడి సచివాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 


61,209 మంది నుంచి రూ.17కోట్లు వసూలు 

ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంటు పథకాన్ని ప్రకటించినప్పుడు పక్కాగృహాలు గతంలో నిర్మించుకున్న లబ్ధిదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఏ ప్రభుత్వమో నిర్మించి ఇస్తే ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటి బకాయిలు తిరిగి చెల్లించమనటం ఏమిటని చాలామంది నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తాం, తర్వాత ఏమైనా చేసుకోవచ్చు అంటూ ఆశపెట్టింది ప్రభుత్వం. దీంతో అప్పుడు అందరిలో కదలిక వచ్చింది. పైగా ప్రభుత్వం ఓటీఎస్‌ మేళాలు పెట్టి మరీ లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకుంది.. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి కట్టాలంటూ ఒత్తిడి పెంచారు. దీంతో జిల్లాలోని 38 మండలాల్లో 61,209మంది రూ.17కోట్లు ప్రభుత్వానికి వన్‌టైం సెటిల్‌మెంటు కింద చెల్లించారు. డబ్బులు కట్టించుకున్న తర్వాత ప్రభుత్వం మాట మార్చేసింది. 


మాటమార్చిన సర్కారు

డబ్బులు చెల్లించిన 61,209 మందిలో 44,632 మందే రిజిస్ట్రేషన్‌కు అర్హులని ప్రభుత్వం తేల్చింది. మిగిలిన వారి పట్టాలు వివాదంలో ఉన్నందున చేయటం కుదరలేదంటూ చేతులెత్తేసింది. పైగా వారు కట్టిన డబ్బుకు ఎటువంటి సమాధానం లేదు. అయితే ప్రభుత్వం చెప్పిన 44,632మందికి అయినా  సంబంధిత హక్కు పత్రాలు అందించారా అంటే అదీ లేదు. సవాలక్ష కారణాలు చూపి వారిలో సగంమందికి కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయలేదు. అవసరమైన ప్రక్రియ అంతా సచివాలయంలో పూర్తిచేసి సంబంధిత ఫైలును ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పంపించాల్సి ఉంది. అక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించి ఓకే అంటూ తిరిగి సచివాలయానికి పంపిస్తారు. సచివాలయంలో డాక్యుమెంటును డౌన్‌లోడ్‌ చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. కొన్ని సచివాల యాల్లో ఈ ప్రక్రియ అరకొరగా సాగగా కొంత మంది కార్యదర్శులకు, వీఆర్వోలకు ఇంతవ రకు దీనిపై అవగాహన ఉండటం లేదు. దీంతో డబ్బులు చెల్లించిన వారిలో నాలుగోవంతు మందికి కూడా హక్కు పత్రాలు అంద లేదు. 


నిషేధిత చట్టంలో ఉంటే రిజిస్ట్రేషన్‌ ఎలా?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 22ఏ ఉన్న భూములను రిజిస్ట్రేషన్‌ చేయటం నిషేధం. ఇవేమీ చూసుకోకుండా ప్రభుత్వం ఓటీఎస్‌ అంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసింది. పక్కాగృహాలు నిర్మించుకున్న వారిలో 90శాతం మంది ప్రభుత్వం ఇచ్చిన అసైన్డు భూముల్లోనే కట్టుకున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటిస్థలాలుగాని, ఇతర డీకే భూములు కానీ ఎవ్వరూ కొనకూడదు.. అమ్మకూడదు అంటూ 22ఏ కింద నిషేఽధిత భూముల జాబితాలో చేర్చారు. ఇప్పుడు ఆ నిబంధనే పేదల ఇళ్ళ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకుండా అడ్డుపడుతోంది. దీన్ని సంబంధిత ఆర్డీవో కార్యాలయంలోనే పరిష్కరించాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకుండా మొత్తం ప్రక్రియనే నిలిపివేశారు. ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించిన వారిలో కొంతమందికి వారు ఉంటున్న ఇంటి పట్టా ఇంకొకరి పేరు ఉంది. వారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఇలాంటి వాటి రిజిస్ట్రేషన్‌ కూడా నిలిపివేశారు. మొత్తం మీద ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించిన లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు కూడా దీనిపై పర్యవేక్షణ చేయటం లేదు. డబ్బులు కట్టించాం మా పని అయిపోయింది అనుకుంటూ డబ్బులు చెల్లించిన వారిని మరిచిపోయారు. దీంతో ప్రభుత్వం మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోయామనే భావన లబ్ధిదారులో నెలకొంది. 



Updated Date - 2022-06-21T06:18:10+05:30 IST