ఓటీటీలోనూ సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2021-01-03T05:30:00+05:30 IST

2020 కరోనా సినీపరిశ్రమను కుదిపేసింది. గడ్డుకాలంలో సినిమాల విడుదలకు ఓటీటీ వేదికలు ఓ వరంలా మారాయి. ఓటీటీలు పోటీపడడంతో పలు చిత్రాలు మంచి రేట్లకు అమ్ముడయ్యాయి.గత

ఓటీటీలోనూ సంక్రాంతి సందడి

2020 కరోనా సినీపరిశ్రమను కుదిపేసింది. గడ్డుకాలంలో సినిమాల విడుదలకు ఓటీటీ వేదికలు  ఓ వరంలా మారాయి. ఓటీటీలు పోటీపడడంతో పలు చిత్రాలు మంచి రేట్లకు అమ్ముడయ్యాయి.గత ఏడాది చివర్లో  మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో   వెండితెరపై సినిమాల సందడి మొదలైంది.  అయినా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలకు చెందిన పలు చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో ఓటీటీల్లో విడుదలవుతోన్న చిత్రాల గురించి కొన్ని విశేషాలు.


 త్రిభంగా

‘త్రిభంగా’ చిత్రంతో కాజోల్‌ డిజిటల్‌ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇది ముగ్గురు మహిళల కథ. ముంబైలోని ఓ కుటుంబంలో మూడు తరాల నేపథ్యంలో కథ సాగుతుంది. నటి రేణుకా షహానే దర్శకత్వం వహించారు. కాజోల్‌ భర్త అజయ్‌దేవ్‌గణ్‌ సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ అజయ్‌దేవ్‌గణ్‌ ఫిల్మ్స్‌ నిర్మించింది. కాజోల్‌ ఒడిస్సీ డ్యాన్సర్‌ పాత్ర పోషించారు.మిథిలాపాల్కర్‌, తన్వీ అజ్మీ ప్రధాన పాత్రలు పోషించారు. రేణుకా సహానే కథ, దర్శకత్వం. ఈ చిత్రం ఈ నెల  15న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది.




తమిళం


 మారా 

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘చార్లీ’కు ఇది తమిళ రీమేక్‌. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మారా అనే చిత్రకారుడి కోసం  కథానాయిక జరిపే అన్వేషణ నేపథ్యంలో కథ సాగుతుంది. కొత్త దర్శకుడు దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల వల్ల  చిత్రీకరణకు దాదాపు రెండేళ్లు పట్టింది. తొలుత విజయ్‌సేతుపతి, తర్వాత సిద్ధార్థ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తారని వార్తలు వినిపించాయి. . కానీ చివరకు ఆ పాత్ర మాధవన్‌ చేశారు. హీరోయినూ మారిపోయి  సాయిపల్లవి ప్లేస్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌  వచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో ఈ నెల  8న ఈ చిత్రం విడుదలవుతోంది. 




 భూమి

రైౖతులు తమ భూమిని రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ కంపెనీల బారి నుంచి కాపాడుకునేందుకు చేసే పోరాటం నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. జయం రవి, నిధి అగర్వాల్‌ జంటగా నటించారు. జయం రవికు ఇది 25వ చిత్రం. ఇందులో ఆయన రైతు పాత్రలో నటించారు.  రోనిత్‌ రాయ్‌ ప్రతినాయకుడిగా నటించారు. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించారు. మొదట థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నా ఓటీటీ విడుదలకే ఓటేశారు. డిస్నీ హాట్‌ స్టార్‌లో డైరెక్ట్‌ రిలీజ్‌ అవుతోన్న తొలి తమిళ చిత్రం ‘భూమి’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతోంది. 




 ముకిల్‌

విజయ్‌ సేతుపతి నిర్మాతగా వెబ్‌ ప్లాట్‌ఫాంపైకి అడుగుపెట్టారు. గంట నిడివి కలిగిన తొలి వెబ్‌చిత్రం ‘ముకిల్‌’ను నిర్మించారు. ఇందులో సేతుపతితో పాటు ఆయన కూతురు శ్రీజా విజయ్‌ సేతుపతి నటించారు. రెజీనా కసాండ్రా కథానాయిక. కార్తిక్‌ స్వామినాథ్‌ తొలిసారి దర్శకత్వం వహించారు. ‘ముకిల్‌’ చిత్రం  ఈ నెల్లోనే విడుదలకు సిద్ధమైంది.  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌, విడుదల తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశముంది. 




మలయాళం

  దృశ్యం 2

పలు భాషల్లో రీమేక్‌ అయ్యి ఘన విజయం సాధించిన ‘దృశ్యం’కి కొనసాగింపుగా మలయాళంలో వస్తోన్న చిత్రం ‘దృశ ్యం 2’. మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక షూటింగ్‌ను కొనసాగించి పూర్తిచేశారు. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. కొత్త సంవత్సరం సందర్భంగా మోహన్‌లాల్‌ ‘‘దృశ్యం 2’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలవుతుంది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని తెలిపారు. జనవరి చివరికల్లా ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.




హింది

 వైట్‌ టైగర్‌  

2008లో వచ్చిన అరవింద్‌ అడిగా ‘వైట్‌ టైగర్‌’  నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతోన్న  చిత్రంలో ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్‌ రావ్‌ , ఆదర్శ్‌ గౌరవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. భారతదేశంలోని పేదరికం, అవినీతి, కులవివక్ష నేపథ్యంలో కథ సాగుతుంది. అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై దంపతులు తమ ఎదుగుదల కోసం స్వార్థంతో  డ్రైవర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనుకున్నారనే నేపథ్యంలో కథ సాగుతుంది. రామిన్‌ బహ్రాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల  22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. 




 భుజ్‌ః ద ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా

 ఈ ఏడాది ఓటీటీలో విడుదలవుతోన్న పెద్ధ చిత్రం ‘భుజ్‌’. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం ఇది 1971లో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుంది. 300 మంది గుజరాతీ మహిళలు భారతీయ సైన్యానికి యుద్ధంలో సాయపడ్డ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అజయ్‌దేవ్‌గణ్‌, రానా దగ్గుబాటి, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, అమ్మీ విర్క్‌ తారాగణం. నోరా ఫతేహీ గూఢచారిపాత్రలో నటిస్తున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ కర్ణిక్‌ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ నటిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం విడుదలవుతోంది. తేదీని ప్రకటించాల్సి ఉంది. కథ, దర్శకత్వం అభిషేక్‌ దూదయ్య.




 ఆప్‌కే కమ్రే మే కోయీ రహతాహై 

‘యాదోంకి బరాత్‌’ చిత్రంలోని పాపులర్‌ సాంగ్‌ అప్‌కే కమ్రే మే కోయీ రహతాహై పల్లవిని ఈ చిత్రం టైటిల్‌గా పెట్టారు. నలుగురు బ్యాచిలర్స్‌ ముంబై లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుంటారు. అక్కడ వారికి  ఎదురయ్యే అనూహ్య పరిణామాల నేపథ్యంలో హారర్‌  కామెడీ చిత్రంగా తెరకెక్కింది. ‘వీరే ది వెడ్డింగ్‌’ జంట సుమిత్‌ వ్యాస్‌, స్వరాభాస్కర్‌ జంటగా నటిస్తున్నారు. స్వరాభాస్కర్‌ దెయ్యం పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఎంఎక్స్‌ ప్లేయర్‌లో విడుదలవుతోంది. తేదీలను ప్రకటించాల్సి ఉంది. 




 కాగజ్‌  

బతికుండగానే చనిపోయినట్టు  సర్టిఫికెట్‌ ఇచ్చిన  లంచగొండి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక సామాన్యుడి పోరాటం ఈ చిత్రం కథ. ఇదొక నిజజీవిత గాథ. అజంఘర్‌కు చెందిన భరత్‌ లాల్‌ బిహారీ జీవిత కథ. అతనొక రైతు. తాను బతికే  ఉన్నానని నిరూపించుకునేందుకు 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఇతర బాలీవుడ్‌ చిత్రాల్లా కాకుండా నాన్‌ గ్లామరస్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంగా ‘కాగజ్‌’ తెరకెక్కింది. ఈ చిత్రాన్నిసల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా సొంత బేనర్‌లో నిర్మించారు.


ఈ బయోగ్రఫికల్‌ డ్రామాకు సతీష్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. ఇంకో రెండు రోజులు షూటింగ్‌ మిగిలి ఉండగా లాక్‌డౌన్‌తో నిలిచింది.చిత్రీకరణ పూర్తి చేసి జీ 5 ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మోనాల్‌ గజ్జర్‌, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. జీ5 ఓటీటీలో ఈ నెల  7న విడుదలవుతోంది. 




 ద బిగ్‌ బుల్‌ 

అభిషేక్‌ బచ్చన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ద బిగ్‌ బుల్‌’. 1992 స్టాక్‌మార్కెట్‌ సెక్యూరిటీస్‌ స్కామ్‌, హర్షద్‌ మెహతా జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కింది. హన్సల్‌ మెహతా ‘స్కామ్‌ 1992’ ప్రేక్షాకాదరణ పొందడంతో అందరి కళ్లు ఈ చిత్రంపైనే ఉన్నాయి. కుకీగులాటీ దర్శకత్వం వహించారు. ఇలియానా, నిఖితా దత్తా, లేఖా త్రిపాఠి కీలకపాత్రలు పోషించారు.  గతేడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ నిర్ణయం మార్చుకొని ఈ ఏడాది ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2021-01-03T05:30:00+05:30 IST