అధికార పార్టీ సర్పంచి వల్లే మా అత్త చనిపోయింది

ABN , First Publish Date - 2022-05-19T07:10:48+05:30 IST

ధికార పార్టీ సర్పంచి మా ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం.. బెదిరింపులకు పాల్పడటంతో మానసికంగా కుంగిపోయి తమ అత్త సుందరమ్మ(55) మరణించిందని దేవి ఆరోపించారు. ఈ దిగులుతోనే గతేడాది తమ మామ కూడా మృతిచెందాడని పేర్కొన్నారు.

అధికార పార్టీ సర్పంచి వల్లే మా అత్త చనిపోయింది
గతేడాది బాధితుల ఇంటిలోని సామాన్లను దౌర్జన్యంగా బయట పడేసి.. గేటుకు తాళంవేసిన దృశ్యం

మా ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు


దిగులుతో గతేడాది మామ, ఇప్పుడు అత్త చనిపోయారు


మీడియా ఎదుట బాధితురాలి ఆవేదన.. ఆరోపణ


యాదమరి, మే 18: అధికార పార్టీ సర్పంచి మా ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం.. బెదిరింపులకు పాల్పడటంతో మానసికంగా కుంగిపోయి తమ అత్త సుందరమ్మ(55) మరణించిందని దేవి ఆరోపించారు. ఈ దిగులుతోనే గతేడాది తమ మామ కూడా మృతిచెందాడని పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోని.. యాదమరి మండల పరిధి ప్రశాంత్‌ నగర్‌కు చెందిన సుందరమ్మ బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. దీనికి సర్పంచి రవి కారణమని బాధితులు చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నుంచి ప్రశాంత్‌ నగర్‌లోని ఆక్రమణకు గురైన ఇంటికి తీసుకెళ్లి ఉంచారు. తమ ఇంటి ఆక్రమణ వెనుక తొలి నుంచీ జరిగిన ఘటనలను కుటుంబీకులతో కలిసి దేవి మీడియాకు వివరించారు. ఆమె మాటల్లోనే.. ‘2006లో ప్రభుత్వం మా రెండు కుటుంబాలకు 3 సెంట్లు చొప్పున పట్టాలిచ్చింది. 18 ఏళ్లుగా ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నాం. మా వద్ద అ్నన డాక్యుమెంట్లూ ఉన్నాయి. ఏనాడూ ఎవరూ మమ్మల్ని అడ్డుకోలేదు. గతేడాది అధికార పార్టీకి చెందిన మాధవరం సర్పంచి జేకే రవి మా ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. 2013లో ఆయన భార్య పేరిట ఈ స్థలం రిజిస్ట్రేషన్‌ అయినట్లు చెప్పాడు. వదిలేసి వెళ్లిపోమంటూ బెదిరించాడు. ఈ దిగులుతో గతేడాది మార్చిలో మా మామ మరణించారు. అప్పట్లో మేము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాం. మళ్లీ ఏప్రిల్‌ 29న ఇంట్లో మేము లేని సమయంలో 30 మంది గూండాలతో చొరబడి, సామగ్రి బయట పడేశాడు. ఇంటికి తాళాలు వేసేశారు. అప్పట్నుంచి మా రెండు కుటుంబాల వాళ్లం స్థానిక చర్చిలో నివాసం ఉంటున్నాం. మాకు న్యాయం చేయమని అన్ని శాఖల అధికారులకు అర్జీలిచ్చాం. కూలి చేసుకుని బతికే పేదోళ్లం. మా అబ్బాయి ఇంటర్‌ చదువుతున్నాడు. చర్చిలో ఉంటూనే పరీక్షలు రాస్తున్నాడు. 2013లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉంటే, 2021 వరకు ఎందుకు సర్పంచి జేకే రవి మా ఇంటి వద్దకు రాలేదు. సర్పంచి అయ్యాకే, ఆ పవర్‌తో మా ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం మాకు పట్టాలిచ్చినప్పుడు, ఇక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు స్థలం విలువ చాలా పెరిగిపోవడంతో జేకే రవి కన్నేశాడు. సర్పంచిగా ఉంటూ ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మేమెవ్వరి వద్దకు వెళ్లాలి. మేమంతా వైఎస్‌ పార్టీనే. టీడీపీ అని ప్రచారం చేసి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. సీఎం జగనన్న మాకు న్యాయం చేయాలి. జేకే రవి సర్పంచిగా ఉండేందుకు ఎలాంటి అర్హత లేదు’ అని వాపోయారు.  దీనిపై తహసీల్దార్‌ చిట్టిబాబును వివరణ కోరగా.. ‘ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ప్రస్తుతం ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో ఉందో వాళ్లే ఇక్కడ ఉండాలి. కోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. 16న కలెక్టర్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విచారణ చేసి నివేదిక అందిస్తాం’ అని తెలిపారు. 



Updated Date - 2022-05-19T07:10:48+05:30 IST