మన పెద్దపులి

ABN , First Publish Date - 2021-07-29T06:19:02+05:30 IST

టైగర్‌ అనే మాట..

మన పెద్దపులి

నల్లమలకు గుర్తింపు తెచ్చినవన్యప్రాణి 

ఉమ్మడి ఏపీలో పెరిగిన పులుల సంతతి 

దేశానికే తలమానికం ఎన్‌ఎస్‌టీపీ

నేడు వరల్డ్‌ టైగర్స్‌ డే


ఆత్మకూరు(కర్నూలు): జంతువుల్లో పెద్ద పులి రారాజు. బంగారు ఛాయపై నలుపు రంగు చారలతో రాజసంగా, గాంభీర్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మిగతా వన్యప్రాణుల కంటే పెద్దపులి జీవన విధానం వైవిధ్యభరితమైనది. నల్లమలలోని అభయారణ్యం పులుల ఆవాసం. వేల సంవత్సరాల నుంచి పెద్ద పులుల ఉనికి భూమ్మీద ఉంది. అయితే 20 శతాబ్దం ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పులులను సంరక్షించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. 2010లో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో టైగర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించి 2022 నాటికి రెట్టింపు సంఖ్య పులుల సంతతిని పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అలాగే 13 దేశాల శిఖరాగ్ర సదస్సులో పులుల సంతతి ఉన్న దేశాల్లో ప్రతి ఏటా జూలై 29న వరల్డ్‌ టైగర్స్‌ డేను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.


టైగర్‌ అనే మాట టైగ్రీస్‌ నుంచి వచ్చింది. ఈ పదం గ్రీకుభాష నుంచి పుట్టింది. దీనికి పర్షియన్‌లో బాణంలా వేగంగా దూసుకెళ్లేదని అర్థం. దీని శాస్ర్తీయనామం ఫాన్థెరటైగ్రీస్‌. గ్రీక్‌లో ఫాన్థెర అనగా తూర్పు ఆసియా మూలాన్ని కలిగి పసుపు, తెలుపు రంగు గల జంతువని అర్థం. పూర్వం పులులు ఆసియాలోని కాకసస్‌ నుంచి కాస్పియస్‌ సముద్రం, సైబీరియా, ఇండోనేషియా దేశాల వరకు విస్తరించాయి. పశ్చిమ భారతదేశం నుంచి తూర్పున చైనా, ఆగ్నేయాసియా వరకు, ఆగ్నేయ సైబీరియాలోని అముర్‌ నది వరకు పులులు సంచరించాయి. 


నల్లమలకే వన్నెతెచ్చిన పెద్దపులి

దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌గా పేరుగాంచిన నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం నల్లమలలో వుంది. ఇక్కడ పులుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీని వల్ల ప్రపంచంలో నల్లమలకు గుర్తింపు వచ్చింది. గత ఏడాదిలో రెండు పులులను కడప జిల్లా పరిధిలోని లంకమల అటవీ ప్రాంతంలో గుర్తించారు. అలాగే చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవిలో కూడా ఓ పెద్దపులి వున్నట్లు నిర్ధారించారు. దీన్నిబట్టి నల్లమలలో పులుల సంతతి పెరుగుతోందని అర్థమవుతోంది. తమ ఆవాసాన్ని పెంచుకునేందుకే పులుల ఇతర ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌టీఆర్‌లోని ఆత్మకూరు, నంద్యాల, మార్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్ల పరిధిలో 48 పులులు ఉన్నట్లు వన్యప్రాణి నిపుణుల అంచనా. నిజానికి లెక్కింపులో రెండున్నర వయస్సు పైబడిన పులులను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం పులికూనలు ఎన్‌ఎస్‌టీఆర్‌లో మరో పదికిపైగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల ప్రత్యుత్పత్తి కూడా ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. కాగా ఎన్‌ఎస్‌టీఆర్‌లో అంతర్భాగమైన ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పులుల మనుగడ సజావుగా సాగుతోంది. ఒక్క ఆత్మకూరు డివిజన్‌లోనే 25 దాకా పెద్దపులులు ఉన్నట్లు అంచనా. ఇది ఇక్కడి అటవీ అధికారుల విజయానికి గుర్తు. 


ఉమ్మడి ఏపీలో పెరిగిన పులుల సంతతి

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్‌) పరిధిలో 2006 గణాంకాల ప్రకారం 95 పెద్దపులులు ఉన్నాయి. అయితే 2010లో వాటి సంఖ్య 72కు పడిపోయింది. ఆ తర్వాత 2014 గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 68కి చేరింది. ఈ లెక్కన ఎనిమిదేళ్లలో 27 పులుల క్షీణించా యి. 2000 నుంచి దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిపోవడం పర్యావరణవేత్తలు, అటవీ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే 2019 జూలై 29న ప్రకటించిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఏపీలో 74 పులులు ఉన్నట్లు వైల్డ్‌లైఫ్‌ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో 48 పులులు ఉన్నట్లు అంచనా వేయగా, తెలంగాణలోని అమ్రాబాద్‌, కవాల్‌ అభయారణ్యాల పరిధిలో 26 పులులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కవాల్‌లో నాలుగైదు పులులు ఉండగా మిగిలిన పులులు అమ్రాబాద్‌ అభయారణ్యం పరిధిలోని నల్లమలలో ఉన్నట్లు చెప్పవచ్చు. కొంతకాలంగా అటవీ సంరక్షణ మెరుగుపడటంతో గడ్డితినే జంతువుల సంఖ్య బాగా పెరిగింది. తద్వారా పులులకు ఆహార సమస్య కలగడం లేదు. దీనికి తోడు వన్యప్రాణి వేటను అటవీ అధికారులు రేయింబవళ్లు కష్టపడి నియంత్రించడంతో పులుల సంరక్షణ సజావుగా సాగుతోంది. 


దేశంలో ప్రథమ స్థానంలో మధ్యప్రదేశ్‌

దేశంలోనే పెద్దపులుల సంరక్షణలో మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 2967 పెద్దపులుల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 526, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్‌లో 442, మహారాష్ట్రలో 312, తమిళనాడులో 264, కేరళలో 190, అస్సాంలో 190, ఉత్తరప్రదేశ్‌లో 173, రాజస్థాన్‌లో 69, ఆంధ్రప్రదేశ్‌లో 48, బీహార్‌లో 31, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 29, ఒడిస్సాలో 28, తెలంగాణలో 26, చత్తీస్‌ఘడ్‌లో 19, గోవాలో 3 ఉన్నట్లు అంచనా వేశారు. కాగా 1972 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పులుల అంచనాలను పరిశీలిస్తే.. 


సం. సంఖ్య 

1972 1827

1979 3015

1984 4005

1989 4334

1993 3750

1997 3508

2001-02 3642

2005 2000+

2008 1411

2010 1706

2014 2226

2018 2967 



Updated Date - 2021-07-29T06:19:02+05:30 IST