కర్తవ్యబద్ధతకు పెద్ద పీట వేసిన రాజ్యాంగం : మోదీ

ABN , First Publish Date - 2020-11-26T21:30:20+05:30 IST

భారత రాజ్యాంగంలో అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయని ప్రధాన మంత్రి

కర్తవ్యబద్ధతకు పెద్ద పీట వేసిన రాజ్యాంగం : మోదీ

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగంలో అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాల్లో ఒకటి కర్తవ్యాలకు ప్రాధాన్యమివ్వడమని తెలిపారు. హక్కులకు, విధులకు మధ్య సన్నిహిత సంబంధం ఉందని మహాత్మా గాంధీ చెప్పారన్నారు. మనం మన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే, హక్కులకు రక్షణ తనంతట తానుగానే లభిస్తుందని అభిప్రాయపడ్డారన్నారు. 


గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ ముగింపు సందర్భంగా మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. మన దేశ రాజ్యాంగం నుంచి మనకు గొప్ప బలం వచ్చిందని, అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. హక్కులకు, విధులకు మధ్య సన్నిహిత సంబంధం ఉందని మహాత్మా గాంధీ చెప్పారని, కర్తవ్యాలను నిర్వహిస్తే, హక్కులకు రక్షణ తనంతట తానుగానే లభిస్తుందని చెప్పారని అన్నారు. మన దేశ రాజ్యాంగంలో ఉన్న అనేక విశిష్ట లక్షణాల్లో ఒకటి కర్తవ్యాలకు ప్రాధాన్యమివ్వడమని వివరించారు. 


రాజ్యాంగ అధికారాల విభజనను ఉల్లంఘించే ప్రయత్నాలు 70వ దశకంలో జరిగాయని, అయితే దీనికి పరిష్కారం రాజ్యాంగం నుంచే లభించిందని అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేసిన తర్వాత నిరోధాలు, సమతుల్యతలు మరింత పటిష్టమైనట్లు తెలిపారు. 


ప్రస్తుతం మన దేశం ఉగ్రవాదంతో పోరాటంలో కొత్త విధానాలను అవలంబిస్తోందన్నారు. 26/11 ఉగ్రవాద దాడి వల్ల జరిగిన గాయాలను భారత దేశం ఎన్నటికీ మర్చిపోబోదని చెప్పారు. 2008 నవంబరు 26న పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో విదేశీయులు, పోలీసులు సహా అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 


Updated Date - 2020-11-26T21:30:20+05:30 IST