తెలుగింటి కోడలు

ABN , First Publish Date - 2022-08-08T05:40:02+05:30 IST

‘విజయమో వీర స్వర్గమో అంతుతేలాలి. శాంతి సమరంలో ఇది ఆఖరు ఘట్టం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులారా! భారతదేశాన్ని వదిలి వెళ్ళిపొండి’’ అంటూ 1942 క్విట్‌ ఇండియా కాలంలో ఒక వీరనారి సివంగివలె గర్జిస్తూ ఉండేది. దృఢమైన శరీరంతో, తేజోవంతమైన ముఖంతో...

తెలుగింటి కోడలు

మన ధీర

ఉప్పల మెల్లీ లక్ష్మణరావు

జననం: 03.03.1898

మరణం: 27.07.1965


‘‘విజయమో వీర స్వర్గమో అంతుతేలాలి. శాంతి సమరంలో ఇది ఆఖరు ఘట్టం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులారా! భారతదేశాన్ని వదిలి వెళ్ళిపొండి’’ అంటూ 1942 క్విట్‌ ఇండియా కాలంలో ఒక వీరనారి సివంగివలె గర్జిస్తూ ఉండేది. దృఢమైన శరీరంతో, తేజోవంతమైన ముఖంతో... ఖాదీ నిక్కరు, చొక్కా ధరించిన ఒక యూరోపియన్‌ వనిత ఈ నినాదాలు ఇవ్వడం విని... పొరుగువారు క్షణకాలం బిత్తరపోయి చూసేవారు. ఆమే మెల్లీ షోలింగరు. ఆంధ్రుల అభిమానం సంపూర్ణంగా పొందిన తెలుగింటి కోడలు... ఉప్పల మెల్లీ షోలింగర్‌ లక్ష్మణరావు.


మెల్లీ 1898 మార్చి 3న స్విట్జర్లాండ్‌ ముఖ్యపట్టణం జూరిచ్‌లో జన్మించారు. అడల్ఫ్‌, బెర్తా ఆమె తల్లితండ్రులు. మెల్లీ హోం సైన్సులో పట్టభద్రురాలై మెడికల్‌ కాలేజీలో చేరారు. రెండేళ్ళ చదువు పూర్తయింది. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఆమె తండ్రి ఆస్తంతా ధ్వంసమవడంతో చదువు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రికి వ్యాపారంలో సాయపడేవారు. వ్యాపార రీత్యా దక్షిణ జర్మనీలోని ట్యూబెన్‌గన్‌ నగరంలోని మిత్రులను కలుసుకోవడానికి మెల్లీ వెళ్ళిన సందర్భంలో... అక్కడ డాక్టరేట్‌ చదువుతున్న ఉప్పల లక్ష్మణరావును కలుసుకున్నారు. అప్పటికే ఆమె తన మాతృభాష అయిన జర్మన్‌లో హిందూ సింహళ దేశాల గురించి, బౌద్ధ మతం గురించీ, వేదాల గురించీ గ్రంథాలు చదివారు. భారతీయ సంస్కృతి పట్ల అభిమానం, సద్భావం కలిగాయి. ఈ నేపథ్యంలో లక్ష్మణరావు పట్ల అభిమానం స్నేహం ఏర్పడ్డాయి. 


మెల్లీకి సోషలిజం పట్ల, ప్రపంచ కార్మికోద్యమం పట్ల అంతకుపూర్వం నుంచే అభిమానం ఉండేది. తమ దేశంలోని మహిళల ఓటింగ్‌ హక్కు లాంటి సమస్యలతో పాటు వివిధ దేశాల్లోని కార్మిక సమస్యలపై తన గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. భారత దేశంలో బ్రిటిష్‌ వారి దమన నీతిని, హింసా కాండను ఏవగించుకుంటూ భారతదేశ స్వాతంత్ర్యోద్యమం పట్ల సహానుభూతి కనబరిచేవారు. మిత్రుడైన లక్ష్మణరావు ద్వారా మత, సాంఘిక, రాజకీయ విషయాలను సవిస్తరంగా తెలుసుకొనేవారు. పర్యవసానంగా భారత దేశాన్ని చూసితీరాలన్న కోరిక ఎక్కువయింది. అయితే అందుకు బ్రిటిష్‌ వారు రెండు సార్లు అనుమతి నిరాకరించారు. చివరకు ఆమె తండ్రి వ్యాపారం పేరిట అనుమతి పొందారు. 1929లో మన దేశానికి వచ్చారు. భారతీయుల స్వాతంత్ర్యోద్యమం సఫలం కావడానికి తోడ్పడాలని నిశ్చయించుకున్నారు. సామాన్య గ్రామీణ ప్రజల్లో జాగృతి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంలోనే రాజమండ్రిలో జాతీయోద్యమంతో సంబంధం ఉన్న పెద్ద కుటుంబాలవారితో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. వారిలాగే ఖాధీ ధరించడం ఆరంభించారు. జీవితాంతం దాన్ని పాటించారు. 


1929లో లాహోరు కాంగ్రెస్‌కు హాజరై... గాంధీ మహాత్ముణ్ణి, నెహ్రూ పండితుణ్ణి చూసి పరవశులయ్యారు. కాంగ్రెస్‌ ప్రతినిధులందరితోనూ రావీ నది ఒడ్డున సంపూర్ణ స్వరాజ్య సాధనం కోసం ఆమె కూడా దీక్ష తీసుకొని, దాన్ని శ్రద్ధగా పాటించారు. ప్రతి కాంగ్రెస్‌ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహంలో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. విదేశీ వస్తు, వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్‌ చేశారు. సబర్మతీ ఆశ్రమంలో ఒక ఏడాది గడిపి, పత్తి తీయడం, ఏకడం, ఏకులు చేయడం, నూలు వడకడం లాంటి పనులు నేర్చుకున్నారు. చుట్టూ అడవి ఉండడంతో ఆశ్రమంలోకి పాములు వచ్చేవి. వాటిని చంపకుండా పట్టి అడవిలోకి వదిలే నైపుణ్యాన్ని ఆమె సాహసంతో నేర్చుకున్నారు. మహిళలు కూడా రాత్రివేళ గస్తీ తిరగడానికి మహాత్ముణ్ణి ఒప్పించారు. సబర్మతీ ఆశ్రమంలోనే పొట్టి శ్రీరాములుతో ఆమెకు పరిచయం అయింది. ఆయన మరణించేవరకూ ఆయన ఆమెను కలుసుకొనేవారు.


సబర్మతీ ఆశ్రమం నుంచి శ్రీకాకుళం వచ్చి మూడేళ్ళు గడిపారు. ఖద్దరుకు ప్రసిద్ధి చెందిన పొందూరు, బొంతల కోడూరు లాంటి ప్రదేశాల్లో... పట్టు, జరీలతో కలిపి సన్నని ఖాదీ వస్త్రాలు తయారు చేసే విధానం అభ్యసించారు. నూలు నాణ్యతను, ధరను నిర్ణయించే నైపుణ్యం అలవరచుకున్నారు. మామూలు రాట్నం కన్నా సులువుగా తిరిగే రాట్నాన్ని దంతులూరు లక్ష్మీ నరసింహరాజు తయారు చేయగా, ఆ చరఖా గురించి ఆంధ్రదేశమంతటా మెల్లీ ప్రచారం చేశారు. ఈ సమయంలోనే వివిధ జాతీయ సంస్థలను సందర్శించి, కొన్నాళ్ళు గడిపారు. తండ్రి అనారోగ్యం కారణంగా 1934 చివర్లో ఆమె స్వదేశానికి వెళ్ళారు. 1937 ఆగస్టు 30న మాస్కోలో డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావుతో ఆమె వివాహం జరిగింది. భర్తతో భారతదేశానికి తిరిగి వచ్చి, విజయవాడలో స్థిరపడ్డారు. 1956 వరకూ ఇక్కడే ఉన్నారు. 


1940లో ‘వ్యక్తి సత్యాగ్రహం’లో మెల్లీ పాల్గొన్నారు. గాంధీజీ అనుమతితో విజయవాడలో సత్యాగ్రహం చేసి, అరెస్ట్‌ అయ్యారు. రాయవేలూరు జైలులో తొమ్మిది నెలలు శిక్ష అనుభవించారు. విడుదలైన కొన్ని రోజులకే మద్రాసులో సత్యాగ్రహం చేసి, అరెస్టై, దాదాపు ఏడాది శిక్షకు గురయ్యారు. అనంతరం 1942లో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం సందర్భంగా మరోసారి అరెస్టై, ఏడాదిన్నర కఠిన శిక్ష అనుభవించారు. 




(భారత స్వాతంత్య్ర పోరాటాన్ని చిత్రించిన ‘అతడు-ఆమె’ నవల, ‘బతుకు పుస్తకం’ ఆత్మకథ ద్వారా, సోవియట్‌ సాహిత్య అనువాదకుడిగా డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావు ప్రసిద్ధులు). 


భారత దేశం స్వతంత్రం పొందడాన్నీ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణనూ మెల్లీ చూశారు. అయితే, స్వతంత్ర భారతదేశంలో రామరాజ్య లక్షణాలు ఆమెకు కనిపించలేదు. సంఘోద్ధరణ చేయ తలపెట్టిన గాంధీ మహాత్ముడి దారుణ హత్యకు గురవడంతో... మునుముందు దేశం బాగుపడే అవకాశం ఆమెకు కనిపించలేదు. ఆమెలో అసంతృప్తి నెలకొంది. కమ్యూనిజం వైపు దృష్టి మళ్ళింది. 1957లో భర్తతో తూర్పు జర్మనీ వెళ్ళారు. అనంతరం 1959లో ఆ దంపతులు మాస్కో వెళ్ళి స్థిరపడ్డారు. 1965 జూలై 27న ఒక రోడ్డు ప్రమాదంలో మెల్లీ తనువు చాలించారు. ఆనాటికీ ఆమె ఖాధీ ధారణ మానలేదు. ఆమె పట్టుదల, సేవా నిరతి, త్యాగం కలకాలం నిలిచి ఉంటాయి. 

(‘స్వతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు’ సంకలనం నుంచి )



Updated Date - 2022-08-08T05:40:02+05:30 IST