మది నిండుగా పూల పండుగ

ABN , First Publish Date - 2022-09-26T08:20:58+05:30 IST

పూల పండుగొచ్చింది. బతుకమ్మ తిరిగొచ్చింది. ఊరూ.. వాడా.. పల్లె.. పట్నం అంతా ఒక్కటై మురిసింది.

మది నిండుగా పూల పండుగ

  • రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు
  • రాజ్‌భవన్‌ వేడుకల్లో పాల్గొన్న తమిళిసై
  • ప్రగతిభవన్‌లో బతుకమ్మ ఆడిన కవిత
  • 30 వేల మందితో కిక్కిరిసిన వేయిస్తంభాల గుడి ప్రాంగణం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పూల పండుగొచ్చింది. బతుకమ్మ తిరిగొచ్చింది. ఊరూ.. వాడా.. పల్లె.. పట్నం అంతా ఒక్కటై మురిసింది. అతివలంతా అందంగా అలంకరించుకొని.. అంత కంటే అందంగా బతుకమ్మలను పేర్చి.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ బతుకమ్మను ఆహ్వానించారు. గౌరమ్మకు పూజలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆదివారం ఉదయమే మహిళలు తంగేడు, గునుగు, జిల్లేడు, బంతి, చామంతి.. అనేక రకాల పువ్వులను సేకరించారు. బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చారు. సాయంత్రం ఆ బతుకమ్మలను కూడళ్లలో పెట్టి ఉత్సాహంగా ఆడారు. పాడారు. గతేడాది కరోనా కారణంగా వేడులకు దూరంగా ఉన్న మహిళలు ఈసారి రెట్టించిన ఉత్సాహంతో  వేడుకలను జరుపుకొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ప్రగతి భవన్‌లో సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత తన తల్లి శోభమ్మతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. బతుకమ్మలు ఆడే చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.  హనుమకొండలో బతుకమ్మ ప్రధాన వేడుకకు సుప్రసిద్ధ వేయిస్తంభాల గుడి వేదికగా నిలిచింది. 30వేల మందికిపైగా మహిళలతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలకు హనుమకొండ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ ఆడారు.  


ప్రధాని మోదీ శుభాకాంక్షలు

బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా తెలంగాణ నారీశక్తికి శుభాకాంక్షలు. ఈ పండుగ మనల్ని ప్రకృతితో మమేకం చేస్తుంది’ అని ఆదివారం ట్వీట్‌ చేశారు.  

Updated Date - 2022-09-26T08:20:58+05:30 IST