రాజ్యాంగ నిష్ఠ కోల్పోయిన మన రిపబ్లిక్

ABN , First Publish Date - 2022-01-25T06:33:39+05:30 IST

పెరుగుతున్న నిరుద్యోగం; అభివృద్ధి వెనుక నిర్వాసితులు; కట్టుదప్పిన నూతన ఆర్థిక విధానం; ప్రైవేట్ రంగంలో ప్రభవిస్తున్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోగల విధంగా శిక్షణ ఇవ్వని విద్యా విధానం...

రాజ్యాంగ నిష్ఠ కోల్పోయిన మన రిపబ్లిక్

పెరుగుతున్న నిరుద్యోగం; అభివృద్ధి వెనుక నిర్వాసితులు; కట్టుదప్పిన నూతన ఆర్థిక విధానం; ప్రైవేట్ రంగంలో ప్రభవిస్తున్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోగల విధంగా శిక్షణ ఇవ్వని విద్యా విధానం; కొవిడ్ మహమ్మారిని అదుపుచేయడంలో అసమర్థత; ఎన్నికలలో లబ్ధికి ఓటర్లను కులమతాల వారీగా చీల్చే కుతంత్రాలు; సామాజిక న్యాయసాధనకు ఉద్దేశించిన రిజర్వేషన్ల సక్రమ అమలుపై ఉపేక్ష; ఎన్నికల సంఘం మొదలైన స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడం... 7౩వ గణతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయ పౌరుడిని కలవరపెడుతున్న తిరోగామి పరిణామాలు ఇంకా ఎన్నో!


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు సమర్పిస్తూ చెప్పిన కొన్ని సత్యాలను ఈ సందర్భంగా మనం తప్పక గుర్తు చేసుకోవాలి: ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలుపరిచేవాళ్ళు చెడ్డవాళ్ళయితే అది కూడా చెడ్డదైపోవవడం ఖాయం; రాజ్యాంగం ఎంత చెడ్డదయినా దానిని అమలుపరిచేవాళ్ళు మంచివాళ్ళయితే అది మంచిదవడం కూడా అంతే ఖాయం’. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘రాజ్యాంగం పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపంపై మాత్రం ఆధారపడి ఉండదు. రాజ్యాంగం దేశానికి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలను మాత్రమే అందించగలదు. ఈ మూడు శాఖలు, ప్రజలపైన, వారు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీలపైన ఆధారపడి పనిచేస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజల కోరికలకు, వారి రాజకీయాలకు పనిముట్లుగా ఉంటాయి. భారత ప్రజలూ, వారి పార్టీలు అన్నీ సమూహాలు ఎలా నడచుకుంటాయో ఎవరు చెప్పగలరు?’ 


ప్రజాస్వామిక పాలనకు, జీవన విధానానికి విశ్వసనీయమైన మార్గదర్శి భారత రాజ్యాంగం. అయితే ప్రస్తుత దేశ పాలకులు రాజ్యాంగ మౌలికసూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భారత పౌరులు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని’ సమకూర్చాలని మన రాజ్యాంగ పీఠిక నిర్దేశించింది. మరి ఈ నిర్దేశాన్ని ‘సత్య నిష్ఠా పూర్వకంగా’ అనుసరిస్తున్నామా?


మూడు దశాబ్దాల క్రితం మన పాలకులు ఔదలదాల్చిన నూతన ఆర్థిక విధానం సమస్త ఉత్పత్తి కార్యకలాపాల ప్రైవేటీకరణకు ప్రాధాన్యమిచ్చింది. జాతికి సిరిసంపదలు సృష్టించిన ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఇలా ప్రారంభమై అలా ఊపందుకుంది. ఖాయిలా పడిన పరిశ్రమలను ప్రైవేటీకరించడం సమర్థనీయమే. లాభాలతో నడుస్తూ ఆర్థికాభివృద్ధి చోదకశక్తులుగా ఉన్న ప్రభుత్వరంగ పారిశ్రామిక సంస్థలను సైతం ప్రైవేట్ వ్యక్తులపరం చేయడమెందుకు? ప్రైవేటీకరణను విచక్షణారహితంగా అమలుచేయడంతో సామాజికంగా వెనుకబడిన వర్గాలవారు ఉద్యోగావకాశాలను కోల్పోయారు. ప్రభుత్వోద్యోగాలలో వాటా కల్పించడం ద్వారా రిజర్వేషన్ల విధానం వారి అభ్యున్నతికి భరోసా కల్పించింది. అయితే అడ్డు ఆపు లేని ప్రైవేటీకరణ అసలు రిజర్వేషన్ భావననే రూపుమాపింది. ఆర్థిక న్యాయభావనను సైతం అది అస్పష్టపరిచింది. సరళీకరణ విధానాలు సంపన్నులకే ఎనలేని ఆస్తులు కట్టబెట్టాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్నే తీసుకోండి. ఉక్కు కర్మాగారానికి ఆవశ్యకమైన క్యాప్టివ్ మైన్స్‌ను ఆ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించనేలేదు. కేటాయించకపోగా నష్టాలతో నడుస్తున్నదనే సాకుతో దాని ప్రైవేటీకరణకు పూనుకున్నారు. విశాఖ ఉక్కు ఏమవుతుందో గానీ ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంకు అయిపోయింది! ప్రజల మనోభావాలను లెక్కచేయకపోవడం, ప్రజా జీవన స్రవంతిలో స్థానికత ప్రాధాన్యాన్ని గౌరవించకపోవడం నియంతృత్వ పాలకుల రీతి రివాజు కాబోలు. స్వాతంత్ర్య జాగృతి కాలంలో తెలుగు పెద్దల్లో అగ్రగణ్యుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో నెలకొల్పిన సంస్థ ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రుల ఆర్థిక కార్యకలాపాలు చిరకాలంగా దానితో ముడివడి ఉన్నాయి. ఈ చరిత్ర గురించి ఎంతగా ఘోషించినా దేశ పాలకులు పట్టించుకోలేదు.


ఆలోచనా స్వాతంత్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కేంద్రంలోని ప్రభుత్వమూ, దాన్ని నడుపుతున్న రాజకీయ పక్షమూ అణచివేస్తున్నాయి. అదే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. అసమ్మతి స్వరాలను నొక్కివేస్తున్నారు. భిన్నాభిప్రాయాలను అనుమతించడం లేదు. విమర్శించేందుకు సాహసించిన వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. అధికారపక్ష పరివారం కొంత మంది ఉదారవాదులు, స్వేచ్ఛా చింతకులను నిర్మూలించింది. మరికొంత మంది జైళ్ళలో మగ్గుతున్నారు.


దేశ పౌరులు అందరూ తమ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా అనుసరించగలుగుతున్నారా? ఆరాధనా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నారా? అసహనం పెరిగిపోతోంది. అల్పసంఖ్యాక వర్గాలు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనులు అయిన వారిని అధికారంలో ఉన్న మితవాద పక్షం కార్యకర్తలు నానా వేధింపులకు గురిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో పరువు హత్యలు జరుగుతున్నాయి. సమానావకాశాలు, సమాన హోదా అత్యధికులకు గగన కుసుమాలు. అధికారంలో ఉన్న వారి దృష్టి ఎంతకూ ఓటు బ్యాంకులను కాపాడుకోవడంపైనే ఉంటోంది. బలహీన వర్గాల ప్రజలకు ప్రధాన స్రవంతి అభివృద్ధి కార్యకలాపాలలో భాగస్వామ్యం కల్పించకుండా వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు! అధికారంలో ఉన్న పార్టీల దయాదాక్షిణ్యాలపై సదా ఆధారపడి ఉండేలా చేయడమే సకల పాలకుల లక్ష్యంగా ఉంది. సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్నారా? వ్యక్తుల హుందాను గౌరవిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం దళితుల జీవితాలను చూడండి. దాడులు, దౌర్జన్యాలు వారి నిత్యానుభవాలు కావూ? దళితుల ఊచకోతలు యథేచ్ఛగా చోటుచేసుకుంటున్నాయి. సరైన విద్యావకాశాలు వారికి సుదూరం. గ్రామాలలో శ్రీమంతుల అభిజాత్యాలను ఇప్పటికీ వారు సహించివలసిందే. దళితుల జీవన భద్రతకు, జీవిత హుందాకు రాజ్యాంగబద్ధమైన రక్షణలకు కొదవలేదు. ఆచరణ విషయమేమిటి? ఎస్సీ ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989నే తీసుకోండి ఈ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు, విచారణ వాటి తార్కిక అంతానికి చేరవు గాక చేరవు. సంపద సృష్టికర్తలు, కాదూ, శ్రమ జీవులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు దేశ సమగ్రత, సమైక్యతలను ఎలా కాపాడతాయి?


మరి ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో మన భారత్ (189 దేశాలలో) 131వ స్థానంలో ఉండడంలో ఆశ్చర్యమేముంది? అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య భావననే మన పాలకులు నిస్సిగ్గుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే అంశాలపై చట్ట సభలలో స్వేచ్ఛాయుత చర్చకు అసలు ఆస్కారమివ్వడం లేదు. చర్చించి ఆమోదిస్తున్న బిల్లుల కంటే చర్చించకుండా ఆమోదిస్తున్న బిల్లులే అధికంగా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదేమో! నిరసన తెలిపే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఇదేమి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం? న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రిస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరించేలా న్యాయమూర్తులను పాలకులు ఒత్తిడి చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు అసాధారణంగా మీడియా ముందుకురావడం ఈ రాజ్యాంగ విరుద్ధ ధోరణులకు వ్యతిరేకంగానే కాదూ? న్యాయవ్యవస్థలో నిష్పాక్షికత కొరవడడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందా?


రూ.1000, రూ.500 కరెన్సీ నోట్ల రద్దు ఒక విధ్వంసక చర్యగా మిగిలింది. నల్లధనాన్ని వెలికి తీసేందుకే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. మరి ఆ లక్ష్యం ఏ మేరకు నెరవేరింది? ఆ చర్య మూలంగా కాయకష్టంపై బతికేవారు, అనియత రంగ కార్మికులు, బండ్లపై కూరగాయలు మొదలైన వాటిని ఇంటింటికి తీసుకువెళ్ళి అమ్ముకునేవారు, ఇతర వీధి వ్యాపారులు ఎంతగానో నష్టపోయారు. వారిలో అత్యధికులు ఇప్పటికీ కోలుకోలేక పోవడం ఒక కఠోర వాస్తవం. అనియత రంగం ఉనికిని, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అది చేస్తున్న విశేష దోహదాన్ని ప్రభుత్వం అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇదేమి ప్రజాపాలన? కొవిడ్ విలయంలో ఎక్కువగా విలవిలలాడిపోయింది కూడా అనియతరంగ కార్మికులే కాదూ? లాక్‌డౌన్ పర్యవసానాలను అంచనావేయడంలో విఫలమైన ప్రభుత్వం అశేష ప్రజలను అనేకానేక ప్రయాసల పాలు చేసింది. వలస కార్మికుల కష్టాలు ఆలపించిన ఆర్త గీతాలు పాలకులకు వినపడలేదా? అంతా బాగుందనే దృక్పథంతో వ్యవహరించలేదూ? వాక్సిన్ల విషయంలోనూ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందా? కొవిడ్ రెండో విజృంభణను ముందుగా పసిగట్టలేకపోయింది. కేంద్రం ఒక దశలో వాక్సిన్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేసింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆ బాధ్యతను మళ్ళీ చేపట్టింది. వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే జాతి ‘బతుకు నరం’ తెగిపోతున్నప్పుడు దేశ పాలకులు నిస్సహాయంగా ఉండిపోయారు. 


సమాజంలో సంకుచితత్వ విభజనలను సృష్టించేందుకు కేంద్రంలోని పాలకులు పలు విధానాలను రూపొందించి అమలుపరుస్తున్నారు. లౌకికవాదం గురించి కొత్త కథనాలను ప్రచారంలో పెడుతున్నారు. అధిక సంఖ్యాకుల మతానికి అగ్రప్రాధాన్యమిస్తున్నారు. అల్పసంఖ్యాకుల మత స్వేచ్ఛకు అవరోధాలు కల్పిస్తున్నారు. జాతి ధార్మిక జీవనం మున్నెన్నడూ లేని విధంగా సంకుచిత ధోరణులతో ప్రభావిత మవుతోంది. దేశ అధికారపక్షం వ్యక్తిపూజను ప్రోత్సహిస్తోంది. వ్యక్తి కేంద్రిత రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహసిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నారు. తిరగరాసిన చరిత్రనే బోధిస్తున్నారు అధిక సంఖ్యాకుల సంస్కృతికే ప్రాధాన్యమిస్తున్నారు. మన పురా నవ నాగరికతకు శోభనిచ్చిన వివిధ మతాలు, సామాజిక సముదాయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ధోరణి దేశానికి యశస్సు నిస్తుందా? సామాన్యునికి సాధికారత కల్పిస్తుందా?


అభివృద్ధి ప్రాజెక్టుల నెపంతో ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. నిర్వాసితులకు న్యాయబద్ధంగా నష్ట పరిహారాలు చెల్లించడంలేదు. వారికి పునరావాసం కల్పించడం లేదు. నిర్వాసితుల పట్ల ఈ నిర్లక్ష్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు గర్హించింది. వారికి న్యాయం జరిగేలా చూసేందుకు ప్రభుత్వాలకు అనేక నిర్దేశాలు జారీ చేసింది. పాలకులు వాటిని పాటిస్తేనా? న్యాయబద్ధమైన నష్టపరిహారం చెల్లింపు అనేది సకల నిర్వాసితులకు ఒక పగటి కలగానే మిగిలిపోయింది. న్యాయప్రక్రియ వ్యయభరితమైనది కావడంతో పేదలు న్యాయస్థానాలకు వెళ్ళలేక పోతున్నారు. సత్యం ఎలా జయిస్తుంది? న్యాయం ఎలా వర్ధిల్లుతుంది?


ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలు ఇలాగే కొనసాగితే దేశ పురోగతి స్తంభించిపోతుంది. ‘శ్రేష్ఠ భారత్’ సుదూర స్వప్నమే అవుతుంది. కమ్మిన చీకట్లను దేశ పౌరులు అందరూ నిశితంగా చూడాలి. వ్యథను చించే ఆలోచన చేయాలి. అంధకారం ఆవలి వెలుగులను చూడాలి. ఆ దిశగా ముందడుగు వేయాలి. ఎన్నికలలో వివేకవంతమైన తీర్పు ఇవ్వాలి. ఎన్నికలే మన ప్రజాస్వామ్యానికి ఆశాజ్యోతి. అది ఆరిపోకూడదు. దేదీప్యమానంగా ఉండాలంటే మన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించాలి. ధర్మా ధర్మ విచక్షణతో వేసే ఓటే మనకు వెలుగు బాటను నిర్మిస్తుంది.

డాక్టర్ ఆలూరి సుందర్ కుమార్ దాస్ 

విశ్రాంత ఐపీఎస్ అధికారి 

(రేపు రిపబ్లిక్ డే)

Updated Date - 2022-01-25T06:33:39+05:30 IST