మన బియ్యం ఒడిశాకు..

ABN , First Publish Date - 2021-11-29T04:30:33+05:30 IST

పేదల కోసం ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఒడిశా రాషా్ట్రనికి అక్రమంగా తరలుతున్నాయి. తూతూ మంత్రంగా అధికారులు దాడులు చేపట్టి వదిలేస్తున్నారు. సమాచారం ఉన్నా పట్టించు కోవడం లేదు. పైగా రవాణాదారులకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మన బియ్యం ఒడిశాకు..
పేదల బియ్యాన్ని పట్టుకున్న దృశ్యం (ఫైల్‌)

రేషన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనం

పార్వతీపురం, కురుపాం, సాలూరు కేంద్రాలుగా వ్యవహారం

(పార్వతీపురం)

పేదల కోసం ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఒడిశా రాషా్ట్రనికి అక్రమంగా తరలుతున్నాయి. తూతూ మంత్రంగా అధికారులు దాడులు చేపట్టి వదిలేస్తున్నారు. సమాచారం ఉన్నా పట్టించు కోవడం లేదు. పైగా రవాణాదారులకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా వందలాది క్వింటాళ్ల బియ్యం పక్క రాషా్ట్రనికి వెళ్తున్నాయి. దొరికితే దొంగ, లేకపోతే దొర అన్న చందంగా పరిస్థితి మారింది. జిల్లాలో కొంతమంది వ్యక్తులు అధికారులను ప్రసన్నం చేసుకుని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఒడిశా సరిహద్దు మండలాలు పార్వతీపురం, సాలూరు, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం సరిహద్దుల నుంచి ఒడిశాకు పేదల బియ్యాన్ని తరలిస్తున్నారు. లారీలతో రవాణా చేస్తూ రెండు చేతులా కాసులు సంపాదిస్తున్నారు. రేషన వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే బియ్యం అందిస్తున్నా అక్రమాలు ఆగడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రేషన బియ్యం కొనుగోలు చేసి అక్కడ నుంచి లారీలు, వ్యానుల్లో పార్వతీపురం, సాలూరు, కురుపాం తదితర మండలాలకు తరలించి అక్కడ నుంచి ఒడిశాకు చేరవేస్తున్నారు. 

పేదలకు ప్రభుత్వం అందించే బియ్యాన్ని కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున సేకరించి కొన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఆయా మిల్లుల్లో బియ్యం రీసైక్లింగ్‌ చేసి వేరే బస్తాల్లోకి మార్చి ఒడిశాకు గుట్టుగా తీసుకుపోతున్నారు. బియ్యం తరలింపులో ముందస్తు సమాచారం ఉంటే అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాని సివిల్‌ సప్లయ్‌ అధికారులు స్వచ్ఛందంగా తనిఖీలు నిర్వహించి అక్రమార్కులను పట్టుకుని కేసులు నమోదు చేసిన ఘటనలు అరుదు.

కొన్ని ఘటనలు

 ఈ నెల 22న సీతానగరం మండలం తామరఖండి వద్ద లక్ష్మీగణేష్‌ రైస్‌ మిల్లు నుంచి 100 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 గత నెల 22న ఒడిశా రాషా్ట్రనికి తరలించేందుకు సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సిద్ధంగా ఉన్న 25 కిలోలు చొప్పున 30 బస్తాలను పట్టుకున్నారు.

 గత నెల 29న ఒడిశాకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 12 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకుని అధికారులకు అప్పగించారు.

 కొద్దిరోజులుగా బొబ్బిలిలో 1.30 క్వింటాళ్లు, నెల్లిమర్ల 3.60 క్వింటాళ్లు, జియ్యమ్మవలసలో 19.50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని అధికారులు కేసులు నమోదు చేశారు. 

 సీతానగరం మండలంలో ఆర్టీసీ కార్గో సర్వీసు బస్సు ద్వారా అక్రమంగా తరలుతున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో వివిధ మండలాల్లో ప్రభుత్వ బియ్యం పక్కదారి పడుతున్న ఘటనలు కోకొల్లలు. నివారించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. 



Updated Date - 2021-11-29T04:30:33+05:30 IST