అందరిలా కాదు, మేము ప్రత్యేకం: మాయావతి

ABN , First Publish Date - 2022-03-04T02:57:21+05:30 IST

బీజేపీకి బీఎస్పీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఎస్పీ ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ కుట్రపన్నుతోందని, బీజేపీకి బీఎస్పీ బీ-టీం అని వస్తున్న వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండించారు. ఇది తమను నిత్యం వ్యతిరేకించే వారు చేస్తున్న ప్రచారమని, ముఖ్యంగా..

అందరిలా కాదు, మేము ప్రత్యేకం: మాయావతి

లఖ్‌నవూ: మిగిలిన పార్టీలలాగ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు బహుజన్ సమాజ్ పార్టీ చేయదని, తమకంటూ ప్రత్యేకమైన ప్రచార శైలి ఉందని ఆ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘మేం ఎవరినీ అనుకరించము. అందుకే రోడ్‌షోలు చేయము, ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించము. ప్రచారం ఎలా చేయాలో కాన్షీరాం మాకు నేర్పించారు. మా పార్టీ క్యాడర్‌తో మేము ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం. మాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రచార శైలి ఉంది. మిగతా పార్టీలే మమ్మల్ని కాపీ కొడతాయి’’ అని మాయావతి అన్నారు.


అయితే బీజేపీకి బీఎస్పీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఎస్పీ ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ కుట్రపన్నుతోందని, బీజేపీకి బీఎస్పీ బీ-టీం అని వస్తున్న వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండించారు. ఇది తమను నిత్యం వ్యతిరేకించే వారు చేస్తున్న ప్రచారమని, ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రచారం ఎక్కువగా చేస్తోందని విమర్శించారు. తమపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాము మాత్రం ఎవరినీ వ్యక్తిగతంగా ఏమీ అనబోమని స్పష్టం చేశారు. గతంలో బీజేపీతో బీఎస్పీ రెండుసార్లు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానిని సాకుగా చూపెడుతూ ఎస్పీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని మాయావతి అంటున్నారు.


ఇకపోతే, కొద్ది రోజుల క్రితం మాయావతి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బీఎస్పీకి కొన్ని వర్గాల ఓట్ బ్యాంక్ బలంగా ఉందని, ఇతర వర్గాల ఓట్లు సైతం ఆ పార్టీకి చేరే అవకాశం లేకపోలేదని, తాము బీఎస్పీని, మాయావతిని అంత తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను మాయావతి వద్ద ప్రస్తావించగా అది అమిత్ షా పెద్దమనసు అని సమాధానం ఇచ్చారు. దీంతో ఎస్పీ, ఇతర విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మరింత పదును ఎక్కాయి. ఈ ఎన్నికల్లో హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇస్తారని మాయావతిని ప్రశ్నించగా.. ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీలో అధికారం ఏర్పాటు చేసేది బీఎస్పీయేనని, కావాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక తనను కలిసి ఈ విషయం గురించి మాట్లాడొచ్చని మాయావతి అన్నారు.

Updated Date - 2022-03-04T02:57:21+05:30 IST