India-Russia Summit: మైత్రి మరింత బలోపేతమని ప్రకటన

ABN , First Publish Date - 2021-12-07T02:32:03+05:30 IST

మన రెండు దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఒకరికొకరం సహకారం అందించుకోవడం మాత్రమే కాదు, ఇరువురి సెంటిమెంట్లను పరస్పరం గౌరవించుకుంటూ ఉంటాం. గడిచిన దశాబ్దంలో ప్రపంచంలో అనేక మార్పులను చూశాం...

India-Russia Summit: మైత్రి మరింత బలోపేతమని ప్రకటన

న్యూఢిల్లీ: రష్యాతో ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలు భవిష్యత్‌లో మరింత బలోపేతం అవుతాయని ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అది నానాటికీ మరింత బలోపేతం అవుతోందని ఆయన అన్నారు. కొవిడ్-19 పాండమిక్ సమయంలో కూడా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగానే ఉన్నాయని, అఫ్ఘాన్ సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఇరు దేశాలు పరస్పర అందుబాటులోనే ఉన్నాయని మోదీ అన్నారు.


న్యూఢిల్లీలోని హైదరాబద్ భవన్‌లో ఇండియా-రష్యాల మధ్య 21వ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మోదీ మాట్లాడుతూ ‘‘మన రెండు దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఒకరికొకరం సహకారం అందించుకోవడం మాత్రమే కాదు, ఇరువురి సెంటిమెంట్లను పరస్పరం గౌరవించుకుంటూ ఉంటాం. గడిచిన దశాబ్దంలో ప్రపంచంలో అనేక మార్పులను చూశాం. భౌగోళికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేక అంశాల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ ఇండియా-రష్యా మధ్య స్నేహం ఆనాటి నుంచి పటిష్టంగానే ఉంది. ఈ రెండు దేశాల మద్య స్నేహం విశిష్టమైంది. నిజమైన స్నేహానికి ఇది వాస్తవిక రూపం’’ అని అన్నారు.


మేక్ ఇన్ ఇండియా కింద అభివృద్ధి, రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని మోదీ వెల్లడించారు. సైనిక-సాంకేతిక సహకారంపై ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా కౌంటర్ సెర్గీ షోయ్‌గుతో చర్చలు జరిపారు. అంతరిక్షం, అణు రంగాలలో సహకారంతో ఇండియా, రష్యాలు మరింత దగ్గరవుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-07T02:32:03+05:30 IST