‘మనవాళ్లే’.. అంగన్‌వాడీలు..!

ABN , First Publish Date - 2022-06-22T07:48:32+05:30 IST

ప్రజాప్రతినిధులు ‘తమ వాళ్లకే’ అంగన్‌వాడీ ఉద్యోగాలు వచ్చేలా ముందే జాబితా సిద్ధం చేశారన్న విమర్శలున్నాయి.

‘మనవాళ్లే’..  అంగన్‌వాడీలు..!
అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్న ఆర్డీవో రేణుక

ముందే ప్రజాప్రతినిధులు జాబితా సిద్ధం చేశారన్న ఆరోపణలు 

కొన్నిచోట్ల డబ్బులు డిమాండు చేశారంటూ విమర్శలు 


చిత్తూరు, జూన్‌ 21: సొంతూర్లోనే ఉద్యోగం. అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, మినీ, ఆయాలకు రూ.7వేల చొప్పున జీతాలు. దీంతో అంగన్‌వాడీ పోస్టులకు గిరాకీ పెరిగింది. మరోవైపు ప్రజాప్రతినిధులు ‘తమ వాళ్లకే’ ఈ ఉద్యోగాలు వచ్చేలా ముందే జాబితా సిద్ధం చేశారన్న విమర్శలున్నాయి. మనవాళ్లయినా.. ‘ఎంత ఇచ్చుకుంటారు’ అని కొందరు నగదు డిమాండు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 170 అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి గతనెల 21వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 19 అంగన్‌వాడీ పోస్టులకు 153 మంది,  24 మినీ అంగన్‌వాడీ పోస్టులకు 72 మంది,  72 ఆయా పోస్టులకు 153 మంది చొప్పున 515 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీల వివరాలను ఆయా సీడీపీవోల పరిధిలోని కేంద్రాలవారీగా రిజర్వేషన్‌, రోస్టర్ల వారీగా అందుబాటులో ఉంచారు. స్థానికులై ఉండి వివాహితులుగా ఉండాలని, పదోతరగతి పాసై ఉండాలని నిబంధనలు విధించారు. చిత్తూరులోని ఆర్డీవో కార్యాలయంలో చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పారదర్శకంగా ఇంటర్య్యూ నిర్వహించి, ఎంపికలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే, అంగన్‌వాడీ పోస్టుల నియామకంలోనూ అధికార పార్టీ నేతలు.. ఆ పార్టీ సానుభూతిపరులకే ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ‘నగదు’ డిమాండు చేశారని.. కొందరైతే వసూళ్లే చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చోట కూడా అధికారపార్టీకి చెందిన వారే ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. అంగన్‌వాడీ పోస్టులున్న ప్రదేశం ప్రాధాన్యాన్ని.. పోటీపడేవారి సంఖ్యను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిమాండు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఇంటర్వ్యూలకు 98 మంది హాజరు

ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆర్డీవో రేణుక, ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించి, సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 108 పోస్టులకు గాను 98 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్లు ఆర్డీవో తెలిపారు. చిత్తూరు ప్రాజెక్టు పరిధిలో 29 పోస్టులు, బంగారుపాళ్యం పరిధిలో 18, పులిచర్లలో 2, చిన్నగొట్టిగల్లులో 10, జీడీనెల్లూరులో 39 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. త్వరలో ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రచురిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-22T07:48:32+05:30 IST