మన టూరిస్ట్ ప్రధానమంత్రి: మోదీపై ప్రియాంక సెటైర్లు

ABN , First Publish Date - 2021-12-12T21:22:50+05:30 IST

ఈ ధరలు ఎందుకు పెరిగాయని మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది మన బాధ్యత. ప్రభుత్వం మీ సంక్షేమంపై మీ అభివృద్ధిపై ఎంతో బాధ్యతతో ఉండాలి. ఇది కేవలం నా పోరాటం, నా సోదరుడు రాహుల్ పోరాటం కాదు. ఇది మనందరి పోరాటం. ఇది దేశం పోరాటం..

మన టూరిస్ట్ ప్రధానమంత్రి: మోదీపై ప్రియాంక సెటైర్లు

జైపూర్: ప్రపంచమంతా తిరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రైతులను కలిసేందుకు పది కిలోమీటర్ల దూరం కూడా రాలేరని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీని ‘మన టూరిస్ట్ ప్రధానమంత్రి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘మెహెంగాయి హటావో’ (ధరలను ఎత్తేయండి) అనే ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.


‘‘ఉత్తరప్రదేశ్‌లో కోట్ల రూపాయలను ప్రకటనలకు ఖర్చు చేస్తున్నారు. కానీ, రైతుల సంక్షేమం కోసం రూపాయి ఇవ్వడం లేదు. ప్రభుత్వం కొద్దిమంది వ్యాపారవేత్తల కోసం మాత్రమే పని చేస్తోంది. ఆ కొద్ది మంది వ్యాపారస్తులకే దశాబ్దాలపాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవి అమ్మేస్తోంది. దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీరే చెప్పండి. ఈ ఏడేళ్లలో ఏమైనా చేశారా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు.


ఇక పెరిగిన ధరల గురించి మాట్లాడుతూ ‘‘పెరిగిన ద్రవ్యోల్బణం మిమ్మల్ని (ప్రజలను) ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో నేను అర్థం చేసుకోగలను. మీరు ఈ ఒక్క రోజు ఈ మీటింగ్‌కు రావడం వల్ల మీ రేపటి రోజు ఎంత ఇబ్బందుల్లో ఉంటుంటో ఊహించగలను. కానీ, ఈ ధరలు ఎందుకు పెరిగాయని మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది మన బాధ్యత. ప్రభుత్వం మీ సంక్షేమంపై మీ అభివృద్ధిపై ఎంతో బాధ్యతతో ఉండాలి. ఇది కేవలం నా పోరాటం, నా సోదరుడు రాహుల్ పోరాటం కాదు. ఇది మనందరి పోరాటం. ఇది దేశం పోరాటం’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Updated Date - 2021-12-12T21:22:50+05:30 IST