సగమైనా ఇవ్వండి!

ABN , First Publish Date - 2020-07-14T18:21:00+05:30 IST

కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో..

సగమైనా ఇవ్వండి!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆకలి కేకలు

మార్చి వరకే అందిన జీతాలు

సాంఘిక సంక్షేమ శాఖలో దుస్థితి

రాష్ట్రమంతా ఇంతే : డీడీ


నెల్లూరు: కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కోట్లాది మంది సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సగం జీతమే వస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ సగం జీతం కూడా లేక సాంఘిక సంక్షేమ శాఖలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. మార్చి నెల వరకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు నడిచాయి. అప్పటి వరకు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత వాటిని విడుదల చేయకపోవడంతో 147 కుటుంబాలు ఆకలి కష్టాలను కన్నీళ్లతో దిగమింగుకుంటున్నారు. వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ శాఖల్లోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేనెల వరకు 10 శాతం కోతతో వేతనాలు చెల్లించారు. కానీ సాంఘిక సంక్షేమ శాఖలో మాత్రమే ఇలాంటి దుస్థితి నెలకొంది. ఏప్రిల్‌ 23 వరకు మాత్రమే జీతాల బిల్లులు ట్రెజరీకి పంపించారని ఆ తర్వాత నెలలకు సంబంధించిన వేతనాలు అందే పరిస్థితి లేదని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. గతేడాది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను బెస్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఏజన్సీ నిర్వాహకులు స్వాహా చేయడంతో కొన్ని నెలలపాటు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


దీనిపై ఆంధ్రజ్యోతి పలు కథనాలు ప్రచురించడంతో అధికారులు వేరే ఏజన్సీ ద్వారా జీతాలు ఇప్పించారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలోనూ మళ్లీ జీతాల కోసం ఉద్యోగులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం సగం జీతమైనా ఇచ్చి ఆదుకోవాలని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వారం క్రితం సాంఘిక సంక్షేమ శాఖ డీడీని వేడుకోవడం వారి దీనస్థితికి నిదర్శనం.


రాష్ట్ర వ్యాప్తంగా వేతనాల్లేవు: డీడీ జీవపుత్రకుమార్

సాంఘిక సంక్షేమ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు మన జిల్లాలోనే కాదు , రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఇవ్వలేదు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము. ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించమంటే పంపిస్తాము. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 23 వరకు జీతాలు ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా ఇస్తున్నాము. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఎక్కడా కోవిడ్‌-19 విధులను కేటాయించలేదు.


సగం జీతమైనా ఇవ్వండి: సురేష్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

కరోనా ప్రభావంతో ఏప్రిల్‌ నెల నుంచి జీతాలు అందలేదు. మిగిలిన సంక్షేమ శాఖల్లో వేతనాలు ఇస్తున్నారు. హాస్టళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. వీటినే నమ్ముకుని జీవిస్తున్నాము. సగం జీతమైనా ఇచ్చి ఆదుకోవాలి.


Updated Date - 2020-07-14T18:21:00+05:30 IST