అందని పీఆర్సీ ఫలితం

ABN , First Publish Date - 2022-06-27T17:50:18+05:30 IST

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో రెగ్యులర్‌ ఉద్యోగులు సగానికి సగం పడిపోయారు. కొన్నేళ్లుగా రెగ్యులర్‌ నియామకాలు లేవు. దీంతో అవసరానికి అనుగుణంగా

అందని పీఆర్సీ ఫలితం

 పైసలిచ్చినా పెరగని వైనం

 ఏడాది కింద పీఆర్సీ అమలు

 జీవో 14 ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికీ వర్తింపు


 హెచ్‌ఎండీఏలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాల పెంపు అందని ద్రాక్షగానే మారింది. డబ్బులు ఇచ్చినా వారి వేతనాల పెంపు ఫైల్‌ ముందుకు కదలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏడాది క్రితమే రెగ్యులర్‌ ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి రాగా, తమ వేతనాలు ఇప్పటికీ పెరగకపోవడంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో రెగ్యులర్‌ ఉద్యోగులు సగానికి సగం పడిపోయారు. కొన్నేళ్లుగా రెగ్యులర్‌ నియామకాలు లేవు. దీంతో అవసరానికి అనుగుణంగా హెచ్‌ఎండీఏలోని అన్ని విభాగాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమిస్తూ వచ్చారు. దీంతో రెగ్యులర్‌ ఉద్యోగుల కంటే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు.  ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు అన్ని బాధ్యతలు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే నిర్వర్తిస్తున్నారు. మొత్తంగా సంస్థలో సుమారు 200ల నుంచి 250ల మంది వరకు ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది అరకొర జీతాలకే పని చేస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.15వేలు, అటెండర్‌, డ్రైవర్లకు రూ.12వేలు, హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ సిబ్బందికి రూ.7వేల నుంచి రూ.9వేల వరకు మాత్రమే వేతనాలు వస్తున్నాయి. రిటైర్డ్‌ అధికారులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించడంతో వారి వేతనాలు రూ.22వేల నుంచి రూ.40వేల వరకు ఉన్నాయి. 

అందని పీఆర్సీ ఫలితం 

పీఆర్సీ అమలుతో రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు గతేడాది జూలైలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలకు 30శాతం పెంచుతూ జీఓ నెంబర్‌ 14ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు గతేడాది ఆగస్టు నెల నుంచే హెచ్‌ఎండీఏలోని రెగ్యులర్‌ ఉద్యోగులు పొందుతున్నారు. హెచ్‌ఎండీఏ ప్రత్యేక ఆథారిటీ కావడంతో పీఆర్‌సీ అమల్లోకి వచ్చినా  ఈ శాఖలోని రెగ్యులర్‌ ఉద్యోగుల వేతనాలు పెరగాలంటే సంబంధిత శాఖ మంత్రి, ఫైనాన్స్‌ విభాగం నుంచి అనుమతి అవసరం. కానీ, అదేమీ లేకుండానే వేతనాలు పెంచేందుకు స్పెషల్‌ సీఎస్‌ మెమో తీసుకొచ్చారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే హెచ్‌ఎండీఏ ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. జీఓ నెంబర్‌ 14 ప్రకారం హెచ్‌ఎండీఏ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెరగడానికి ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగం నుంచి ఫైల్‌ పెట్టాల్సి ఉండగా కొన్నాళ్ల పాటు నాన్చారు. చివరకు ఫైల్‌ కదిలినా రాష్ట్ర ఫైనాన్స్‌ విభాగం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.  


అయిననూ.. పెరగలే!

 ఫైనాన్స్‌ విభాగంలో నిలిచిన ఫైల్‌ కదలాలంటే ఆ విభాగంలోని కొందరికి ముడుపులు చెల్లించాలని హెచ్‌ఎండీఏలోని ఓ అధికారి చెప్పినట్లు సమాచారం. దీంతో  కిందిస్థాయి ఉద్యోగి ఒకరు వసూళ్లపర్వం చేపట్టినట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏలోని సుమారు 250ల వరకు గల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల నుంచి 10శాతం నుంచి 30శాతం వరకు ఇందుకు కేటాయించాలని నిర్ణయించి, సుమారు రూ.8లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం డబ్బులు ముట్టజెప్పినా ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడంపై ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జీవో14 ప్రకారం హెచ్‌ఎండీఏలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్సీ ఫలాలు అందేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - 2022-06-27T17:50:18+05:30 IST