బెజోస్ భూమిపై వద్దంటూ.. సంతకాలు చేసిన 30వేల మంది!

Jun 22 2021 @ 09:11AM

తన సోదరుడితో కలిసి అంతరిక్షంలోకి వెళ్తున్నట్లు ఇటీవలే అమెజాన్ అధినేత, బిలియనీర్ జెఫ్ బెజోస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ‘బ్లూ ఆరిజిన్’ అనే కంపెనీని కూడా ఎప్పుడో స్థాపించారు. ఇది ఒక స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ సంస్థ. ఇది తయారు చేసిన ‘న్యూ షెపర్డ్’ అనే రాకెట్‌లో తాను, తన సోదరుడు మార్క్ బెజోస్ కలిసి అంతరిక్షంలోకి వెళ్లబోతున్నట్లు తాజాగా జెఫ్ బెజోస్ ప్రకటించారు. అంతే సోషల్ మీడియాలో నెటిజన్లు జోరందుకున్నారు. ఈ క్రమంలోనే Change.org అనే వెబ్‌సైటులో బెజోస్‌ను మళ్లీ భూమిపైకి రానివ్వద్దంటూ ఒక పిటిషన్ నమోదైంది. దీనిపై ఇప్పటికే 30వేలమందికిపైగా సంతకాలు చేయడం గమనార్హం. దీన్ని నిక్ జి. అనే ఒక యూజర్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.


ఈ పిటిషన్‌లో ‘బిలియనీర్లు భూమిపై ఉండకూడదు. అంతరిక్షంలోనూ ఉండకూడదు. వాళ్లు గనుక అంతరిక్షాన్ని ఎంచుకుంటే అక్కడే ఉండాలి’ అని నిక్ పేర్కొన్నాడు. ఇలానే మరో పిటిషన్ కూడా బెజోస్‌ను భూమిపై కాలుపెట్టనివ్వద్దని చెప్తోంది. దీనిపై కూడా 38,892 మంది సంతకాలు చేశారు. దీని లక్ష్యం 50వేల సంతకాలని, ఈ టార్గెట్‌ను కచ్చితంగా రీచ్ అవుతామని పిటిషన్ వేసిన వాళ్లు చెప్తున్నారు. ఈ క్రమంలో బెజోస్‌ను ప్రఖ్యాత కామిక్ ‘సూపర్ మ్యాన్’లో విలన్ అయిన ‘లెక్స్ లూథర్’ పాత్రతో పోలుస్తూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...