ఇంతకుముందెన్నడూ లేని విధంగా.. గతేడాది Bahrain లో భారీ సంఖ్యలో భారత ప్రవాసులు మృతి!

ABN , First Publish Date - 2022-01-22T16:08:03+05:30 IST

గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో గతేడాది దాదాపు 500 మందికి పైగా భారతీయ ప్రవాసులు మృతిచెందారు.

ఇంతకుముందెన్నడూ లేని విధంగా.. గతేడాది Bahrain లో భారీ సంఖ్యలో భారత ప్రవాసులు మృతి!

మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో గతేడాది దాదాపు 500 మందికి పైగా భారతీయ ప్రవాసులు మృతిచెందారు. వీరందరూ కరోనా నేపథ్యంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్టు తెలుస్తోంది. కాగా, వలసదారులు అధికంగా ఉండే బహ్రెయిన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మరణించింది మాత్రం భారతీయులేనని సమాచారం. బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కరోనా ఉధ్ధృతి సమయంలో పరిస్థితులను హ్యాండిల్ చేయడం ఎంబసీకి తలకుమించిన భారంగా మారిందన్నారు. అయితే, విపత్కర పరిస్థితుల్లో బహ్రెయిన్ అధికారుల సహకారం అద్భుతమని కొనియాడారు. వారి సహకారంతోనే భారత ప్రవాసులకు సమయానికి సాయం అందిందని పేర్కొన్నారు. మరణాంతర వ్యవహారాల విషయమై పెద్దగా సమస్యలు లేకుండా వాటిని పూర్తి చేయగలిగామంటే అది బహ్రెయిన్ అథారిటీస్ సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. 


ఇక బహ్రెయిన్‌లో భారత ప్రవాసులు చనిపోతే మృతదేహాలను అక్కడి నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు తరలించడం చాలా తక్కువ సమయంలో జరిగిపోయేదని గుర్తు చేశారు. బహుషా గల్ఫ్ దేశాలన్నింటీలో కంటే బహ్రెయిన్‌లోనే విధి విధానాలు చాలా పకడ్బందిగా ఉంటాయని, అందుకే ప్రాసెస్‌లో ఎక్కడా అంతరాయం ఉండేది కాదని తెలిపారు. అందుకే కరోనా విపత్కర సమయంలోనూ భారత ప్రవాసులకు ఎంబసీ సేవలు చాలా సులువుగా, సమయానికి అందాయని చెప్పుకొచ్చారు. అలాగే గత 32 ఏళ్ల నుంచి బహ్రెయిన్‌లోని భారత ప్రవాస సంఘానికి సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్త, కేరళ ప్రవాసీ కమిషన్ మెంబర్ సుబైర్ కన్నూర్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రవాస భారతీయుల మరణాలను చూడలేదన్నారు. 2021లో సుమారు 510 మంది వరకు భారత ప్రవాసులు మృతిచెందినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మంది మహమ్మారి వల్లే చనిపోయారని సుబైర్ తెలిపారు. ఇక మరణించిన వారిలో సగానికి పైగా అంత్యక్రియలు కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి బహ్రెయిన్‌లోనే జరిగాయన్నారు.  


కాగా, బహ్రెయిన్‌లో వలసదారుల మృతదేహాల తరలింపునకు సంబంధించి విధి విధానాలు చాలా స్పష్టం ఉంటాయి. మృతి చెందిన వెంటనే మొదట స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్య, అంతర్గత మంత్రిశాఖలతో పాటు రాయబార కార్యాలయం సహకారం కోసం స్పాన్సరింగ్ కంపెనీ లేఖ తప్పనిసరి. ఆ లేఖను సీఐడీ విభాగానికి ఇవ్వాలి. అప్పుడు డెత్ సర్టిఫికేట్ వస్తుంది. అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు ఎంబసీ వద్ద రిజిస్టర్ చేయడం ద్వారా ఎన్ఓసీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి ఫైనల్ క్లియరెన్స్ కోసం మార్చురీ నుంచి లేఖ సంపాదించాలి. అప్పుడు మృతదేహాన్ని అక్కడి నుంచి భారత్‌కు తరలించేందుకు వీలు కలుగుతుంది. ఒకవేళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి వీలుకాకపోతే సల్మాబాద్ సిమిటరీ, అల్బా క్రిమేషన్ సెంటర్, బుసైతీన్ కనూ మస్జీద్‌లలో ఏదో ఒక చోట అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.    

Updated Date - 2022-01-22T16:08:03+05:30 IST