కోల్‌కతాలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న కరోనా.. కొవిడ్ బారిన 80 మంది పోలీసులు

ABN , First Publish Date - 2022-01-05T01:43:28+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోల్‌కతాలో 83 మంది పోలీసులు కొవిడ్ బారినపడ్డారు

కోల్‌కతాలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న కరోనా.. కొవిడ్ బారిన 80 మంది పోలీసులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోల్‌కతాలో 83 మంది పోలీసులు కొవిడ్ బారినపడ్డారు. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. కరోనా బారినపడిన 83 మందిలో 47 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా, 16మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.


మరోవైపు, నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన కోల్‌కతా మెడికల్ కాలేజ్‌కు చెందిన వైద్యులు, సిబ్బంది 100 మందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. అలాగే, ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజ్‌తోపాటు సిలిగురిలోని ఓ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు సహా 25 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.  


కాగా, సోమవారం కలకత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన 70 మంది వైద్యులు, కాళీఘాట్‌లోని చిత్తరంజన్ సేవా సదన్‌, శిశు సదన్ ఆసుపత్రికి చెందిన 24 మంది, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్తమాలజీకి చెందిన 12 మందికి కరోనా  సోకినట్టు నిర్ధారణ అయింది. వారందరినీ సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. గత నెల 28న పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో 2.35గా ఉన్న పాజిటివిటీ రేటు డిసెంబరు 28న ఒక్కసారిగా 19.59 శాతానికి ఎగబాకింది.  


రాష్ట్రంలో కేసులు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించింది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను మూసివేసింది. వాహనాల కదలికలు, సామూహిక సమావేశాలను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధించింది. అలాగే,  స్విమ్మింగ్ పూల్స్, స్పాలు, జిమ్‌లు, సెలూన్లను మూసివేసిన ప్రభుత్వం.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. 

Updated Date - 2022-01-05T01:43:28+05:30 IST