మన తల్లుల గాథలే ఈ దేశ చరిత్రలు

ABN , First Publish Date - 2021-01-23T06:26:56+05:30 IST

అన్యాయంపై సివంగిలా ఎదిరించిన కారంచేడు అలిసమ్మలు మా అమ్మలు. ఐలవ్వలు, మల్లవ్వలు, అచ్చమ్మలు ఓడి గెలిచిన జీవితా లను చరిత్ర...

మన తల్లుల గాథలే ఈ దేశ చరిత్రలు

అన్యాయంపై సివంగిలా ఎదిరించిన కారంచేడు అలిసమ్మలు మా అమ్మలు. ఐలవ్వలు, మల్లవ్వలు, అచ్చమ్మలు ఓడి గెలిచిన జీవితా లను చరిత్ర కెక్కించాలి.


శ్రామిక వర్గం తల్లుల, గురించి, మాక్సీంగోర్కీ అమ్మల గురించి ఎవ్వరు రాయాలి? వాళ్ళ బిడ్డలుగా మనమే రాయాలి. వాళ్లు మంచికి, మానవత్వానికి అన్నం పెట్టారు. వారి త్యాగాల చరిత్ర తలకెత్తుకోవాలి.


అటువంటి అమ్మలలో ఒకనొక త్యాగమూర్తి బొగిల్ల అచ్చమ్మ. పాటలు పాడే జయరాజుకు అమ్మ. మానుకోట దగ్గర బయ్యారం ఆ అవ్వది. తెల్సుకోవాల్సిన సందర్భం ఇది. ఏదో ఒక పోరాటం ఎంతో కొంతకాలం కొందరు చెయ్యవచ్చు. కాని సుదీర్ఘ పోరాటం ఎల్లకాలం చేయడం చాల కష్టం. జీవితమంతా చెమట తీయడం బతుకుపెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడడం అతికష్టం. ఆమె నెత్తికి చమురు ఎరగలేదు. ముగ్గుబుట్టలాంటి తల కష్టం తప్ప ఏనాడు సుఖమెరుగని అచ్చవ్వ జనవరి 13న బోగి పండుగ నాడే మరణించింది. ఆ అవ్వకు పిల్లలు లేరు. కాని తన సొంత చెల్లెలయిన చెన్నమ్మ కొడుకు జయరాజును తన కన్న కొడుకుగా పెంచింది. చేపలు పట్టడం, చేపలు అమ్మడం, నాటు పని, కూలి పని చేస్తూ ఇంటిని నడిపింది. ఏటి బలుపాలు తెచ్చి, చెక్కపలక మీద బొగ్గుఆకు పసరు కలిపి తనే రుద్ది ఆరిన తర్వాత అక్షరాలు నేర్పింది. మానుకోట దొరల దుర్మార్గాలను విప్పి చెప్పింది. అక్కడి మనుషులకే కాదు, అక్కడి కంకరరాళ్ళు పోరాట ఆయుధాలు, వీరులను కాపాడిన చెట్టు పుట్ట గుట్టలకు కూడా చరిత్ర ఉంది. అట్టి చరిత్ర ఉద్యమ పాఠాలు (పాటలు) కూడా నేర్పింది అవ్వ.


డేగ భయానికి పిల్లలను కోడి తన రెక్కల కింద దాచినట్లు, జయరాజును ఇద్దరు తల్లులు కాపాడుకున్నారు. దోపిడికి వ్యతిరేకంగా ప్రశ్నించే ధైర్యాన్ని ఇచ్చారు. మాటలను మాలకట్టి పాట పాడే వొడుపు నేర్పారు. దొరోడి సవాల్‌కు జవాబులు నేర్పారు. ఆగడాలు ఆగట్లేదని అడివిలోకి ‘అన్న’గా పంపారు. కానీ... ఏరోజు ఏవార్త వినవలసి వస్తుందోనన్న కలత నిద్దుర లేని రాత్రులెన్నో... కంటి మీద కునుకు పట్టిన వెంటనే ఒళ్ళంతా భయం, తామరాకులా... వణుకు, అంతలో ఎవ్వరో ఒకరు వచ్చి జయరాజన్న పాటల పెట్టెను తెచ్చి చాటుగా వినిపించేసరికి కాసింత సంబరం, బతికే ఉన్నాడనే భరోసా... ఏడన్నా నాబిడ్డ కనిపిస్తాడని! తునికాకు ఏరడానికి అడవికి వెళ్లేది. కొడుకు కనపడలేదు. కాని అడవంతా తిరిగిన అవస్థలే... గుర్తుకొస్తున్నాయి. ఊళ్ళల్లో రాత్రిపూట వేసిన పోస్టర్లు చూసి అవ్వ లారీలల్ల తన కూలీ ముఠాలతో కల్సి చేతిలో ఎర్రజెండ, సంకన సద్దిమూట పట్టుకొని ఆశగా సభ దగ్గరికి వచ్చేది. కొడుకుల పాటలు, ఆటలు చూసి కన్నీళ్ళను తుడుచుకొంటూ భయంతోనే నిత్యం బతికింది అవ్వ. కోడుకా పైలం అంటూ జగర్తా రా అంటూ బువ్వ తిన్నవా అంటూ ముద్ద తినిపించి బువ్వ ముద్దనే మరచిన అచ్చవ్వ. కష్టజీవుల రాజ్యం కోసం కూలీ పోరాటాలు జీతగాల్ల పోరాటాలు, తునికాకు పోరాటాల్లో పాల్గొంది. జయరాజును అరెస్టు చేసి సంకేళ్లు వేసి వీధుల్లో తిప్పినా సంకల్పం వదలలేదు కదమ్మా! ఇనుప కడ్డిల నడుమ లాఠీలతో చితకబాదినా ఇంచుకూడా ఎర్రజెండను దించలేదు కదమ్మా! శిఖరమంత ఎత్తు నీ త్యాగం సంద్రమంత లోతు నీ ఆదర్శం పట్టుచీర ఎరుగదు పరుపులంటే తెలవవు, తాకట్టులో పుస్తెలు, చిరిగిన బట్టలు, చెదిరిన బతుకులు అతుకుల బొంతలు మా కాపురాలు.


ఇదే మా అమ్మలు వేసిన పునాది రాళ్లు. కొందరికి ఏడుతరాల ఆస్తులిస్తే.. మమ్ముల్ని ఏలు పట్టుకుని ఉద్యమకారులుగా తీర్చిదిద్దిన ఘనత అవ్వది. ఆ పునాదుల నుంచి వచ్చినవే జయరాజు ఉద్యమ పాటలు, ప్రకృతి గీతాలు. మా ఉద్యమాల కన్నతల్లులు, వాళ్ల జ్ఞాపకాలు ఒక ‘‘విప్లవం’’ తెలంగాణ పాట ‘‘సంప్రదాయం’’ బిడ్డల కండగా అన్యాయంపై సివంగిలా ఎదిరించిన కారంచేడు అలిసమ్మలు మా అమ్మలు. ఐలవ్వలు, మల్లవ్వలు, అచ్చమ్మలు ఓడి గెలిచిన జీవితా లను చరిత్ర కెక్కించాలి. బతుకు పోరాటంలో గాలికి పోవాల్సిన అచ్చవ్వలు పోరాడి గెలిచిన తీరు ‘‘పాఠం’’ కావాలి. వాళ్లు వందలాది ‘‘పోరాటాల్లో గెలిచి నిలిచారు.’’ ఆ తల్లుల జ్ఞాపకాలు మనల్ని వెంటాడాలి. కష్టాలువాళ్లని వెంటాడినప్పుడు చిరునవ్వుతో ఎదిరించి నిలిచిన తీరు గుర్తుంచుకోవాలి. ఉద్యమ వీరులగన్న వీరమాతల గర్భసంచికి దండాలు పెట్టాలి. ఉద్యమ పురుటి గడ్డకు అంటిన రక్తం మరకల వెలుగులు రేపటి చరిత్రకు కాగడాలు కావాలి. పోరాడి గెలిచిన మన తల్లుల చరిత్ర చదివి దోపిడి వర్గాలు బిత్తరపోవాలి. ప్రతి పోరాట వీరుని తల్లి చరిత్ర సామూహికంగా మళ్లీ మళ్లీ మనం పాడుకోవాలి. మన చరిత్ర కన్నా! మనని కన్న తల్లుల చరిత్ర వాళ్ళ బిడ్డలుగా మనమే రాయాలి. వేలాది అమ్మల చరిత్రగాథలు ఉద్యమాల గనిలోంచి మారుమోగాలి. ‘‘మన తల్లుల చరిత్రలే.. ఈ దేశ చరిత్రలు’’గా వెలుగొందాలి.


భూపతి వెంకటేశ్వర్లు

(రేపు మానుకోటలో అచ్చవ్వ సంస్మరణ సభ)

Updated Date - 2021-01-23T06:26:56+05:30 IST