అధిక మోతాదు.. పంటకు చేటు!

ABN , First Publish Date - 2021-08-03T04:27:44+05:30 IST

పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు నివారణ.

అధిక మోతాదు.. పంటకు చేటు!

  • కలుపు నివారణ రసాయన మందులపై వ్యవసాయ అధికారుల సూచనలు


చేవెళ్ల : పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు నివారణ. తొలగించినా కొద్దీ మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కలుపును సమూలంగా నివారించడానికి అనేక రసాయన మందులు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఈ మందులను ఏ కాలంలో.. ఎంత మోతాదులో వాడాలన్న అవగాహన లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మోతాదుకు మించి వాడితే పంట ఎదుగుదలపై ప్రభా వం చూపుతుంది. కాగా, కలుపు మందుల వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చేవెళ్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి రాజేశ్వర్‌రెడ్డి సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి.


కలుపు మందుల పిచికారిపై సూచనలు

  • కలుపు మందులు పిచికారి చేసే ముందు వ్యవసా యాధికారుల సిఫా రసు, సూచనలు పాటించాలి
  • పంట విత్తిన 48 గంట ల్లోగా (విత్తనాలు మొలకెత్తక ముందే) నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండి మిథాలిన్‌, అలాక్లోర్‌ మందును పిచికారి చేయాలి.
  • వరి మాగాణిలో వెడల్పు కలిగిన కలుపు మొక్కలను నిర్మూలించడానికి నాటేసిన 25 నుంచి 30 రోజుల మధ్య పొలంలోని నీటిని తొలగించాలి. తదుపరి 2, 4-డీ సోడియం సాల్ట్‌ పొడి మందును ఎకరానికి 400గ్రాముల నుంచి 500 గ్రాముల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పడేవిధంగా పిచికారి చేయాలి. మోతాదుకు మించితే పంటకు నష్టం. ఈ కలుపు మందును పత్తి, మినుము, పెసర, పొగాకు పంటలపై వాడరాదు. 
  • కొన్నిరకాల కలుపు మందులకు పంటతోపాటు కలుపు మొక్కలను ఒకేసారి నిర్మూలించే గుణాలు కలిగి ఉంటాయి. ఇలాంటి మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలి. 
  • సొంత పంట పొలాల్లో మందుల పిచికారి చేసేటప్పుడు పక్కనున్న పంట పొలాలపై మందు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. 
  • కలుపు నివారణ కోసం వాడే మందు పంటలపై ప్రభావం చూపుతుందో లేదో ముం దుగానే తెలుసు కోవాలి. లేదంటే పంటల ఎదుగుదల పూర్తిగా స్తంభించే అవకాశం ఉంది.
  • మొక్కజొన్న పంటలో పెరిగే కలుపు నివారణకు రైతులు ఎక్కువ శాతం అట్రజిన్‌ మందును వాడుతుంటారు. ఈ మందు కలుపు నివారణలో సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ మందు అవశేషాలు భూమిలో ఎక్కువకాలం ఇమిడిపోతాయి. కాబట్టి వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. 
  • అతి మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ, దర్భ వంటి కలుపు మొక్కలను పంట పూతరాక ముందే (నాలుగు నుంచి ఆరు ఆకులు వచ్చిన దశలో) గెల్‌పోసెట్‌ మందును పిచికారి చేసి సమూలంగా నివా రించుకోవాలి. ఈ మందును పిచికారి చేసిన అనం తరం ఎనిమిది గంటల్లోగా ఏదైనా వర్షం పడితే మందు ప్రభావం పూర్తిగా సన్నగిల్లే అవకాశం ఉంది. 
  • నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్న కలుపు మందులను ఇసుకలో గానీ, యూరియాలో గానీ కలిపి చల్లరాదు. 
  • కలుపు మందులను పిచికారి చేసేటప్పుడు హ్యాండ్‌ స్ర్పేయర్‌ను మాత్రమే వాడాలి. 
  • స్ర్పేయర్‌ నుంచి ద్రావణం సమానంగా బయటకు వచ్చేలా పిచికారి చేయాలి. పంటపై మళ్లీమళ్లీ పిచికారి చేయొద్దు. అలా చేస్తే మందు మోతాదు ఎక్కువై పంట నష్టం కలుగుతుంది.
  • కలుపు మందు నివారణ మందును ఉదయం, సాయంత్రం వేళలో పిచికారి చేయాలి. ఎదురు గాలి వీచేటప్పుడు కానీ, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కానీ పిచికారి చేయరాదు. పిచికారి చేసే సమయంలో వెనకకు నడుస్తూ ముందుకు పిచికారి చేయాలి. 


వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి

కలుపు నివారణ మందులు వాడే ముందు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి. నకిలీ మందులు కొనుగోలు చేసి మోసపోవద్దు. ఫర్టిలైజర్‌ షాపుల వద్ద బిల్లులు తప్పకుండా తీసుకోవాలి. కలుపు మందులు విషపూరితమైనవి కాబట్టి.. తినే ఆహార పదార్థాలపై పడకుండా, చిన్నపిల్లలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. కలుపు మందు చల్లిన పొలాల గట్ల వెంట పశువులను మేపొద్దు.

- రాజేశ్వర్‌రెడ్డి, ఏఈవో, చేవెళ్ల

Updated Date - 2021-08-03T04:27:44+05:30 IST