పొంగిపొర్లిన వాగులు, వంకలు

ABN , First Publish Date - 2021-07-24T05:17:27+05:30 IST

పొంగిపొర్లిన వాగులు, వంకలు

పొంగిపొర్లిన వాగులు, వంకలు
వరద నీటితో నిండుకున్న ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువు

  • భారీ వర్షంతో ఉధృతంగా ప్రవహించిన మూసీ
  • పరిగి లక్నాపూర్‌ ప్రాజెక్టులోకి భారీగా చేరిన వరదనీరు
  • తాండూరులో వర్షతాకిడికి కూలిన ఇళ్లు

వికారాబాద్‌/పరిగి/ధారూరు/బొంరాస్‌పేట్‌/తాండూరు రూరల్‌/పరిగిరూరల్‌:  గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు శనివారం సైతం కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం సుమారు మూడు గంటల పాటు భారీవర్షం కురవడంతో ఆయాగ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మద్గుల్‌చిట్టంపల్లి, గొట్టిముక్ల వాగులతో పాటు మూసీ ఉధృతంగా ప్రవహించింది. వికారాబాద్‌లోని కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణం జలమయమైంది. పట్టణంలో పలుమార్లు విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అదేవిధంగా పరిగికి తలమానికంగా భావించే లక్నాపూర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్నది. జిల్లాలోని అతితక్కువ వర్షం పాతం పరిగిలో నమోదైనప్పటీకీ ఇతర ప్రాంతాల నుంచి  వరదనీరు చేరుతోంది. 18ఫీట్ల ఎత్తు అలుగు ఉండే ప్రాజెక్టులో 14ఫీట్ల వరకు నీరుచేరింది. అలుగు పారాలంటే ఇంకా నాలుగు ఫీట్ల నీరు రావాల్సివుంది. మరో భారీ వర్షం కురిస్తే పూర్తిస్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయి. ధారూరులోని దోర్నాల వాగు తాత్కాలిక వంతెనపై నుంచి  గురువారం రాత్రి వరదనీరు ప్రవహించింది. దీంతో వంతెన పైపులపై మట్టి కొట్టుకుపోవడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం దోర్నాల సర్పంచ్‌ సుజాత స్వంత డబ్బులతె వాగుపై కొట్టుకుపోయిన మట్టి స్థానంలో మట్టి వేయించి మరమ్మతులు చే యించారు. తాత్కాలిక వంతెనపై తేలిన పైపులపై పది ట్రాక్టర్ల మట్టి వేయించడంతో రాకపోకలు కొనసాగాయి. అదేవిధంగా బొంరా్‌సపేట్‌ మండలంలోని కొత్తూర్‌ గ్రామ సమీపంలోని చెరువులోని నీటిని తూముద్వారా రైతులు శుక్రవారం వదిలారు. ఇదిలా ఉండగా తాండూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి నాలుగు ఇళ్లు కూలాయి. గుంతబాస్పల్లి గ్రామానికి చెందిన తాండూరు ప్రకాష్‌, షబ్బీర్‌మియాల ఇళ్లు వర్షాలకు కూలాయి. ఇళ్లు కూలిన సమయంలో వీరు వేరే గదుల్లో ఉండటంతో ప్రమాదం తప్పింది. అదేవిధంగా బెల్కటూర్‌ గ్రామంలో చిట్టెపు వెంకట్‌రెడ్డి, జినుగుర్తి గ్రామంలో కృష్ణ ఇళ్లు కూలిపోయినట్లు మండల రెవెన్యూ అధికారులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. అదేవిధంగా పరిగి మండలంలోని చిట్యాల్‌ గ్రామానికి చెందిన రమేశ్‌ ఇళ్ళు వర్షానికి కూలిపోయింది. బాధితుడికి సర్పంచ్‌ రజితరాజపుల్లారెడ్డి రూ.5వేలు, మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రూ.10వేలు, చిట్యాల్‌ ఎంపీటీసీ వెంకటేశ్‌ రూ.2వేలు, వార్డు సభ్యురాలు సువర్ణరాజు రూ.2500, మరో వార్డుసభ్యుడు వెంకటయ్య రూ.1500ల చొప్పున ఆర్థికసాయం చేశారు. 

  • నిండుకుండల్లా చెరువులు

ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. మండలంలోని ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువు, పోతరాజిగూడె చెరువు, గుండ్లకుంట చెరువు, వెంకటాపూర్‌లోని నాడెం చెరువు, తెనుగూడెంలోని కుమ్మరికుంట చెరువుల్లోకి నీరు చేరింది. నారాయణరావు ఛానెల్‌ కాలువ నిండుగా ప్రవహిస్తోంది.  ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని జంగయ్యయాదవ్‌ ఎరిమల్లె వాగుతో పాటు లోతట్టు ప్రాంతాలను కమిషనర్‌ వసంత, వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. వాగులు, వంకలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి వెంట కౌన్సిలర్లు, నాగజ్యోతి, అనురాధ, నర్సింగ్‌రావు ఉన్నారు. 

అధికారులు అందుబాటులో ఉండాలి

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా  ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి తగు చర్యలు చేపట్టాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో వాగులు నిండి కాలువలు పూర్తిమట్టంతో ప్రవహిస్తున్నాయని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని, చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. రోడ్లపై నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయకూడదని, ముఖ్యంగా ఈత రాని వారు నీటి ప్రవాహప్రాంతాలు దూరంగా ఉండాలన్నారు. పురాతన భవనాల్లో నివాసముండేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్‌ ఇనుప స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఉండకూడదని, అత్యవసరపరిస్థితిల్లో బయటకు వెళ్లాల్సివస్తే తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-07-24T05:17:27+05:30 IST