నిండా ముంచింది!

ABN , First Publish Date - 2021-11-21T05:30:00+05:30 IST

జిల్లాలో తాజా వర్షాలు అపార నష్టాన్నే మిగిల్చాయి. వాయుగుండం ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకున్న రైతులను నిండా ముంచాయి. జిల్లాలో ఈనెల 12 నుంచి ముసురు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి జిల్లా తూర్పు, దక్షిణ ప్రాంతంలో భారీగా పడ్డాయి. వీటికి వాయుగుండంతోడైంది. జిల్లాలో ఈనెలలో సాధారణ వర్షపాతం 143.7మి.మీ. కాగా ఇప్పటి వరకు ఇంచుమించు 247.8మి.మీ కురిసింది.

నిండా ముంచింది!
పర్చూరు ప్రాంతంలో వరద నీటిలో ఉన్న పొగాకు తోట

 మూడు రోజుల్లో 89.7 మి.మీ సగటు వర్షపాతం 

తుడిచిపెట్టుకుపోయిన మినుము

ఉరకెత్తిన మిర్చి, వరి, పొగాకు 

పలు ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న వాగులు 

మరింత దారుణంగా రోడ్లు 

రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు 

హైవేపై వాహనాలు,

ఒంగోలు, చీరాలల్లో రైళ్లు నిలిపివేత

వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌కు గండి

ఒంగోలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) :

వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రైతుల వెన్ను విరిచాయి. వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. మినుము తుడిచిపెట్టుకుపోగా.. మిర్చి, వరి, పొగాకు పంటలు ఉరకెత్తుతున్నాయి. ఇంకా వేలాది ఎకరాలు నీటిలో ఉన్నాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. మరోవైపు వాగులు, వంకలు ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో రైల్వే ట్రాక్‌, జాతీయ రహదారి దెబ్బతినడంతో ఆమార్గంలో రవాణా స్తంభించింది. ఒంగోలు, చీరాలల్లో కొన్ని రైళ్లను నిలిపివేశారు. జాతీయ రహదారి నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆపేశారు. మరోవైపు రెండున్నరేళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దోర్నాల మండలం కటకానిపల్లి వద్ద ఎగువ నుంచి భారీ వర్షంతో ఫీడర్‌ కాలువకు గండి పడి దిగువన ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. 

 

 జిల్లాలో తాజా వర్షాలు అపార నష్టాన్నే మిగిల్చాయి. వాయుగుండం ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకున్న రైతులను నిండా ముంచాయి. జిల్లాలో ఈనెల 12 నుంచి ముసురు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి జిల్లా తూర్పు, దక్షిణ ప్రాంతంలో భారీగా పడ్డాయి. వీటికి వాయుగుండంతోడైంది. జిల్లాలో ఈనెలలో సాధారణ వర్షపాతం 143.7మి.మీ. కాగా ఇప్పటి వరకు ఇంచుమించు 247.8మి.మీ కురిసింది. అందులో గురువారం రాత్రి నుంచి మూడురోజుల్లోనే దాదాపు 89.7 మి.మీ పడింది. అందులో ఆదివారం ఉదయానికి 24 గంటల్లో సుమారు 32.2 మిమీ నమోదైంది. చాలాప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 

ఇంకా నీటిలోనే లక్ష ఎకరాలు

జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని పంట పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వాటిలో దాదాపు 25వేలకుపైగా ఎకరాల్లో మినుము తుడిచిపెట్టుకుపోయినట్లేనని భావిస్తున్నారు. 40వేల ఎకరాల్లో మిర్చి, 10వేల ఎకరాల్లో పొగాకు, వైట్‌బర్లీ, మరో 10వేల ఎకరాల్లో శనగ, పత్తి, మొక్కజొన్న, వరి ఇతరత్రా పంటలు మరికొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. వీటిలో అధిక విస్తీర్ణంలోని పంటలు ఉరకెత్తడం, కొన్ని రకాల పంటలు నీళ్లలోనే కుళ్లిపోయినట్లు రైతులు చెప్తున్నారు. వర్షం వెలిస్తే జిల్లాలోని ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ పంట నష్టం మరింత వెలుగు చూసే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. 

నిండిన రాళ్లపాడు

వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అత్యధిక ప్రాంతాల్లో నీటి వనరుల్లోకి భారీగా నీరు చేరడంతోపాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గండ్లకమ్మలోకి భారీగా నీరు వస్తుండగా రాళ్లపాడు ప్రాజెక్టు నిండిపోయింది. మోపాడు ప్రాజెక్టులోకి 21 అడుగుల నీరు చేరగా... పలు చిన్న పెద్ద చెరువులు నిండాయి. మరోవైపు పలుచోట్ల ఆదివారం కూడా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పర్చూరు నియోజకవర్గంలోని దగ్గుబాడు, దుద్దుకూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కాలువకు గండ్లుపడ్డాయి. దోర్నాల మండలం కట్టకానిపల్లి వద్ద ఎగువ నుంచి భారీ వర్షంతో ఫీడర్‌ కాలువకు గండి పడి దిగువన ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. 

రవాణాకు ఆటంకం

నెల్లూరు జిల్లాలో వర్ష భీభత్సవంతో రోడ్లు, రైల్వే మార్గాలు దెబ్బతినడంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. జాతీయ రహదారిపై జిల్లా పరిధిలో భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. టంగుటూరు టోల్‌ప్లాజా, మార్టూరు, ఉలవపాడు, సింగరాయకొండ  ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి వాహనాలను ఆపేశారు.  అలాగే ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్‌లలో పలురైళ్లను రైల్వే అధికారులు నిలిపేశారు. చీరాల స్టేషన్‌లో కోరమండల్‌, వేటపాలెంలో పూరి ఎక్స్‌ప్రెస్‌లు అలాగే ఒంగోలులో మరో రెండు రైళ్లను ఆపేశారు. మధ్యాహ్నం తర్వాత వాటిని గుంటూరు, విజయవాడకు మళ్లించారు.  మరో రెండు రోజులపాటు చెన్నై నుంచి విజయవాడ మార్గంలో రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం. 

రోడ్ల పరిస్థితి దారుణం

తాజా వర్షాలతో జిల్లాలోని అత్యధికశాతం రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే రెండేళ్లుగా కనీస మరమ్మతులు కూడా లేక ఆధ్వానంగా ఉన్న రోడ్లు తాజా వర్షాలతో మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. చీమకుర్తి-పొదిలి మధ్య గ్రానైట్‌ క్వారీల ప్రాంతంలో రోడ్లు అత్యంత దారుణంగా ఉండగా, దర్శి-అద్దంకి మధ్య అలాగే ఉంది. ఇక భారీ వర్షాలు కురిసిన కందుకూరు, కొండపి, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని పలు చిన్న, పెద్ద రోడ్లు ఛిద్రమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. 


రైతులను ఆదుకోవాలి

టీడీపీ ఎమ్మెల్యేల బృందం డిమాండ్‌

 జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు. తక్షణమే పంట నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో నీటి మునిగి ఉరకెత్తిన మిరప పైరును ఆదివారం వారు మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, యువనాయకులు దామచర్ల సత్య తదితరుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ చెప్పేదానికి చేసే దానికి విరుద్ధంగా ఉన్నదన్నారు. వ్యవసాయరంగం పురోగతిలో ఉందని కల్లబొల్లి కబుర్లు చెప్తూ కాలం వెల్లదీస్తోందన్నారు. మార్కాపురం డివిజన్‌లో ముఖ్యంగా మిరప, శనగ పంటలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు సుమారు 50వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయని వారు తెలిపారు. గత ఏడాది కురిసిన వర్షాలకు కొనుగోలుదారులు లేక మిరప కాయలు కోల్డ్‌ స్టోరేజీలలో మగ్గుతున్నాయన్నారు. ఈ ఏడాది ఖరీప్‌, రబీలలో సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు.  వర్షాలతో నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం  ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయరెడ్డి, నాయకులు పోలిరెడ్డి, తాండ్ర వెంకటేశ్వర చౌదరి పాల్గొన్నారు. 








Updated Date - 2021-11-21T05:30:00+05:30 IST