Karthikeya-2: ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న ‘కార్తికేయ-2’! ఇప్పటివరకూ ఎంత రాబట్టిందంటే..

ABN , First Publish Date - 2022-08-19T01:41:32+05:30 IST

నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ ఓవర్సీస్ కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి.

Karthikeya-2: ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న ‘కార్తికేయ-2’! ఇప్పటివరకూ ఎంత రాబట్టిందంటే..

ఎన్నారై డెస్క్: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ-2(Karthikeya-2) మూవీ ఓవర్సీస్ కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. విదేశాల్లో ఈ సినిమా కలెక్షన్స్ మిలియన్ డాలర్ల మార్కుకు చేరువవుతున్నాయి. పరిమిత బడ్జెట్‌తో రూపొందించిన ఓ సినిమా ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ పండితులనూ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘కార్తికేయ-2’ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా విదేశీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ఆధారంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతూ డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు తెచ్చిపెడుతోంది.


‘కార్తికేయ-2’తో హీరో నిఖిల్‌ సిద్ధార్థ(Nikhil Siddharth).. తన కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఓవర్సీస్ కలెక్షన్ల(Overseas collections) వివరాలను ఆయన స్వయంగా ట్విటర్‌లో షేర్ చేశారు. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటివరకూ ఈ సినిమా 7 లక్షల డాలర్లు రాబట్టిందని చెప్పారు. సినిమాను ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా గురించి తెలియని వారందరికీ తెలియజెప్పాలని, సమీప థియేటర్లలో వీక్షించాలని విదేశాల్లోని వారిని ఆయన కోరారు. 


ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌లో అనూహ్య విజయాలు సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఒరవడిని కార్తికేయ-2 కూడా కొనసాగిస్తోంది. హిందీ ప్రాంతాల్లో తొలుత కేవలం 70 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కానీ.. ప్రేక్షకులు ఈ సినిమాను బంపర్ హిట్ చేయడంతో ప్రస్తుతం 1500కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ ఛద్ధా’(Lal singh chadda) కలెక్షన్లను కూడా దాటిపోయింది. ఆల్ ఇండియా స్థాయిలో మంగళవారం రూ.3.5 కోట్ల వసూళ్లు రాబట్టింది.



Updated Date - 2022-08-19T01:41:32+05:30 IST