భక్తి పేరుతో బోల్తా కొట్టించారు

ABN , First Publish Date - 2020-11-24T10:25:15+05:30 IST

ఆధ్యాత్మిక భావాలున్న నగర యువతిని.. సైబర్‌నేరగాళ్ల ముఠా అదే భక్తి పేరుతో మోసం చేసింది. రూ. 4కోట్లు పంపుతున్నామంటూ..

భక్తి పేరుతో బోల్తా కొట్టించారు

 నగర యువతికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

 నాలుగు కోట్లు ఇస్తున్నామంటూ మెయిల్స్‌

 29 లక్షలు కొల్లగొట్టిన నైజీరియన్‌ గ్యాంగ్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక భావాలున్న నగర యువతిని.. సైబర్‌నేరగాళ్ల ముఠా అదే భక్తి పేరుతో మోసం చేసింది. రూ. 4కోట్లు పంపుతున్నామంటూ.. రూ. 29.74లక్షలు కొల్లగొట్టింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఢిల్లీకి చెందిన సైబర్‌ గ్యాంగ్‌ ఆటకట్టించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4పీఓఎస్‌ మిషన్స్‌, ఒక ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్స్‌, 74వేల డిపాజిట్‌ స్లిప్స్‌, ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.


సఫిల్‌గూడ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భక్తి సంబం ధించిన విషయాలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఆమె వాట్సాప్‌ నంబరుకు +44 కంట్రీకోడ్‌ నుంచి చిబూకే క్రిస్టియన్‌ అనే వ్యక్తి మెసేజ్‌ చేశాడు. మీ ఆధ్యాత్మిక భావాలు నన్ను కట్టిపడేశాయంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ తర్వాత ఈ-మెయిల్‌ పంపి.. రూ. 4 కోట్ల విలువ చేసే అమెరికా డాలర్లను పంపుతున్నట్లు పేర్కొన్నాడు. వాటిని భారత్‌లో పేదల సంక్షేమానికి వినియోగించాలని కోరాడు. దాంతో ఆ యువతి సరేనంది. ఆ తర్వాత ఆమెకు సోనియా శర్మ అనే యువ తి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘కస్టమ్స్‌ విభాగం నుంచి మాట్లాడుతున్నా.. మీకు అమెరికా నుంచి పార్శిల్‌ వచ్చింది. అందులో రూ. 4 కోట్లు విలువ చేసే అమెరికా డాలర్లున్నాయి. మీకు ఆ పార్శిల్‌ అందాలంటే.. ఆర్బీఐ క్లియరెన్స్‌, జీఎస్టీ, కస్టమ్స్‌ చార్జీలు, బీమా చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది.




అలా.. వేర్వేరు చార్జీల పేరుతో గత నెల 27 నుంచి ఈ నెల 6 వరకు విడతల వారీగా రూ. 29.74 లక్షలు కొల్లగొట్టింది. వారు చెప్పిన డబ్బు మొత్తం చెల్లించినా.. పార్శిల్‌ రాకపోవడంతో.. సోనియాకు ఫోన్‌ చేసింది. ఆమె ఫోన్లు స్విచాఫ్‌ అయ్యి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించి.. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్స్‌ బృందం.. త్రిపుర, కోల్‌కతా, ఢిల్లీలకు చెందిన ఖాతాలకు బాధిత యువతి నుంచి డబ్బు వెళ్లినట్లు గుర్తించింది. చిబూకే క్రిస్టియన్‌ అరిరిగుబునాము అనే నైజీరియా దేశస్థుడిని ఢిల్లీలో అరెస్టు చేసింది. పోలీసులు అరెస్టు చేసే సమయంలో.. నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో.. ఓ ఏఆర్‌ఎస్సై, ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అరెస్టు సమయంలో.. నిందితుడు చిబూకే తెలుగులో మాట్లాడడం గమనార్హం. ఈ మోసంలో చిబూకేకు సహకరించిన అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తిని కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. మరో నిందితురాలు సోనియాశర్మ పరారీలో ఉంది.


Updated Date - 2020-11-24T10:25:15+05:30 IST