Owaisiని ర్యాలీ వద్ద నుంచి వెంటాడిన నిందితులు...కొన్నాళ్లుగా దాడికి ప్లాన్

ABN , First Publish Date - 2022-02-04T12:59:54+05:30 IST

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయన్ను వెంటాడారని పోలీసుల దర్యాప్తులో తేలింది...

Owaisiని ర్యాలీ వద్ద నుంచి వెంటాడిన నిందితులు...కొన్నాళ్లుగా దాడికి ప్లాన్

న్యూఢిల్లీ: మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయన్ను వెంటాడారని పోలీసుల దర్యాప్తులో తేలింది.సభలు, ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు సచిన్, శుభంలు ఒవైసీపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితులు మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు హాజరై, దాడికి పథకం పన్నారని సమాచారం. ఒవైసీపై దాడి చేసిన నిందితులు మీరట్ ర్యాలీలో పాల్గొన్నారనే సమాచారంతో పోలీసులు ర్యాలీకి సంబంధించిన సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని వెంబడిస్తున్నారని, అయితే ఆయనపై దాడి చేసే అవకాశం రాలేదని పోలీసులు చెప్పారు. 


మీరట్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఒవైసీ వాహనం టోల్ గేటు వద్ద ఆగింది. అవకాశం చూసి నిందితులు ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపారు.నిందితులు సచిన్, శుభంలు సైద్ధాంతికంగా తీవ్రవాద స్వభావం ఉన్నవారని పోలీసు అధికారులు చెప్పారు. నిందితుల్లో ఒకరైన సచిన్ మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ప్రసంగాలపై చాలా కోపంగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.సచిన్ కొద్ది రోజుల క్రితమే కంట్రీ మేడ్ పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సచిన్ కు ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఒవైసీపై కాల్పులు జరిపిన తర్వాత నిందితులిద్దరూ గుంపు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


Updated Date - 2022-02-04T12:59:54+05:30 IST