వికటిస్తోంది!

ABN , First Publish Date - 2021-05-07T05:07:43+05:30 IST

మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఓ వ్యాపారి భార్య కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారు. ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ స్థానిక వైద్యుడి సలహాతో ఇంటి వద్దే మందులు వాడారు. కానీ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ రూ.15 లక్షలు ఖర్చుచేసినా ప్రయోజనం లేకపోయింది. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. జిల్లాలో చాలామంది కరోనా భాధితులు ఇదే విధంగా సొంత వైద్యాన్ని నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

వికటిస్తోంది!

సొంత వైద్యంతో మూల్యం

నిర్థారణ పరీక్షలు చేసుకోకుండానే మందులు వాడుతున్న వైనం

చివరి క్షణాల్లో ఆస్పత్రులకు తరలింపు

ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు

 (మెళియాపుట్టి)

మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఓ వ్యాపారి భార్య కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారు. ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ స్థానిక వైద్యుడి సలహాతో ఇంటి వద్దే మందులు వాడారు. కానీ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ రూ.15 లక్షలు ఖర్చుచేసినా ప్రయోజనం లేకపోయింది. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. జిల్లాలో చాలామంది కరోనా భాధితులు ఇదే విధంగా సొంత వైద్యాన్ని నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైరస్‌ నిర్థారణ అయిన వెంటనే అధికారులు బాధితులను అప్రమత్తం చేస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించడానికి సిద్ధమవుతున్నారు. శ్వాస సంబంధ సమస్య తీవ్రంగా ఉంటే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉంటూ.. ఇంటి వద్ద వైద్యానికి మొగ్గు చూపుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు, భోజనం అందదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇంటి వద్ద ఉంటూ ఆర్‌ఎంపీలు సూచించిన మందులతో నెట్టుకొస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి ఉన్నవారు కోలుకుంటున్నారు. లేనివారి పరిస్థితి రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. దీంతో చివరి క్షణంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే నష్టం జరిగిపోతోంది. మరోవైపు లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. అటు ప్రాణం దక్కకపోగా... బాధిత కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. కొందరైతే సామాజిక మాధ్యమాల్లో నిపుణులు సూచిస్తున్నారంటూ మందులు వాడుతున్నారు. కానీ ఇతర శారీరక లక్షణాలు పరిగణనలోకి తీసుకోకుండా సొంత వైద్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. అవి వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కరోనా భయంతో ఏ చిన్న రుగ్మత ఎదురైనా వైరస్‌గానే భావిస్తున్నారు. లక్షణాలు కనిపించినా చాలామంది నిర్థారణ పరీక్షలు చేసుకోవడం లేదు. కరోనా మందులనే వినియోగిస్తున్నారు. ఇప్పటికే తమకు తెలిసిన వారికి కరోనా సోకితే.... ఆ సమయంలో వారు వాడిన మందుల వివరాలను తెలుసుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి ఎలా ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయా? ఇతర రుగ్మతల తీవ్రత ఎలా ఉంది? అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. చిన్నపాటి దగ్గు వచ్చినా.. పారాసెట్‌మాల్‌, అజిత్రోమైసిన్‌, విటమిన్‌-సీ,డీ, జింకోవిట్‌ వంటి మాత్రలను వాడుతున్నారు. ఇలా సొంత వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. ఇంతలో శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. 


నిర్థారణ పరీక్షలు తప్పనిసరి

లక్షణాలు కనిపించిన వెంటనే కచ్చితంగా నిర్థారణ పరీక్షలు చేసుకోవాలి. పాజిటివ్‌గా తేలితే వైరస్‌ తీవ్రతను బట్టి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తారు. అవసరమైతే నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్‌ అందిస్తారు. సొంత వైద్యం చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

జి.గణపతిరావు, వైద్యాధికారి, చాపర 

Updated Date - 2021-05-07T05:07:43+05:30 IST