అభివృద్ధి పనులపై పెత్తనం

Dec 8 2021 @ 00:56AM
సాత్నాల క్వాటర్స్‌ సమీపంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం ఇదే..

మేం చెప్పిందే చేయాలంటున్న బల్దియా నేతలు

పట్టణాభివృద్ధి పనులపై పలువురు నాయకుల హుకుం 

ఖాళీ జాగాలపై కన్నేస్తూ.. అడ్డగోలుగా అద్దె వసూలు చేస్తున్న వైనం

పట్టణంలో రోడ్డు విస్తర్ణ పనులకు అడుగడుగునా ఆటంకాలు 

జిల్లాకేంద్రంలో చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

ఆదిలాబాద్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): కొంత మంది బల్దియా నేతలు మేం చెప్పిందే చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేయడం పరిపాటిగా మారింది. పట్టణాభివృద్ధి కి పాటు పడుతామని ఎన్నో బాసలు చేసి, ఎన్నికల్లో గెలుపొందిన పలువురు నేతలు.. ఇచ్చిన హామీలను మరిచిపోయి అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారు. అధికారులపై ఒత్తిడి చేస్తూ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పట్టణంలో సుమారుగా రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ప్రధానంగా రోడ్ల విస్తర్ణ, ప్రధాన చౌక్‌ల ఆధునికీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పాత నేషనల్‌ హైవే రోడ్డు పై డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌, పట్టణానికి ముఖ ద్వారం, సెల్ఫీ పాయింట్‌ పూర్తి కావడంతో పట్టణ రూపు రేఖలే మారిపోయాయి. మిగిలిన రోడ్డు విస్తర్ణ పనులు కొనసాగుతున్నా.. కొందరు బల్దియా నేతల తీరుతో అర్ధాం తరంగానే నిలిచి పోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటూ పట్టణాభివృద్ధిని విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పోటాపోటీగా పట్టణంలో కబ్జా చేస్తున్న రోడ్లు, ఖాళీ స్థలాలపై ఫిర్యాదులు చేసుకుంటూ అభివృద్ధి పనులకు బ్రేక్‌ వేస్తున్నారు. అధికారులు చెప్పినా.. వినిపించుకోక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్ధి స్థానిక సంస్థల పాలనను మరింత మెరుగు పరిచేందుకు ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమించినా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించకపోవడం గమనార్హం. రాజకీయ జోక్యం పెరిగి పోవడంతో ఉన్నతాధికారులు విసుగెత్తి పోతున్నట్లు తెలుస్తుంది. అభివృద్ధి పనుల్లో పురోగతి లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు పంతాలు వీడి పట్టణాభివృద్ధికి పాటు పడితే పట్టణ ప్రగతి మరింత పరుగులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. 

ఫ ఖాళీ జాగా కనిపిస్తే కబ్జానే..

పట్టణంలో ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు రోజుల వ్యవధిలోనే కబ్జా చేసేస్తున్నారు. ఇదంతా ఎవరో తెలియని మాములు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారంటే పొరపాటే. కొందరు ప్ర ముఖ ప్రజాప్రతినిధులే తెరవెనుకుండి ఖాళీ జాగాలపై కన్నేస్తున్నారు. మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు అడ్డు చెబితే తమ రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు దిగుతున్నారు. పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా రాత్రికి రాత్రే అడ్డాలు వేయడం, ఆపై చిరు వ్యాపారులకు అద్దెకు ఇస్తూ వసూలు చేయడం కొందరు నేతలకు అలవాటుగా మారింది. గత నెల క్రితమే కైలాస్‌నగర్‌ కాలనీలో సాత్నాల క్వాటర్స్‌ను ఆనుకుని రిమ్స్‌ ఆసుపత్రి వెనకాల రోడ్డు వెంట ఉన్న ఖాళీ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేసి వెదురు తడకలతో హద్దు లు చేసుకున్నారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకంటే ఈ స్థలం వ్యవహారంలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి తలదూర్చడంతో అధికారులు జంకుతున్నట్లు తెలిసింది. కోట్ల విలువ చేసే ఈ స్థలంపై ఆ నేత కన్నుపడడంతో కబ్జాదారులను బెదిరించే ప్రయత్నం చేసి రూ.10 లక్షలు సెటిల్‌మెంట్‌ చేసి దండుకున్నట్లు తెలుస్తుంది. ఈ స్థలం పై గత కొంతకాలంగా ఇరిగేషన్‌ అధికారులు కూడా అభ్యంతరాలు చెబుతున్నా.. అధికారులు పట్టించుకోక పోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఫ అధికారులకు బెదిరింపులు

పట్టణంలో  పలు రోడ్డు విస్తర్ణ పనులను నిలిపి వేయాలని కొందరు బల్దియా నేతలు అధికారులను నిత్యం బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ నేత ఏకంగా ము న్సిపల్‌ ఉన్నతాధికారిని బెదిరింపులకు గురి చేసినట్లు ప్రచారం జరి గింది. పట్టణంలోని పాత బస్టాండ్‌, మటన్‌ మార్కెట్‌ను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో కొందరు టేలాలు(కోకాలు) వేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు విస్తర్ణలో ఆక్రమణలను తొలగించాలని అధికారులు చెప్పినా.. వినిపించుకోక పోవడంతో పనులను అర్ధాంతరంగానే నిలిపి వేశారు. అలాగే వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ నుంచి సాత్నాల బస్టాండ్‌ వైపు వచ్చే మార్గంలోను రోడ్డుకు ఇరువైపుల అక్రమంగా టేలాలు వేసి కబ్జా చేయడంతో పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై కొందరు నేతలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకోవాలని బల్దియా అధికారులను ఆదేశించారు. ఈ విషయమై పక్షం రోజులు గడుస్తున్నా అతీగతి లేదు. పాత బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డుపై వెలసిన నిర్మాణాలను తొలగించాలని స్థానిక కౌన్సిలర్‌ పెట్రోల్‌ డబ్బాతో అధికారుల ముందే హైడ్రామా చేసినా, అక్రమార్కులపై వారు కనీస చర్యలు తీసుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని నీతులు చెప్పే అధికారులే.. రోడ్డు అక్రమాలపై ఎందుకు నోరు మెదుపడం లేదోనన్న? ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం

: రిజ్వాన్‌భాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, ఆదిలాబాద్‌

మున్సిపల్‌ ఫరిధిలో జరుగుతున్న ఆక్రమణలపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పాత బస్టాండ్‌ ప్రాంతంలో కబ్జా స్థలంలో ఏర్పడిన టేలాలను తొలగించే విషయమై మున్సిపల్‌ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సాత్నాల క్వాటర్స్‌ ఆనుకుని ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశిస్తాం. పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.